కాక్రోచ్ జనతా పార్టీ!
ABN , Publish Date - May 20 , 2026 | 02:34 AM
దేశంలో ఇప్పటికే అనేకానేక రాజకీయపార్టీలున్నాయి. కానీ, ఏ పార్టీ కూడా బొద్దింకను పేరుగా పెట్టుకొని ఉండదు. తాజాగా, ఓ 30 ఏళ్ల యువకుడు అభిజీత్ దీప్కే ఈ పని చేశాడు.
నిరుద్యోగులు బొద్దింకల్లా మారారన్న సీజేఐ వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త పార్టీ
రెండ్రోజుల్లోనే 40 వేల మంది సభ్యులు
న్యూఢిల్లీ, మే 19: దేశంలో ఇప్పటికే అనేకానేక రాజకీయపార్టీలున్నాయి. కానీ, ఏ పార్టీ కూడా బొద్దింకను పేరుగా పెట్టుకొని ఉండదు. తాజాగా, ఓ 30 ఏళ్ల యువకుడు అభిజీత్ దీప్కే ఈ పని చేశాడు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) పేరుతో పార్టీని స్థాపించాడు. ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ (సోమరితనం)’ తమ నినాదమని ప్రకటించాడు. అంతా వింతగా ఉందని అనుకుంటున్నారా? నిజమే.. ఇది దేశంలోని పరిణామాలపై ఓ వ్యంగ్య బాణం. నిరుద్యోగులు సోమరిపోతుల్లా, బొద్దింకల్లా తయారై జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీజేఐ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. దీంట్లో భాగంగానే అభిజీత్ దీప్కే.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ని స్థాపించినట్లుగా సోషల్ మీడియాలో ఈ నెల 16వ తేదీన ప్రకటించారు. పార్టీ యువత కోసం పని చేస్తుందని, ప్రజల సొమ్ము ఎటు పోతుందో నిలదీయటానికి పార్టీ పెట్టామని తెలిపారు. దీంట్లో చేరటానికి అర్హతలు.. నిరుద్యోగం, సోమరితనం (భౌతికంగానే.. మానసికంగా కాదు), ఆన్‌లైన్‌కు (ఫోన్‌కు, సోషల్ మీడియాకు) అతుక్కొని ఉండటం, వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్భుతంగా వెళ్లగక్కే నైపుణ్యం కలిగి ఉండటం అని పేర్కొన్నారు. ఎక్స్‌లో సీజేపీ గురించి ప్రకటించగానే అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 48 గంటల్లో 40 వేల మందికిపైగా సభ్యులుగా చేరారు. లోక్‌సభలో అధికారపక్షం మీద నిప్పులు కురిపించే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తన అర్హతల గురించి ప్రస్తావిస్తూ.. ‘నాకు యాంటీ నేషనల్ పార్టీ సభ్యత్వం ఉంది. మీతో కలిసి పని చేయవచ్చా?’ అని ప్రశ్నించారు. యాంటీ నేషనల్ అంటూ బీజేపీ మద్దతుదారులు తన మీద చేసే ఆరోపణలను వ్యంగ్యంగా తిప్పికొడుతూ ఆమె ఇలా స్పందించారు. దీనికి సీజేపీ బదులిస్తూ.. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడే యోధురాలైన మీకు స్వాగతం’ అంటూ జవాబిచ్చింది. అలాగే, తృణమూల్‌కే చెందిన మరో ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్.. సీజేపీలో చేరటానికి అర్హతలేమిటి అని ప్రశ్నించగా.. ‘1983 క్రికెట్ వరల్డ్ కప్‌ను గెల్చుకోవటానికి మించిన అర్హత ఏముంటుంది?’ అని సమాధానమిచ్చింది.
సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ సీజేపీ అజెండాకు కొన్ని అదనపు అంశాలను సూచించారు. సమాచారహక్కు చట్టం కింద ప్రజలకు పార్టీ జవాబుదారీగా ఉండాలి, ఎలక్టోరల్ బాండ్స్‌తోసహా అజ్ఞాతవ్యక్తులు ఇచ్చే విరాళాల్ని స్వీకరించరాదు, ఏనాటికి కూడా రహస్య కాక్రోచ్ కేర్స్ ఫండ్‌ను ప్రారంభించవద్దు (పీఎం కేర్స్‌ను పరోక్షంగా ఉద్దేశించి) అని పేర్కొన్నారు. వీటికి సీజేపీ మద్దతు తెలపటమే కాదు.. తమ మేనిఫెస్టోలో భాగం చేస్తున్నామని పేర్కొంది. తమను ఈ రకంగా మునివేళ్ల మీద నిలబెట్టటమే తమకు కావాలని తెలిపింది. ఈ విధంగా ఉనికిలోకి రావటంతోనే సంచలనంగా మారిన సీజేపీ నిజంగానే రాజకీయ పార్టీగా మారుతుందా? అన్నది ప్రస్తుతానికి తెలియదు. కాకపోతే, ఎలా పని చేయాలి అన్నదానిపై త్వరలో ఆన్‌లైన్ సదస్సు నిర్వహిస్తామని అభిజీత్ దీప్కే ప్రకటించారు.
ఐదు అంశాలతో మేనిఫెస్టో
తాము అధికారంలోకి వస్తే చేపట్టే పనుల పేరుతో సీజేపీ ఐదు అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. అవి 1. పదవీ విరమణ చేసే ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇవ్వబోము 2. నిజమైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోయినా దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఉపా చట్టం కింద అరెస్టు చేసి విచారణ జరుపుతాం. ఓటింగ్ హక్కుల నిరాకరణ ఉగ్రవాదానికి ఏమాత్రం తక్కువ కాదు. 3. పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తాం. కేంద్ర క్యాబినెట్‌లో సగం పదవులు మహిళలకు ఇస్తాం 4. అదానీ, అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తాం. గోదీ మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు జరిపిస్తాం. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పని చేయటానికి దారులు వేస్తాం. 5. పార్టీ ఫిరాయించే ఎంపీ, ఎమ్మెల్యేల మీద 20 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తాం.