కాక్రోచ్ నేతలపై ‘లుకౌట్’!
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:23 AM
కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నాయకులు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లపై కేంద్ర ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
సౌరవ్ దాస్, అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకాపై జారీ
సౌరవ్ దాస్ పాస్‌పోర్టులో లోపాలు
అది ఆయన పౌరసత్వంపై ప్రభావం చూపొచ్చు: కేంద్రం
ఢిల్లీ, నవంబరు 26: కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నాయకులు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లపై కేంద్ర ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. గత నెల రెండో తేదీన ముంబైలోని శివాజీ పార్కులో నిర్వహించిన ధర్నా సందర్భంగా వీరు చట్టాన్ని ఉల్లంఘించారని అదే నెల మూడో తేదీన శివాజీ పార్కు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసుల విజ్ఞప్తి మేరకు దీప్కే, అశుతోష్ రాంకాలపై లుకౌట్ నోటీసులు జారీచేసినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. సౌరవ్ దాస్ పాస్‌పోర్టు వివరాల్లో తేడాలున్నాయని, అందుకుగాను ఆయనపై లుకౌట్ నోటీసు జారీచేసినట్లు పేర్కొంది. ఇంగ్లండ్‌కు వెళ్లకుండా తనను ఎయిర్‌పోర్టులో అడ్డగించడంపై సౌరవ్ దాస్ గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రిజనల్ పాస్‌పోర్టు అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేసినంత మాత్రాన విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోలేరని వాదించారు. తనపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయాన్ని అధికారులు చెప్పలేదని తెలిపారు. ముందుగా తనకు సమాచారం ఇవ్వకుండా విదేశీ ప్రయాణాన్ని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపిస్తూ.. సౌరవ్ పాస్‌పోర్టులోని వివరాల్లో తేడాలున్నాయని.. అవి ఆయన పౌరసత్వంపై కూడా అవి ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. చదివిన స్కూలు, చిరునామా, కుటుంబ వివరాలు పాస్‌పోర్టులో తేడాగా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. పాస్‌పోర్టులోని వివరాల్లో తేడాలపైనే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. కాగా, తమ నేతల పట్ల కేంద్రం వైఖరిని కాక్రోచ్ జనతాపార్టీ నేతలు ఖండించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటివారు దేశం వదిలి పారిపోతుంటే ఏం చేశారంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.