Share News

ఇంతింతై.. ప్రభంజనమై.. సోషల్‌ మీడియాలో కాక్‌రోచ్‌ జనతా పార్టీ విశ్వరూపం

ABN , Publish Date - May 22 , 2026 | 03:48 AM

అణచివేసే అధికారంపైన.. అవినీతి వ్యవస్థలపైన.. పెల్లుబికే జనాగ్రహం ఎంతో కాలం దాగదు! ఏదో ఒక సమయంలో.. ఏదో ఒక రూపంలో బయటపడుతుంది! మూడడుగుల నేల దానమడిగి విశ్వరూపం ....

ఇంతింతై.. ప్రభంజనమై.. సోషల్‌ మీడియాలో కాక్‌రోచ్‌ జనతా పార్టీ విశ్వరూపం

  • కేవలం ఐదు రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో కాంగ్రెస్‌, బీజేపీలను దాటేసిన సీజేపీ

న్యూఢిల్లీ, మే 21: అణచివేసే అధికారంపైన.. అవినీతి వ్యవస్థలపైన.. పెల్లుబికే జనాగ్రహం ఎంతో కాలం దాగదు! ఏదో ఒక సమయంలో.. ఏదో ఒక రూపంలో బయటపడుతుంది! మూడడుగుల నేల దానమడిగి విశ్వరూపం దాల్చిన వామనుడి చందంగా.. మలయమారుతంలా మొదలై ప్రళయ జంఝ అవుతుంది. ప్రభంజనమవుతుంది. ‘‘నిరుద్యోగులు సోమరిపోతుల్లా, బొద్దింకల్లా తయారై జర్నలిస్టులు, న్యాయవాదులు సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు’‘ అంటూ సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పుట్టిన ఆన్‌లైన్‌ వ్యంగ్య రాజకీయ ఉద్యమ వేదిక.. ‘కాక్‌రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)’ ఇప్పుడు అలాగే సోషల్‌ మీడియాలో విశ్వరూపం దాలుస్తోంది. వ్యవస్థలపై, రాజకీయ పార్టీల అవినీతి వ్యవహారాలపై ‘జెన్‌ జీ’ ఆగ్రహానికి వేదికగా నిలుస్తోంది. ఫలితం.. కేవలం ఐదంటే ఐదు రోజుల్లో సీజేపీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఫాలోవర్ల సంఖ్య దేశంలోని అన్ని ప్రధాన పార్టీల ఖాతాలనూ దాటేసింది! వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఇన్‌స్టాలో 13.8 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. దేశాన్ని పుష్కరకాలంగా అప్రతిహతంగా ఏలుతున్న బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లున్నారు!! ఇన్‌స్టాలో ఆ రెండు పార్టీల ఫాలోవర్ల సంఖ్య ఈ స్థాయికి రావడానికి కొన్నేళ్ల సమయం పట్టింది. కానీ.. ఐదురోజుల క్రితం ఒక అసహనంలోంచి పుట్టిన సీజేపీ ఫాలోవర్ల సంఖ్య.. ‘ఇంతింతై.. వటుడింతై’ అన్నట్టుగా క్షణక్షణానికీ పెరుగుతూ పోతోంది. గురువారం ఉదయానికి 9 మిలియన్లుగా ఉన్న ఫాలోవర్ల సంఖ్య సాయంత్రానికి 14.5 మిలియన్లకు పెరిగింది. అర్ధరాత్రి సమయానికిఏకంగా 18 మిలియన్ల మార్కును దాటేసింది(ఫాలోవర్లలో ప్రపంచంలోని పలు దేశాలవారు ఉంటారు). బద్ధకస్తులైన నిరుద్యోగుల గొంతుకగా తనను తాను అభివర్ణించుకునే సీజేపీ.. యువత చేత, యువత కోసం, యువతే నడిపే (ఆన్‌లైన్‌) పార్టీగా విస్తృత ప్రజాదరణ పొందుతోంది. ఇన్‌స్టాలో సీజేపీ ప్రభంజనం ఇలా కొనసాగుతుండగా.. ‘ఎక్స్‌’లో ఆ పార్టీ ఖాతాను గురువారం నిలిపివేయడం గమనార్హం. వెంటనే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే.. ‘ఊహించినట్టుగానే కాక్‌రోచ్‌ జనతా పార్టీ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు’ అని తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ ఖాతాను హ్యాక్‌ చేయడానికి బుధవారమే ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో.. ఇలాంటిదేదో జరుగుతుందని తాము ఊహించామని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం వేసుకున్న స్వీయ గోల్‌ అని వ్యాఖ్యానించారు. అయితే.. కొన్ని గంటల వ్యవధిలోనే ‘కాక్‌రోచ్‌ ఈజ్‌ బ్యాక్‌’ పేరుతో మరో ఖాతా తెరిచి.. విమర్శకులపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాలో బీజేపీ ఫాలోయర్ల సంఖ్యను దాటేసినందుకే తమ ఖాతాను విత్‌హెల్డ్‌లో పెట్టారంటూ పోస్టు పెట్టారు.


పేరు కోసం పోటీ..

కాక్‌రోచ్‌ జనతాపార్టీ ఈ స్థాయిలో దూసుకుపోతుండడంతో.. ఆ పేరుపై హక్కుల కోసం మూడు వేర్వేరు ట్రేడ్‌ మార్క్‌ అప్లికేషన్లు దాఖలయ్యాయి. అసలు సీజేపీతో ఏ సంబంధమూ లేని అజీమ్‌ ఆడమ్‌భాయ్‌ జామ్‌, అఖండ్‌ స్వరూప్‌ అనే ఇద్దరు వ్యక్తులు, ‘కాక్‌రోచ్‌ జనతా పార్టీ’ అనే ప్రొప్రైటర్‌షిప్‌ సంస్థ ట్రేడ్‌మార్క్స్‌ రిజిస్ట్రీ పోర్టల్‌లో దరఖాస్తులను దాఖలు చేశారు. ఇందులో రెండు (అజీమ్‌ ఆడమ్‌భాయ్‌, అఖండ్‌ స్వరూప్‌) దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన పూర్తయింది, మూడోది లోగో/డిజైన్‌ కూడా కలిగి ఉన్నందున నిబంధనల ప్రకారం దాన్ని వియెన్నా కోడిఫికేషన్‌ ప్రక్రియకు పంపారు.

ఇదీ సీజేపీ నేపథ్యం..

దశాబ్దాలపాటు జాగ్రత్తగా నిర్మించుకుంటూ వచ్చిన పునాదుల ఆధారంగా అధికార పీఠాన్ని అందుకున్న రాజకీయ పార్టీల ఆధిక్యాన్ని.. వ్యంగ్యం, ప్రజాగ్రహం సాయంతో ఐదంటే ఐదు రోజుల్లో బద్దలుగొట్టిన సీజేపీ వ్యవస్థాపకుడు మహారాష్ట్రకు చెందిన అభిజీత్‌ దీప్కే (30). 2020లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ సోషల్‌ మీడియా విభాగంలో పని చేసిన ఆయన.. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌ వర్సిటీలో పబ్లిక్‌ రిలేషన్స్‌ విద్యార్థిగా ఉన్నారు. ప్రజల సొమ్ము ఎటు పోతుందో నిలదీయటానికే సీజేపీని స్థాపించానని.. ఈ పార్టీ యువత కోసం పనిచేస్తుందని ఆయన తెలిపారు. సీజేపీలో చేరటానికి అర్హతలు.. నిరుద్యోగం, సోమరితనం (భౌతికంగానే మానసికంగా కాదు), ఆన్‌లైన్‌కు (ఫోన్‌కు, సోషల్‌ మీడియా కు) అతుక్కొని ఉండటం, వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్భుతంగా వెళ్లగక్కే నైపుణ్యం కలిగి ఉండటం అని అభిజీత్‌ దీప్కే పేర్కొన్నారు.

Updated Date - May 22 , 2026 | 01:42 PM