Share News

తుమ్మిడిహెట్టికిఅనుమతులు ఇప్పించండి

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:50 AM

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి చేశారు

తుమ్మిడిహెట్టికిఅనుమతులు ఇప్పించండి
RevanthReddy

  • ‘తుమ్మిడిహెట్టి’ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించండి..

  • పీఆర్‌ఎల్‌ఐఎస్‌, సీతారామలకు సహకరించండి

  • జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు

  • ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించామని కేంద్ర మంత్రికి తెలియజేశారు. మంగళవారం ఆయన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి.. సీఆర్‌పాటిల్‌ను ఢిల్లీలో కలిశారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్‌ ప్లస్‌ 152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా చూడాలని కోరారు. ఆ స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ఆధారంగా నీటిని ఎల్లంపల్లికి తరలించేందుకు వీలుంటుందని తెలిపారు. ఫలితంగా నీటి తరలింపునకు అవసరమయ్యే విద్యుత్‌ వినియోగం, విద్యుత్‌ వ్యయం తగ్గుతుందని వివరించారు. అలాగే.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్‌), డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్‌ఐఎస్‌), సీతారామ సాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు (ఎస్‌ఎ్‌సఎంపీ), గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనుమతుల జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతోందని ఆవేదన వెలిబుచ్చారు. సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను త్వరగా మంజూరు చేయాలని సీఎం కోరారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించామని.. నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


ఈ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం పొందేందుకు తాము చర్చిస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు. కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించేందుకు.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలో టెలీమెట్రీ యంత్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. మొదటి దశ టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుకు అవసరమైన రూ.4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా.. ఈ సమావేశంలో మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల) ఆదిత్యనాథ్‌దాస్‌, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 05:54 AM