Share News

క్లస్టర్‌ వార్‌హెడ్‌.. డిఫెన్స్‌ వ్యవస్థలకు చెక్‌!

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:37 AM

ఇరాన్‌ తమ దేశంపై ప్రయోగిస్తున్న క్షిపణుల్లో క్లస్టర్‌ వార్‌హెడ్‌లు వినియోగిస్తోందని, దానితో పౌర ఆవాసాలు ధ్వంసం అవుతున్నాయని ఇజ్రాయెల్‌ వెల్లడించింది..

క్లస్టర్‌ వార్‌హెడ్‌.. డిఫెన్స్‌ వ్యవస్థలకు చెక్‌!

  • క్షిపణి వార్‌హెడ్‌లో ఒకే పెద్ద బాంబుకు బదులుగా పదుల కొద్దీ చిన్న బాంబులు

  • లక్షిత ప్రాంతంలో కిలోమీటర్‌ ఎత్తులోనే వార్‌హెడ్‌ నుంచి బాంబులన్నీ విడుదల

  • డిఫెన్స్‌ క్షిపణులు కొన్నింటిని అడ్డుకున్నా..మిగతా వాటితో 10 కి.మీ. పరిధిలో విధ్వంసం

ఇరాన్‌ తమ దేశంపై ప్రయోగిస్తున్న క్షిపణుల్లో క్లస్టర్‌ వార్‌హెడ్‌లు వినియోగిస్తోందని, దానితో పౌర ఆవాసాలు ధ్వంసం అవుతున్నాయని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఇప్పటివరకు 12 మంది మరణించారని, 2వేల మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల వ్యవస్థగా పేరొందిన ‘ఐరన్‌ డోమ్‌’ ఇజ్రాయెల్‌ సొంతం. అయినా ఇరాన్‌ క్షిపణులు దాన్ని తప్పించుకుని విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీనికి కారణం ‘క్లస్టర్‌ వార్‌హెడ్‌’. సాధారణంగా క్షిపణుల్లోని వార్‌హెడ్‌లో 500 కిలోల నుంచి 1,000 కిలోల వరకు పేలుడు పదార్థం ఉన్న ఒకే బాంబు ఉంటుంది. దీనితో క్షిపణి దాడి జరిగిన ప్రాంతంలో భారీ పేలుడు జరిగి, ఒకట్రెండు వందల మీటర్ల పరిధిలో గణనీయమైన నష్టం కలుగుతుంది. అదే క్లస్టర్‌ వార్‌హెడ్‌లో ఐదారు కిలోల నుంచి 50 కిలోల దాకా పేలుడు పదార్థం ఉండే పదుల కొద్దీ బాంబులు ఉంటాయి. ఈ క్షిపణి లక్షిత ప్రాంతానికి చేరుకున్నాక ఒకట్రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే వార్‌హెడ్‌ తెరుచుకుంటుంది. పదుల సంఖ్యలో ఉన్న చిన్న బాంబులు చెల్లాచెదురుగా పది కిలోమీటర్ల వరకు విస్తీర్ణంలో పడి పేలుడు సృష్టిస్తాయి. దీనితో విస్తారమైన ప్రదేశంలో తీవ్ర నష్టం జరుగుతుంది. సాధారణంగా శత్రుదేశం క్షిపణి దాడి చేసినప్పుడు లక్షిత దేశంలోని గగనతల రక్షణ వ్యవస్థ రెండు, మూడు ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులను ప్రయోగించి, శత్రుదేశ క్షిపణిని గాల్లోనే ధ్వంసం చేస్తుంది. కానీ అది క్లస్టర్‌ వార్‌హెడ్‌ ఉన్న క్షిపణి అయితే.. ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులు వచ్చి ఢీకొనేలోపే, చిన్నబాంబులను వదిలేస్తుంది. ఆ ఇంటర్‌సెప్టర్లు ఒకట్రెండు చిన్న బాంబులను ధ్వంసం చేసినా.. మిగతావన్నీ కిందపడి పేలుడు సృష్టిస్తాయి. క్లస్టర్‌ ఆయుధాలు, బాంబుల వినియోగానికి వ్యతిరేకంగా 2008లో అంతర్జాతీయ స్థాయి ఒప్పందం కుదిరింది. అయితే అందులో అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌గానీ, భారత్‌గానీ భాగస్వామ్యం కాలేదు. - సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Mar 12 , 2026 | 04:37 AM