Share News

ఎమర్జెన్సీని ప్రత్యక్షంగా చూశాం

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:20 AM

ప్రధాని మోదీ పాలనలో దేశం మొత్తం ఎమర్జెన్సీని తలపిస్తోందని సీజేపీ నేతలు దీప్కే, సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకా, అజింక్య షిండే ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఎమర్జెన్సీని ప్రత్యక్షంగా చూశాం

  • మోదీ ప్రధానిగా ఉండడం దేశానికి అవమానకరం

  • సీజేపీ నేతలు దీప్కే, సౌరవ్‌దాస్‌, రాంకా, షిండే

  • సీఈసీ రాజీనామా చేసేదాకా ఉద్యమం ఆగదని వెల్లడి

  • ఏడాదిపాటు నిరసనల్లో పాల్గొనబోమని కోర్టుకు వీరు బాండ్‌ రాసిచ్చినట్లు ప్రచారం.. అదేం లేదన్న దీప్కే

న్యూఢిల్లీ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పాలనలో దేశం మొత్తం ఎమర్జెన్సీని తలపిస్తోందని సీజేపీ నేతలు దీప్కే, సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకా, అజింక్య షిండే ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఢిల్లీలో ఎమర్జెన్సీని ప్రత్యక్షంగా చూశామన్నారు. శనివారం నిరసనల సందర్భంగా దీప్కే, సౌరవ్‌దాస్‌, అశుతోష్‌ రాంకాలను అరెస్టు చేసిన పోలీసులు.. ఆదివారం వారిని విడుదల చేశారు. అనంతరం దీప్కే తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు స్వగ్రామం హింగోలీకి వెళ్లగా మిగతావారు మీడియాతో మాట్లాడారు. పోలీసుల నిర్బంధం నుంచి విడుదల కాగానే దీప్కే ఎక్స్‌ వేదికగా మోదీపై విమర్శలు గుప్పించారు. ‘మోదీ ప్రధానిగా ఉండటం దేశానికి అవమానకరం. దేశం ఇప్పటివరకు ఇలాంటి ద్రోహిని, పిరికిపందను, నియంతను చూడలేదు’ అని మండిపడ్డారు. జ్ఞానేశ్‌కుమార్‌ సీఈసీ పదవి నుంచి తప్పుకొనేవరకు తమ పోరాటం ఆగదని అజింక్య షిండే ప్రకటించారు. ఇదిలా ఉండగా, పోలీసుల నిర్బంధం నుంచి విడుదలయ్యేందుకు ఏడాదిపాటు ఎలాంటి నిరసనల్లో పాల్గొనకుండా, శాంతికి విఘాతం కలిగించకుండా ఉంటామని సీజేపీ నేతలు కోర్టుకు బాండు సమర్పించారన్న వార్తలపై దీప్కే స్పందించారు. తాము ఎలాంటి బాండుపై సంతకం చేయలేదని స్పష్టంచేశారు. కాగా, శనివారం అరెస్టు చేసిన ప్రముఖ యూట్యూబర్‌ ధృవ్‌రాఠీని కూడా పోలీసులు ఆదివారం విడుదల చేశారు.

Updated Date - Oct 12 , 2026 | 04:22 AM