Share News

సీజేపీ ఖాతా మూసేసి బీజేపీలో చేరకపోతే..అమెరికాలో ఉన్నా చంపేస్తాం

ABN , Publish Date - May 23 , 2026 | 04:14 AM

క్‌రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)’ పేరుతో ఆన్‌లైన్‌ వ్యంగ్య ఉద్యమ వేదికను ప్రారంభించిన అభిజీత్‌ దీప్కే.. తనకు ఇప్పుడు చావు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.

సీజేపీ ఖాతా మూసేసి బీజేపీలో చేరకపోతే..అమెరికాలో ఉన్నా చంపేస్తాం

  • కాక్‌రోచ్‌ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేకి బెదిరింపులు

  • నీట్‌ లీక్‌ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు దీప్కే సంతకాల సేకరణ

న్యూఢిల్లీ, మే 22: ‘కాక్‌రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)’ పేరుతో ఆన్‌లైన్‌ వ్యంగ్య ఉద్యమ వేదికను ప్రారంభించిన అభిజీత్‌ దీప్కే.. తనకు ఇప్పుడు చావు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ‘‘సీజేపీ ఖాతా మూసేసి బీజేపీలో చేరితే డబ్బులొస్తాయి. లేదంటే అమెరికాలో ఉన్నా నిన్ను చంపేస్తాం’’ అంటూ ఒక వ్యక్తి తనను బెదిరించారని పేర్కొంటూ అందుకు సంబంధించిన స్ర్కీన్‌షాట్లను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. అలాగే.. ఇండియాలో ఉన్న దీప్కే తల్లిదండ్రుల చిరునామా తమకు తెలుంటూ మరో వ్యక్తి బెదిరించిన వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు. అమెరికాలో తన గ్రాడ్యుయేషన్‌ పూర్తయిందని.. వచ్చే నెలలో తాను ఇండియా రావాలనుకుంటున్నానని.. కానీ, గతంలో ఇలాగే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినవారిని ఇండియాకు రాగానే అరెస్టు చేసిన వైనాన్ని బట్టి, తాను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండవగానే అక్కడి పోలీసులు తనను అదుపులోకి తీసుకుని నేరుగా తిహార్‌ జైలుకు తరలిస్తారని కచ్చితంగా అనిపిస్తోందని దీప్కే అభిప్రాయపడ్డారు. కాగా, ‘ఎక్స్‌’లో ‘షటప్‌ కౌన్సెల్‌’ అనే యూజర్‌నేమ్‌ ఉన్న ఒక వ్యక్తి.. రిజర్వేషన్లు, దళితుల సమస్యలు,సామాజిక న్యాయంపై సీజేపీ వైఖరి ఏమిటని దీప్కేను ప్రశ్నించారు. దీనికి దీప్కే.. ‘‘నేను స్వయంగా దళితుడిని. ఇది మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తుందని ఆశిస్తున్నాను’’ అని బదులిచ్చారు. దీప్కే అలా చెప్పిన మరుక్షణం నుంచే ఆయనపై ట్రోలింగ్‌ మొదలైంది. ‘‘సో, స్వయం ప్రకటిత జెన్‌ జీ నాయకుడు ప్రతిభకు వ్యతిరేకం అన్నమాట’’ అని ఒకరు.. ‘‘ఆగయా డీ కార్డ్‌ (దళిత్‌ కార్డు వచ్చింది)’’ అని మరొకరు విమర్శించారు. కాగా.. నీట్‌ పరీక్ష నిర్వహణలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా కోరుతూ దీప్కే ఆన్‌లైన్‌లో సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. కాగా, ఇన్‌స్టాలో సీజేపీ ఫాలోవర్ల శుక్రవారం సాయంత్రానికి 2 కోట్లు దాటేసింది.

Updated Date - May 23 , 2026 | 04:14 AM