మహిళా జడ్జిల నియామకాలు పెంచండి
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:52 AM
దేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఆశాజనకంగా లేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సీజేఐ లేఖ
న్యూఢిల్లీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఆశాజనకంగా లేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ అంతరాన్ని పూడ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని దేశంలోని అన్ని హైకోర్టుల సీజేలకు సూచించారు. ఈ మేరకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మహిళా అభ్యర్థుల పేర్లను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించాలని సూచిస్తూ అన్ని రాష్ర్టాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సీజేఐ అధికారిక లేఖ రాశారు. న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం పరిఢవిల్లాలంటే మహిళా ప్రాతినిధ్యం అనివార్యమని పేర్కొన్నారు. కేవలం ప్రస్తుతం ఉన్న ఖాళీలనే కాకుండా.. సమీప భవిష్యత్తులో ఏర్పడబోయే పోస్టులకు కూడా ముందస్తుగా సిఫారసులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పదోన్నతికి అర్హులైన మహిళా అభ్యర్థులను గుర్తించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నిర్దేశించిన వయోపరిమితిని కచ్చితంగా పాటించలేదనే ఏకైక కారణంతో సమర్థులైన అభ్యర్థులను యాంత్రికంగా తిరస్కరించవద్దని కొలీజియంలకు సూచించారు. కాగా, సీజేఐ లేఖపై హైకోర్టులు సానుకూలంగా స్పందించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
హైకోర్టుల్లో 14 శాతమే..
ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న తరుణంలో సీజేఐ ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల పార్లమెంట్ వేదికగా కేంద్రం వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే.. హైకోర్టులో మొత్తం 813 మంది న్యాయమూర్తులు ఉండగా, అందులో కేవలం 116 మంది (14.27 శాతం) మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. సుప్రీంకోర్టులో కేవలం ఒకే ఒక్క మహిళా న్యాయమూర్తి ఉండడం గమనార్హం.