న్యాయవ్యవస్థను బెదిరించలేరు
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:42 AM
సర్, ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయంటూ గత సోమవారం ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీ నిర్వహించటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మేము ప్రజలకు దూరంగా మేడలో కూర్చున్నామనుకోవొద్దు
బయట పరిణామాలను గమనిస్తున్నాం: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
సుప్రీంకోర్టుకు ర్యాలీ నిర్వహించిన ఒక పిటిషనర్‌కు నోటీసులు ఇస్తా
రాహుల్‌గాంధీ, ఇతర విపక్ష నేతల ర్యాలీపై పరోక్ష వ్యాఖ్యలు
జంతర్‌మంతర్ డీనోటిఫైపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు
విపక్షాల పిటిషన్లో ఈసీ, సీఈసీ, ఎన్నికల కమిషనర్లకు నోటీసులు
న్యూఢిల్లీ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): సర్, ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయంటూ గత సోమవారం ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీ నిర్వహించటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని స్పష్టంచేశారు. తాము ప్రజలకు దూరంగా, ఏమీ పట్టనట్లు తలుపులు మూసి ఉన్న భవనంలో కూర్చోలేదని, బయట జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని ఈ నెల 10నసుప్రీంకోర్టు పునరుద్ఘాటనకాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా పోలీసులు ఢిల్లీ నగరంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా స్తంభింపజేయటం, జంతర్‌మంతర్‌లో ధర్నాలు నిర్వహించకుం డా ప్రభుత్వం డీనోటిఫై చేయటం, వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహణ, ఈ నెల 12న రాహుల్‌గాంధీ ఇతర విపక్ష నేతలు దాఖలు చేసిన పిటిషన్ తదితర నాలుగు రకాల పిటిషన్లపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు. మేము ప్రజలతో సంబంధం లేకుండా, వారికి దూరంగా లేము. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి మాట వినేలా చేసుకోవటానికి ప్రయత్నించొద్దు. ఒక పిటిషనర్ వ్యవహార శైలిపై అతడి సమాధానం కోసం నోటీసులు జారీచేస్తున్నాం’ అని రాహుల్‌గాంధీ పేరు ప్రస్తావించకుండా సీజేఐ పేర్కొన్నారు. విపక్షాల ర్యాలీని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈసీ, సీఈసీకి నోటీసులు..
ఎస్ఐఆర్లో అవకతవకలపై ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), సీఈసీతోపాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధు, వివేక్ జోషీలకు నోటీసులు జారీచేసింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. నోటీసులు జారీచేయటం అంటే.. తాము అన్ని విషయాలను ఖండిస్తున్నామని అర్థం కాదని పేర్కొన్నారు. ధర్నాలు నిర్వహించకుండా జంతర్‌మంతర్‌ను డీనోటిఫై చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ నూ ధర్మాసనం విచారించింది. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు చట్టబద్ధంగానే వ్యవహరించారో లేదో పరిశీలిస్తామని పేర్కొంది. పోలీసుల నిర్ణయాన్ని సమర్థించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ అంశంపై గతంలో వేసిన కమిటీ నివేదిక ఆధారంగానే పోలీసులు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాగా, ఈనెల 10 కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఢిల్లీలో మెట్రో రైల్ స్టేషన్లను మూసివేయటం, నగరంలోకి రావాల్సిన రైళ్లను రద్దుచేయటంపై హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్.. కోర్టుకు క్షమాపణ చెప్పారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ కూడా క్షమాపణ చెప్పారు. తాము తీసుకున్న పకడ్బందీ చర్యల వల్లనే ఆ రోజు నగరంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని చెప్పారు. ఈ సందర్భంగా తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కరణ కేసులో అధికారులు క్షమాపణ చెప్పారంటే ప్రభుత్వం తప్పుచేసినట్లు కాదన్నారు. ఇలాంటి కేసులో దాఖలు చేసే ప్రతిస్పందన పిటిషన్లలో మొదటి పేరాలో కోర్టుకు క్షమాపణ చెప్తూ ప్రారంభించటం నియమం అని అన్నారు. దీని ఆధారంగా మీడియాలో ప్రభు త్వం తప్పుచేసిందని, క్షమాపణ చెప్పిందని ప్రచారం అవుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకు ధర్మాసనం స్పందిస్తూ.. తాము మీడియా నివేదికల ఆధారంగా నోటీసులు ఇవ్వటం లేదని స్పష్టత ఇచ్చింది.