‘బొద్దింక’ వ్యాఖ్యల్ని వక్రీకరించారు
ABN , Publish Date - May 17 , 2026 | 05:09 AM
కేసు విచారణలో భాగంగా తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు
ఫేక్ డిగ్రీల లాయర్లనే విమర్శించా:సీజేఐ
న్యూఢిల్లీ, మే 16: కేసు విచారణలో భాగంగా తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ‘బొద్దింకలు’, ‘పరాన్నజీవులు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. ‘‘ఓ పనికిమాలిన కేసు విచారణ సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం వక్రీకరించడం నన్ను బాధించింది. ఫేక్, బోగస్ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి వస్తున్న వారిని మాత్రమే నేను విమర్శించాను. మీడియా, సోషల్ మీడియా, ఇతర ఉన్నత వృత్తుల్లోకి వారు చొరబడుతున్నారనే అర్థంలో ‘పరాన్నజీవులు’ అనే పదం వాడాను.’’ అని వివరించారు. తన వ్యాఖ్యలను సందర్భం నుంచి విడదీసి మీడియా ప్రసారం చేసిందన్నారు. తనకు ‘సీనియర్ న్యాయవాది హోదా’ను నిరాకరించడం ద్వారా ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ న్యాయవాది సంజయ్‌దూబే వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారిస్తున్నపుడు జస్టిస్ సూర్యకాంత్ ‘పరాన్నజీవుల’ వ్యాఖ్యలు చేశారు. వృత్తిలో అవకాశం దక్కని యువత బొద్దింకల్లా తయారవుతోందని, నల్లకోటు వేసుకున్నవారిలో చాలామంది డిగ్రీ సర్టిఫికెట్ల విషయంలో తీవ్ర అనుమానాలున్నాయని ఆయన అన్నారు. అయితే, నిరుద్యోగ యువతను జస్టిస్ సూర్యకాంత్ బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారని వార్తలు వచ్చాయి.