Share News

సుప్రీం పరిధిలో ఉన్న అంశంపై భేటీ.. అధికారాల విభజన సూత్రానికి విరుద్ధం

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:19 AM

సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై సమావేశమై చర్చించడం రాజ్యాంగం ప్రవచించిన అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుందని.. అది నైతికతకు, న్యాయపరమైన ఔచిత్యానికి విరుద్ధమని విపక్ష నేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు రాసిన లేఖలో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు.

సుప్రీం పరిధిలో ఉన్న అంశంపై భేటీ..  అధికారాల విభజన   సూత్రానికి విరుద్ధం
cji suryakanth

  • మీరేం చెప్పదల్చుకున్నా కోర్టును ఆశ్రయించండి

  • రాహుల్‌గాంధీ, ఖర్గేలకు రాసిన లేఖలో సీజేఐ

న్యూఢిల్లీ, అక్టోబరు 12: సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై సమావేశమై చర్చించడం రాజ్యాంగం ప్రవచించిన అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుందని.. అది నైతికతకు, న్యాయపరమైన ఔచిత్యానికి విరుద్ధమని విపక్ష నేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు రాసిన లేఖలో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ రాజీనామా, ‘సర్‌’ ప్రక్రియ నిలిపివేతపై చీఫ్‌ జస్టి్‌సకు వినతిపత్రం అందజేయాలని ఇండి కూటమి నేతలు భావించగా.. వారి విజ్ఞప్తిని సీజేఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారికి ఆయన ఒక లేఖ రాశారు. వారు ఏం చెప్పదలచుకున్నా నేరుగా (భౌతికంగా)గానీ, ఆన్‌లైన్‌ ద్వారాగానీ కోర్టులో పిటిషన్‌ వేయాలని సూచించారు. విపక్ష నేతల లేఖలో ప్రస్తావించిన అంశాలపై చర్యలు తీసుకోవడానికి.. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టుకు ఎలాంటి పరిపాలనపరమైన అధికారాలూ ఉండవనే విషయాన్ని సీజేఐ వారికి గుర్తుచేశారు. దేశ పౌరులపై ప్రభావం చూపే సమస్యల తీవ్రతను న్యాయపరంగా పరిశీలించాల్సిన బాధ్యత తమపై ఉందని.. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి సుపీరంకోర్టు ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. విపక్ష నేతలు పరిపాలనపరంగా ఒక వినతిపత్రాన్ని సమర్పించడానికి బదులుగా, సుప్రీంకోర్టుకు ఉన్న న్యాయపరమైన అధికారాలను ఆశ్రయించడం మరింత సముచితంగా ఉంటుందని.. ఇలాంటి అంశాలే కొన్ని మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్నందున వారి పిటిషన్‌ను సోమవారమే దాఖలు చేయొచ్చని సీజేఐ తన లేఖలో సూచించారు. వారు తమ పిటిషన్‌ను ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30లోపు భౌతికంగా సుప్రీంకోర్టులోగానీ, లేదా ఆన్‌లైన్‌ (ఈఫైలింగ్‌) ద్వారా ఏ సమయంలోనైనా సమర్పించవచ్చన్నారు. ‘‘అలా మీరు దాఖలు చేసిన పిటిషన్‌ను చట్టప్రకారం వీలైనంత త్వరగా విచారిస్తామని నా తరఫున మీకు హామీ ఇస్తున్నాను’’ అని సీజేఐ పేర్కొన్నారు.


అది శాంతి భద్రతల సమస్య.. నా పరిధి కాదు

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో సీఈసీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, వాటికి సంబంధించిన ఆంక్షలపై మీడియా ప్రశ్నించగా.. అది శాంతిభద్రతల సమస్య అని, తన పరిధిలోకి రాదని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ 33వ వార్షికోత్సవానికి హాజరైన సీజేఐ విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టుకు విపక్ష నేతల మార్చ్‌ గురించి ప్రశ్నించగా.. దానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోనన్నారు. కాగా.. ఢిల్లీలో జరిగిన ఆందోళనల సందర్భంగా న్యాయవాదుల నిర్బంధం, పోలీసుల మితిమీరిన చర్యల గురించి సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర నారాయణన్‌ సోమవారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సీనియర్‌ న్యాయవదులను వీధుల్లో ఈడ్చుకెళ్లారని.. ఇది అత్యంత అనుచితమైన చర్య అని, ఇలా జరిగి ఉండకూడదని పేర్కొన్నారు. పోలీసులు సంయమనం పాటించేలా ధర్మాసనం ఆదేశించాలని కోరారు. నిరసనలకు సంబంధించిన ఇతర అంశాలతో కలిపి దీనిపైన కూడా మంగళవారం విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సీజేఐ.. శాంతియుత నిరసనల్లో పాల్గొనే హక్కు ప్రతి న్యాయవాదికీ ఉందని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని మంగళవారం విచారణలో చేర్చేందుకు అంగీకరించారు.

Updated Date - Oct 13 , 2026 | 06:27 AM