Share News

అంత సెంటిమెంటల్‌గా ఉండొద్దు!

ABN , Publish Date - May 26 , 2026 | 04:08 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేస్తున్న ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ కార్యకలాపాలపై అత్యవసరంగా దర్యాప్తు జరిపించాలని ....

అంత సెంటిమెంటల్‌గా ఉండొద్దు!

  • కాక్రోచ్‌ పార్టీపై అత్యవసరంగా దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్‌పై సీజేఐ వ్యాఖ్య

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేస్తున్న ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ కార్యకలాపాలపై అత్యవసరంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్‌కే గోస్వామి అనే న్యాయవాది దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సీజేఐ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. ఈ అంశాన్ని అంత సెంటిమెంటల్‌గా(భావోద్వేగపూరితంగా) తీసుకోవద్దని పిటిషనర్‌కు సూచించారు. కాగా, ఇదే ధర్మాసనం ముందుకు మరో పిటిషన్‌ కూడా వచ్చింది. నకిలీ పట్టాలతో కొందరు న్యాయవాదులుగా ప్రాక్టీస్‌ చేస్తున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మరో న్యాయవాది ఈ పిటిషన్‌ వేశారు. కోర్టులో విచారణ సందర్భంగా వ్యక్తమయ్యే పరిశీలనలు, వ్యాఖ్యలను బయట ప్రచారం కోసం కొందరు వాడుకుంటున్నారని, ఈ ధోరణిని అడ్డుకోవాలని కోరారు. దీనిని కూడా.. ‘అంత తొందరేమీ లేదు.. మేం పరిశీలిస్తాం’ అని పేర్కొంటూ సీజేఐ పక్కనపెట్టారు. తనకు సీనియర్‌ న్యాయవాది హోదాను ఇవ్వాలని కోరుతూ ఓ లాయర్‌ దాఖలు చేసిన పిటిసన్‌ మీద మే 15న విచారణ సందర్భంగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ‘బొద్దింకలు, పరాన్నజీవులు’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న వారిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశానని ఆయన తర్వాత వివరణ ఇచ్చారు.

Updated Date - May 26 , 2026 | 04:08 AM