మమత నివాసంలో సీఐడీ తనిఖీలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:07 AM
ఎమ్మెల్యేల ఫోర్జరీ సంతకాల కేసు దర్యాప్తులో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు ఆ రాష్ట్ర మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ నివాసంలో...
అభిషేక్ బెనర్జీ ఆఫీసులో కూడా..
ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో దర్యాప్తు
కోల్‌కతా, జూన్ 9: ఎమ్మెల్యేల ఫోర్జరీ సంతకాల కేసు దర్యాప్తులో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు ఆ రాష్ట్ర మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ నివాసంలో మంగళవారం తనిఖీలు జరిపారు. ఆ సమయంలో మమత.. నివాసంలో లేరు. ఇండియా కూటమి సమావేశానికి హాజరుకావటం కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లిన మమత, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అక్కడి నుంచి తిరిగి రాకముందే ఈ తనిఖీలు జరగటం గమనార్హం. కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఉన్న మమత నివాసంలోనే తృణమూల్ ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో కలిసి సీఐడీ బృందం ఉదయం అక్కడికి చేరుకున్నట్లు తెలియగానే తృణమూల్ నేతలు, కొందరు ఎమ్మెల్యేలు తరలివచ్చారు. కార్యాలయంలో ఉన్న భద్రతా సిబ్బందితో కలిసి సీఐడీ బృందాన్ని అడ్డుకున్నారు. పార్టీ ఎంపీ, న్యాయవాది కల్యాణ్ బెనర్జీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదంతా సీఎం సువేందు అధికారి ప్రతీకార రాజకీయాలని, మమత లేనప్పుడు తనిఖీలు ఎలా చేస్తారని నిలదీశారు. మధ్యాహ్నం సీఐడీ మరోసారి భారీగా పోలీసు బలగాలతో వచ్చింది. ఈసారి కూడా వారిని అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా.. పోలీసుల హెచ్చరికతో తృణమూల్ శ్రేణులు వెనక్కి తగ్గారు. దీంతో సీఐడీ బృందం ఆ నివాసం, కార్యాలయం ఆవరణలోకి ప్రవేశించి తనిఖీలు జరిపింది. ఇదే సమయంలో కోల్‌కతాలోనే మరో ప్రాంతంలో ఉన్న అభిషేక్ బెనర్జీ కార్యాలయంలో కూడా మరో సీఐడీ బృందం తనిఖీలు చేపట్టింది. ఫోర్జరీ సంతకాల కేసులో అభిషేక్ బెనర్జీకి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఆయన ఇచ్చిన వివరణ నేపథ్యంలోనే ఈ తనిఖీలు జరిపినట్లుగా సీఐడీ అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని అభిషేక్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయనకు ఇది మూడో నోటీసు. ఇంతకుముందు నోటీసులు ఇచ్చినప్పుడు.. ఆరోగ్య కారణాలు, కోల్‌కతా హైకోర్టు ఎదుట కేసు విచారణ పెండింగ్‌లో ఉందని చెప్పి హాజరుకాలేదు.
ఇదీ నేపథ్యం
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. పార్టీ శాసనసభాపక్ష నేతగా సీనియర్ ఎమ్మెల్యే సోవన్‌దేబ్ చటోపాధ్యాయ పేరును ఖరారు చేస్తూ స్పీకర్‌కు తృణమూల్ కాంగ్రెస్ ఒక లేఖ పంపింది. అయితే, ఈ లేఖ మీద ఉన్న తమ సంతకాలు తాము చేసినవి కావని, వాటిని ఫోర్జరీ చేశారంటూ పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీ నిర్ణయాన్ని కాదని, మమత పార్టీ నుంచి బహిష్కరించిన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 58 మంది రితబ్రతకు మద్దతు తెలిపారు. స్పీకర్ కూడా ఆయననే తృణమూల్ శాసనసభాపక్ష నేతగా గుర్తించారు. సంతకాలు ఫోర్జరీ చేశారన్న ఎమ్మెల్యేల ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. ఆ సంతకాలను పార్టీ ప్రధాన కార్యాలయంలోనే ఎమ్మెల్యేలనుంచి తీసుకున్నామని అభిషేక్ బెనర్జీ ఇంతకుముందు ఇచ్చిన వివరణ ఆధారంగా తాజాగా సీఐడీ తనిఖీలు చేపట్టింది. మరోవైపు, తూర్పు24పరగణాల జిల్లాలోని బిధాన్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తృణమూల్ నాయకుడు సబ్యసాచి దత్తాను బలవంతపు వసూళ్ల ఆరోపణలపై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.