పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామక సమాచారం ఇవ్వండి
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:36 AM
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం పాదర్శకంగా ఉండాలని, అప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) అభిప్రాయపడింది.
ఈడీకి సీఐసీ సలహా
ఏపీ, తెలంగాణ వివరాలు కూడా కోరిన దరఖాస్తుదారు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం పాదర్శకంగా ఉండాలని, అప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) అభిప్రాయపడింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చే విషయాన్ని మరోమారు పరిశీలించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సూచించింది. ఈడీ పరిధిలో పనిచేసే సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ల నియామకాలకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలు వంటి సమాచారం ఇవ్వాలని ఓ న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్ల వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే స.హ.చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం నిఘా సంస్థలు, భద్రత దళాలకు మినహాయింపు ఉన్నందున ఎలాంటి సమాచారం ఇవ్వలేమని ఈడీ పేర్కొంది. దీనిపై అప్పీలు చేయగా సమాచార కమిషనర్ వినోద్ కుమార్ తివారీ విచారణ జరిపారు. ఖాళీలు, భర్తీ ప్రక్రియకు సంబంధించిన సాధారణ సమాచారమే అడినందున దానిని దరఖాస్తుదారుకు ఇవ్వవచ్చని తెలిపారు.