Share News

మధ్యవర్తిత్వానికి మేం సిద్ధం

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:06 AM

ఇరాన్‌ యుద్ధానికి దౌత్య మార్గమే పరిష్కారమన్న భారత్‌ వ్యాఖ్యలకు చైనా మద్దతు తెలిపింది. అంతేకాదు యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం చేయడానికి తాము సిద్ధమని ప్రకటించింది.

మధ్యవర్తిత్వానికి మేం సిద్ధం

  • యుద్ధాన్ని త్వరగా ముగించాలి

  • చర్చలతో వివాదాలను పరిష్కరించుకోవాలి: చైనా

న్యూఢిల్లీ, మార్చి 5: ఇరాన్‌ యుద్ధానికి దౌత్య మార్గమే పరిష్కారమన్న భారత్‌ వ్యాఖ్యలకు చైనా మద్దతు తెలిపింది. అంతేకాదు యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం చేయడానికి తాము సిద్ధమని ప్రకటించింది. యూఏఈ డిప్యూటీ ప్రధాని అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సహా గల్ఫ్‌ ప్రాంతంలోని పలువురు రాజకీయ నేతలతో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ ఫోన్‌లో మాట్లాడినట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ తెలిపారు. యూఏఈ జాతీయ భద్రత విషయంలో అండగా ఉంటామని వాంగ్‌ చెప్పారని, అలాగే ఇతర గల్ఫ్‌ దేశాలు కూడా దౌత్య మార్గాల్లో వివాదాలను పరిష్కరించేందుకు మద్దతు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. యుద్ధం ఏ వర్గానికీ ప్రయోజనకరం కాదని, ప్రజలే బాధలు పడతారని పేర్కొన్నారు. శాంతి కోసం చైనా నిరంతరం కృషి చేస్తుందని, అందుకోసం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని వాంగ్‌ చెప్పినట్లు లిన్‌ తెలిపారు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రితో వాంగ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత యుద్ధం విస్తరిస్తోందని, సౌదీ అరేబియాతో పాటు ఇతర గల్ఫ్‌ దేశాలపై ప్రభావం పడుతోందని, దీన్ని చైనా ఎంత మాత్రం కోరుకోవడం లేదని పేర్కొన్నట్లు వివరించారు. చర్చలతో వివాదాలను పరిష్కరించుకోవాలని, అందుకోసం అవసరమైతే తాము మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధమని ప్రకటించినట్లు తెలిపారు. అలాగే రష్యా, ఒమన్‌, ఫ్రాన్స్‌, ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మంత్రులతోనూ వాంగ్‌ మాట్లాడినట్లు వెల్లడించారు. కాగా, మంగళవారం అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌లు యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని భారత్‌ కోరిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో 181 మంది చిన్నారులు సహా 1000 మందికిపైగా మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం సహా ఏ సమస్య అయినా సైనిక పోరుతో పరిష్కారం కాదని, చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రధాని మోదీ ప్రకటించారు.

Updated Date - Mar 06 , 2026 | 04:06 AM