Share News

ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులు మాట్లాడుతాయ్‌!

ABN , Publish Date - May 26 , 2026 | 04:18 AM

మన ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు ఏం మాట్లాడుతున్నాయో.. వాటి మనసులో ఏముందో మనకు స్పష్టంగా అర్థమైతే ఎలా ఉంటుంది...

ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులు మాట్లాడుతాయ్‌!

  • వాటి ‘మనసు’ కనిపెట్టేసే ఏఐ బెల్ట్‌

  • సరికొత్త గ్యాడ్జెట్‌ను మార్కెట్‌లోకి తెచ్చిన చైనా స్టార్టప్‌..

బీజింగ్‌, మే 25: మన ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు ఏం మాట్లాడుతున్నాయో.. వాటి మనసులో ఏముందో మనకు స్పష్టంగా అర్థమైతే ఎలా ఉంటుంది?.. ఇది ఏదో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలో చూపించినట్లుగా, వినడానికి వింతగా ఉన్నా.. చైనాకు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ దీనిని నిజం చేసి చూపిస్తామంటోంది. ఓ చిన్న ‘ఏఐ ఆధారిత స్మార్ట్‌ కాలర్‌ బెల్ట్‌’ను పెంపుడు జంతువుల మెడకు తగిలించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. అలీబాబా క్లౌడ్‌ ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ పరికరం.. జంతువుల అరుపులు, వాటి శరీర కదలికలను బట్టి అవి ఆకలితో ఉన్నాయా.. సంతోషంగా ఉన్నాయా.. అని సుమారు 95 శాతం కచ్చితత్వంతో కనిపెడుతుంది. వాటి హావభావాలను మైక్రో ఫోన్లు, మోషన్‌ సెన్సార్ల ద్వారా 1.2 సెకన్లలోనే పసిగట్టి.. ‘నన్ను ఒంటరిగా వదిలేయ్‌’, ‘నాతో ఆడుకో’ వంటి స్పష్టమైన వ్యాక్యాల రూపంలోకి మార్చి, స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా యజమానులకు వినిపిస్తుందని కంపెనీ ప్రకటించింది. అంతటితో ఆగకుండా, యజమానులు మాట్లాడే మాటలను కూడా జంతువులకు అర్థమయ్యే ‘పెట్‌ ఫ్రెండ్లీ’ శబ్దాలుగా ఈ గ్యాడ్జెట్‌ మార్చగలదట. అంటే ఇరువైపులా సంభాషణలు సాగించవచ్చన్నమాట!.. ఇందుకోసం దాదాపు 10లక్షల జంతువుల వాయిస్‌ డేటా శాంపిల్స్‌ సేకరించి ఏఐ మోడల్‌కు శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 14వేలకు లభిస్తున్న ఈ గ్యాడ్జెట్‌కు సోషల్‌మీడియాలో భారీ స్పందన వస్తోంది. బుకింగ్స్‌ ప్రారంభమైన కొద్దిరోజులకే 10వేల మందికి పైగా దీనికోసం ముందుస్తు ఆర్డర్లు ఇచ్చేశారు. ‘‘మనుషుల మాటలనే ఏఐ సరిగా అర్థం చేసుకోలేక పోతోంది. అలాంటిది కుక్కలు, పిల్లుల భాషను కనిపెట్టేసిందా ?’’ అంటూ కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, ఈ కొత్త టెక్నాలజీపై టెకీ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు, పరిశోధన పత్రాలు లేకుండానే 95శాతం కచ్చితత్వం ఉందని కంపెనీ ఎలా చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. జంతువుల హావభావాలను అంత సులభంగా మాటల్లోకి మార్చడం సాధ్యం కాకపోవచ్చని కొట్టిపారేస్తున్నారు.

Updated Date - May 26 , 2026 | 04:18 AM