Share News

మళ్లీ ‘చైనా’ రచ్చ

ABN , Publish Date - Feb 04 , 2026 | 02:25 AM

చైనా’ రచ్చ పార్లమెంటును వరుసగా రెండో రోజు కూడా కుదిపేసింది. మాజీ సైనికాధిపతి నరవణే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీ మరోసారి ప్రయత్నించడంతో లోక్‌సభలో గందరగోళం చెలరేగింది.

మళ్లీ ‘చైనా’ రచ్చ

  • ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్‌

  • ‘చైనా దురాక్రమణ’పై మాట్లాడేందుకు మరోసారి ప్రయత్నించిన రాహుల్‌గాంధీ

  • స్పీకర్‌ నిరాకరణ.. విపక్షాల తీవ్ర నిరసన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : ‘చైనా’ రచ్చ పార్లమెంటును వరుసగా రెండో రోజు కూడా కుదిపేసింది. మాజీ సైనికాధిపతి నరవణే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీ మరోసారి ప్రయత్నించడంతో లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. రాహుల్‌ ప్రయత్నాన్ని అధికారపక్షం తీవ్రంగా అడ్డుకుంది. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. 8మంది విపక్ష సభ్యులను ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు అయ్యేవరకు సస్పెండ్‌ చేశారు. వీరిలో ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులు కాగా, ఒకరు సీపీఎం ఎంపీ ఉన్నారు. కాగా, నరవణే పుస్తకంలో పేర్కొన్న అంశాలను తాను సాధికారికంగా వెల్లడించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్‌ గాంధీ అంతకుముందు స్పీకర్‌కు నోట్‌ సమర్పించారు. ‘ఇందులోని ప్రతి అంశాన్నీ వ్యక్తిగతంగా ధ్రువీకరిస్తున్నాను. సంతకం కూడా చేశాను. అందువల్ల సోమవారం వ్యక్తమైన అభ్యంతరాలు తొలగిపోయినట్టే’ అని తెలిపారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్‌ రాహుల్‌ సమర్పించిన నోట్‌ను పరిశీలిస్తామని తెలిపారు. అయినప్పటికీ రాహుల్‌ ఆ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. చేతుల్లోని కాగితాలను చింపి తీవ్ర నిరసన తెలిపారు. దీంతో సభ వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కాగానే, 8మంది ఎంపీల సస్పెన్షన్‌ కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు తీర్మానం ప్రవేశపెట్టగా, ప్యానల్‌ స్పీకర్‌ దిలీప్‌ సైకియా ఆమోదించారు. సస్పెండ్‌ అయినవారిలో హిబి ఈడెన్‌, అమరీందర్‌ రాజా వారింగ్‌, మాణిక్కం ఠాకూర్‌, గుర్జీత్‌ సింగ్‌ ఔజ్లా, సి.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రశాంత్‌ పడోల్‌, డీన్‌ కురియకో్‌స(కాంగ్రెస్‌ సభ్యులు), ఎస్‌ వెంకటేశన్‌ (సీపీఎం) ఉన్నారు. సస్పెండ్‌ అయిన సభ్యులంతా పార్లమెంటు ప్రాంగణంలో నిరసన తెలిపారు.


అది డోక్లాం కాదు : నిపుణులు

నరవణే ఆత్మకథ ఆధారంగా చైనా దురాక్రమణపై చేసే వాదనలో రాహుల్‌ తడబడుతున్నారని పలువురు అభిపాయ్రపడుతున్నారు. వారి వాదన ప్రకారం, ‘‘2020లో డోక్లాం వైపు చైనాకు చెందిన 4 యుద్ధ ట్యాంకులు చొచ్చుకువచ్చాయి’’ అని రాహుల్‌ అన్నారు. అయితే, అవి రెచిన్‌ లా ప్రాంతంలో కనిపించాయి. డోక్లాంలో 2017లో భారత్‌-చైనా మధ్య మనకు సైనిక ప్రతిష్ఠంభన ఏర్పడింది. అప్పటికి నరవణే ఆర్మీ చీఫ్‌ కాలేదు. గాల్వాన్‌ ఉద్రిక్తతలు తలెత్తిన 2020లో ఆయన ఆ బాధ్యతలు స్వీకరించారు.

చర్చకు అంగీకరిస్తే బాగుండేది ‘నరవణె’పై ప్రభుత్వానిది అతి: థరూర్‌

నరవణె ఆత్మకథ గ్రంథంలోని అంశాలపై ప్రభుత్వం అతిగా స్పందించిందని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ విమర్శించారు. ఆ గ్రంథంలోని అంశాలను లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రస్తావించినప్పుడు అడ్డుకోకుండా చర్చకు అంగీకరిస్తే బాగుండేదని అన్నారు. పార్లమెంటు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరవణె గ్రంథంలోని అంశాలు ఇప్పటికే ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని, దీనిపై కారవాన్‌ మ్యాగజైన్‌లో వచ్చిన ఆర్టికల్‌ను అందరూ చదువుతూనే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వమే అతిగా స్పందించి సభలో రభస సృష్టించిందని విమర్శించారు. పార్లమెంటు ఉన్నది దేశానికి సంబంధించిన అంశాలను చర్చించటానికే కదా? అని ఆయన ప్రశ్నించారు. చైనా సైన్యం సరిహద్దులో భారత భూభాగాన్ని ఆక్రమించిందని నరవణె తన గ్రంథంలో రాశారని రాహుల్‌ అన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 02:25 AM