డాలర్‌తో డ్రాగన్ ఢీ
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:52 AM
పెట్రోల్ కొనాలంటే.. డాలర్లు కావాలి! ఎలకా్ట్రనిక్స్ చిప్స్, సెమీ కండక్టర్స్ కొనాలన్నా.. డాలర్లు కావాలి!! వజ్రాలు, ఔషధాల తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు, ఎరువులు, విదేశాల నుంచి కొనే యుద్ధవిమానాలు, ఇతర రక్షణ పరికరాలు, వంటనూనెలు..
అమెరికా కరెన్సీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే దిశగా..
పలు దేశాలను కూడగట్టుకుని పోరు ప్రారంభించిన చైనా
ఈ-యువాన్లు, ఎంబ్రిడ్జ్ ప్లాట్ ఫామ్ ద్వారా చెక్ పెట్టే ఎత్తుగడ
అదే బాటలో పయనించేందుకు ప్రయత్నిస్తున్న భారత్
రష్యా, శ్రీలంక తదితర దేశాలతో ఇప్పటికే రూపీ ట్రేడింగ్
పలు దేశాల చెల్లింపుల వ్యవస్థలతో యూపీఐ లింకు
డాలర్‌కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తే 100శాతం సుంకాలు వేస్తా!
బ్రిక్స్ దేశాలకు గతంలోనే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
(సెంట్రల్ డెస్క్)
పెట్రోల్ కొనాలంటే.. డాలర్లు కావాలి! ఎలకా్ట్రనిక్స్ చిప్స్, సెమీ కండక్టర్స్ కొనాలన్నా.. డాలర్లు కావాలి!! వజ్రాలు, ఔషధాల తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు, ఎరువులు, విదేశాల నుంచి కొనే యుద్ధవిమానాలు, ఇతర రక్షణ పరికరాలు, వంటనూనెలు.. ఏది కొనాలన్నా డాలర్లే కావాలి!! దాదాపు ఏడెనిమిది దశాబ్దాలుగా ప్రపంచ విపణిలో ఇలా సర్వంసహాధిపత్యాన్ని చాటుతున్న డాలర్‌ను ఇటీవలికాలంలో ఆసియా దేశాలు సవాల్ చేస్తున్నాయి! చైనా, భారత్ సహా పలు దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా (డీ-డాలరైజేషన్) అడుగులు వేస్తున్నాయి. చైనా తన డిజిటల్ యువాన్ల (ఈ-సీవైఎన్) ద్వారా దేశీయంగా.. థాయ్‌లాండ్, యూఏఈ, సౌదీలతో కలిసి ‘ఎంబ్రిడ్జ్’ అనే ప్లాట్‌ఫామ్ ద్వారా డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. బ్రిక్స్ దేశాలు కూడా ఆ దిశగా ఇప్పటికే ఆలోచిస్తున్నాయి. ముందుగా చైనా విషయానికి వస్తే.. అది ఇన్నాళ్లుగా రెండు దేశాల మధ్య (లేదా) రెండు దేశాల వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీలకు వాడుతున్న ‘స్విఫ్ట్’ చెల్లింపుల వ్యవస్థనే లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. ఈ స్విఫ్ట్ వ్యవస్థపై పూర్తిగా అమెరికా, డాలర్ ఆధిపత్యం ఉంది. ఈ వ్యవస్థ ద్వారా ఒక దేశం నుంచి మరొక దేశానికి డబ్బు పంపాలంటే మధ్యలో డాలర్లలోకి మార్చాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక భారతీయ వ్యాపారి థాయ్‌లాండ్ వ్యాపారి నుంచి లక్ష బాట్ల విలువైన వస్తువులు కొన్నాడు. నేరుగా భారత కరెన్సీని థాయ్ కరెన్సీలోకి మార్చి ఆ వ్యాపారికి చెల్లించవచ్చు. కానీ, బ్యాంకులు అందుకు భారీగా ఎక్సేంజి ఫీజు వసూలు చేస్తాయి. ఎందుకంటే.. తక్కువ డిమాండ్ ఉండే బాట్‌ల లభ్యత మార్కెట్లో తక్కువగా ఉంటుంది.
కాబట్టి వాటి సేకరణకు బ్యాంకులు ఎక్కువ ఫీజు వసూలు చేస్తాయి. అదే డాలర్లయితే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల డాలర్ మార్పిడి ఫీజు 1 నుంచి 2 శాతం ఉంటే.. బాట్ మార్పిడి ఫీజు 5 నుంచి 7 శాతం దాకా ఉంటుంది. అందుకే రూపాయల్ని తొలుత డాలర్లలోకి మార్చి ఆ తర్వాత బాట్లలోకి మారిస్తే భారతీయ వ్యాపారికి ఖర్చు తగ్గుతుంది. ఇలా డాలర్లలోకి మార్చడానికి స్విఫ్ట్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. అయితే.. ఇది కరెన్సీ మార్పిడి వ్యవస్థ కాదు. కేవలం ఒక మెసేజింగ్ వ్యవస్థ. పైన చెప్పిన ఉదాహరణలో భారత వ్యాపారి లక్ష బాట్ల విలువైన వస్తువులు కొని చెల్లింపులు చేయాలనుకున్నప్పుడు తన బ్యాంకుకు వెళ్లి లక్ష బాట్లకు సరిపడా డాలర్లు కొంటాడు. దీనికి అతడు రూపాయల్లోనే చెల్లింపు చేస్తాడు. అప్పుడా బ్యాంకు అమెరికాలోని తన ప్రతినిధి బ్యాంకుకు (జేపీ మోర్గాన్, సిటీ బ్యాంకు వంటివాటికి).. ‘‘మా ఖాతా నుంచి లక్ష బాట్లకు సరిపడా డాలర్లను థాయ్‌లాండ్‌లోని పలానా బ్యాంకుకు పంపించండి’’ అని సందేశాన్ని పంపిస్తుంది. ఈ సందేశం పంపడానికి వాడేదే స్విఫ్ట్ నెట్‌వర్క్. ఆ సందేశం అందుకున్న అమెరికన్ బ్యాంకు.. థాయ్‌లాండ్‌లోని బ్యాంకుకు నిర్ణీత డాలర్లను పంపుతుంది. థాయ్ బ్యాంకు.. ఆ డాలర్లను తీసుకుని, లక్ష బాట్లుగా మార్చి ఆ వ్యాపారి ఖాతాలో వేస్తుంది. అయితే, ఈ పద్ధతిలో రెండు నష్టాలున్నాయి. ఒకటి.. డాలర్ కన్వర్షన్ ఫీజు రెండుసార్లు చెల్లించాల్సి వస్తుంది (మన కరెన్సీతో డాలర్లను కొన్నప్పుడు, ఆ డాలర్లను మళ్లీ థాయ్ కరెన్సీలోకి మార్చినప్పుడు). రెండోది.. ఈ మొత్తం ప్రక్రియ జరగడానికి 2-3 రోజులు పడుతుంది. అందుకే.. డాలర్ ఆధిపత్యానికి చెక్ పెడుతూనే, వేగంగా డబ్బు పంపేలా చైనా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి.. డాలర్ అవసరం లేని, బ్లాక్‌చైన్ సాంకేతికతతో పనిచేసే ‘ఎంబ్రిడ్జ్’ అనే చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించాయి. తర్వాత సౌదీ అరేబియా కూడా ఇందులో చేరింది. ఇందులో మార్పిడి ఎలా జరుగుతుందంటే.. ఎంబ్రిడ్జ్‌లో భాగంగా ఉన్న దేశాలన్నీ తమ తమ డిజిటల్ కరెన్సీలను ఆ ప్లాట్‌ఫామ్‌పై ఉంచుతాయి. చైనాలోని ఒక కంపెనీ యూఏఈలోని ఒక కంపెనీకి చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు.. తన డిజిటల్ యువాన్లను ఆ ప్లాట్‌ఫామ్‌లోకి విడుదల చేస్తుంది.
ఎంబ్రిడ్జ్‌లోని ‘స్మార్ట్ కాంట్రాక్ట్’ అనే ప్రోగామ్ (ఇదొక డిజిటల్ మధ్యవర్తిలాంటిది. ఇది అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లతో అనుసంధానమై ఉంటుంది).. ఆ డిజిటల్ యువాన్లను ఆ రోజు రేటు ప్రకారం డిజిటల్ దిర్హామ్‌లలోకి మార్చి యూఏఈ కంపెనీ ఖాతాలో వేసేస్తుంది. దీనికి పట్టే సమయం.. కేవలం కొన్ని సెకన్లు మాత్రమే. దీంట్లో ఎక్కడా డాలర్ ప్రస్తావన ఉండదు. చైనా ఈ-యువాన్ల తరహాలోనే.. ఇటీవలికాలంలో భారత ప్రభుత్వం కూడా డిజిటల్ రూపీ(ఈ-రూపీ)ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇండియా కూడా ఎంబ్రిడ్జ్‌లో చేరి మన ఈ-రూపీని ఆ ప్లాట్‌ఫామ్‌పై ఉంచొచ్చు. కానీ.. ఎంబ్రిడ్జ్‌లో మిగతా దేశాలన్నీ చిన్నవి కావడంతో చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉంది. కాబట్టి.. అదే తరహాలో బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీలను అనుసంధానం చేస్తే బాగుంటుందని ఆర్బీఐ కేంద్రానికి సూచించింది. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియడంవల్లనే.. ట్రంప్ ఇటీవల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఏ దేశమైనా అమెరికా డాలర్‌ను కాదని కొత్త చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టాలని చూస్తే ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై 100ు సుంకాలు విధిస్తాం’’ అని బ్రిక్స్ దేశాలను దృష్టిలో పెట్టుకునే హెచ్చరించారు.
ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు..
పెద్ద ఎత్తున కాదుగానీ.. డాలర్‌తో సంబంధం లేకుండా ఇతర దేశాలతో లావాదేవీలు జరపడానికి భారత్ ఇప్పటికే చెప్పుకోదగ్గ ప్రయత్నాలు చేస్తోంది. ఉదాహరణకు.. విదేశీ బ్యాంకులు మన దేశంలోని ప్రత్యేక బ్యాంకుల్లో ఖాతాలు (వీటిని వోస్ట్రో ఖాతాలు అంటారు) తెరిచి రూపాయిల్లో లావాదేవీలు జరపడానికి ఆర్బీఐ ఇప్పటికే అనుమతిచ్చింది. రష్యా, యూఏఈ, శ్రీలంక, నైజీరియా, టాంజానియా, మారిషస్ వంటి దేశాలతో భారత్ ఈ పద్ధతిలోనే రూపీ ట్రేడింగ్ దిశగా కీలక ముందడుగు వేసింది. అలాగే.. వివిధ దేశాల స్థానిక చెల్లింపుల వ్యవస్థలతో మన యూపీఐని అనుసంధానం చేసేందుకు భారత్ కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. సింగపూర్‌లోని ‘పేనౌ’ వ్యవస్థతో మన యూపీఐ పూర్తిగా అనుసంధానమైంది. అంటే ఇప్పుడు సింగపూర్ వెళ్లే భారతీయులు ఎంచక్కా యూపీఐ ద్వారా అక్కడి దుకాణాల్లో చెల్లింపులు చేయొచ్చు. దీనికి మన ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్స్ ఖాతాల్లో ‘యూపీఐ ఇంటర్నేషనల్’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. మన ఖాతాలోంచి రూపాయల్లో డబ్బులు కట్ అయ్యి.. వారి ఖాతాలో సింగపూర్ డాలర్లలో జమవుతాయి. ఇలాగే.. యూఏఈలో ‘నియోపే’ టెర్మినల్స్ ఉన్న చోట మన యూపీఐ పనిచేస్తుంది. నేపాల్, భూటాన్‌లో భారతీయులు యూపీఐ యాప్స్‌తో చెల్లింపులు చేయొచ్చు. 2024 ఫిబ్రవరి నుంచి మారిషస్, శ్రీలంకలో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. యూరప్‌లో తొలిసారి.. పారి్‌సలోని ఈఫిల్ టవర్ వద్ద యూపీఐ చెల్లింపులను అనుమతించారు. యూకే, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, సౌదీఅరేబియా వంటి దేశాలతో.. యూపీఐ అనుసంధానానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రిటైల్ చెల్లింపుల్లో ప్రస్తుతం అమెరికాకు చెందిన వీసా, మాస్టర్‌కార్డ్‌లదే ఆధిపత్యం. కానీ, యూపీఐ ఎన్ని దేశాలకు విస్తరిస్తే.. అన్ని దేశాల్లో మన చెల్లింపులు అంతగా పెరుగుతాయి. అన్ని దేశాలూ ఇదే విధానాన్ని పాటించడం మొదలుపెడితే క్రమంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో డాలర్ హవా తగ్గుతుంది.
డాలర్ హవా.. అలా మొదలైంది!
అసలు డాలర్‌కు ఇంత విలువ ఎలా వచ్చింది? డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా ఎలా, ఎప్పుడు మారింది? ..ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే దాదాపు 80 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య ప్రభ రెండో ప్రపంచ యుద్ధం దెబ్బకు కొడిగట్టినప్పుడు.. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న అగ్రరాజ్యం ప్రపంచానికి పెద్దన్నగా అవతరించినప్పుడు.. ఈ కథ మొదలైంది! మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనూ, ఆ తర్వాతా.. పలు ఐరోపా దేశాలు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమెరికాకు అమ్మి ఆహారాన్ని, ఆయుధాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశాయి! దీంతో రెండో ప్రపంచ యుద్ధం ముగింపునకు వచ్చే సమయానికి ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఎక్కువగా బంగారం అగ్రరాజ్యం వద్ద పోగుపడింది. దీంతో, 1944లో బ్రెట్టన్‌వుడ్స్ కవలలుగా పేరొందిన ప్రపంచబ్యాంకును, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను (ఐఎంఎఫ్) ఏర్పాటు చేసి.. ‘మా దగ్గర ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ బంగారం ఉంది కాబట్టి, మీకు ఈ రెండు సంస్థల ద్వారా అప్పులు కావాలంటే డాలర్‌ను రిజర్వ్ కరెన్సీగా వాడుకోండి’ అనే ప్రతిపాదన చేసింది. అలా అమెరికా తన డాలర్ విలువను బంగారంతో ముడిపెడితే (అప్పట్లో ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం వెల 35 డాలర్లుగా ఉండేది. ఇప్పుడు దాదాపు 5000 డాలర్లు ఉంది).. మిగతా దేశాలన్నీ తమ కరెన్సీ విలువను డాలర్‌తో ముడిపెట్టాయి. డాలర్ రిజర్వ్ కరెన్సీ కావడంతో ప్రపంచదేశాలన్నీ తమకు కావాల్సిన డాలర్ల కోసం అమెరికాకు విస్తృతంగా ఎగుమతులను పెంచాయి. డాలర్‌కు విలువ పెరిగిపోవడంతో.. అమెరికా తన వద్ద ఉన్న బంగారం విలువను మించి డాలర్ నోట్లను ముద్రించడం ప్రారంభించింది. రెండున్నర దశాబ్దాలు తిరిగే సరికి.. అమెరికా వద్ద ఉన్న బంగారానికి, అది ముద్రించిన డాలర్ల విలువకు అసలు సంబంధమే లేకుండా పోయింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి ప్రపంచ దేశాలన్నీ ఒకేసారి వచ్చి, తమ వద్ద ఉన్న డాలర్లను అమెరికాకు ఇచ్చి.. ఆ విలువకు సమానమైన బంగారాన్ని ఇవ్వాలని అడిగితే అమెరికా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. దీంతో, బంగారానికి, డాలర్‌కు మధ్య ఉన్న లింక్‌ను అమెరికా తెంచేసింది. దీంతో, డాలర్‌కు డిమాండ్ తగ్గింది. ఈ సమయంలోనే అమెరికా వ్యూహాత్మకంగా ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఉత్పత్తి దేశమైన సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం సౌదీ తన చమురు మొత్తాన్నీ డాలర్లలోనే అమ్మాలి(దీన్నే ‘పెట్రో డాలర్ వ్యవస్థ’ అంటారు). దానికి బదులుగా ఆ దేశ రక్షణ బాధ్యతలు తీసుకుంటామని అమెరికా మాటిచ్చింది. అమెరికా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే.. ఈ విధానంలో చమురు కొనుగోళ్లకు అన్ని దేశాలకు డాలర్లు కావాలి కాబట్టి.. డాలర్ డిమాండ్ మళ్లీ పెరిగిపోయింది. అప్పట్నుంచీ ప్రపంచ వాణిజ్యంలో అమెరికా డాలర్ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.
ఆసియాలోనే అత్యంత పేలవ ప్రదర్శన చేసిన కరెన్సీ.. రూపాయి!
మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నా, ఆర్థిక వృద్ధి బాగున్నా.. రూపాయి మాత్రం బలహీనంగానే ఉంటోంది. 2025లో ఆసియాలోని అన్ని దేశాల కన్నా అత్యంత బలహీనమైనకరెన్సీగా రూపాయే నిలవడం ఇందుకు నిదర్శనం. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల కరెన్సీతో పోలిస్తే రూపాయి ఇప్పటికీ బలంగానే ఉందిగానీ.. ఆసియాలోని ఇతర దేశాలన్నింటి కరెన్సీల కన్నా డాలర్‌తో పోలిస్తే ఎక్కువగా పతనమైంది (దాదాపు 5 శాతం దాకా) రూపాయే. అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేలో ఈ విషయాన్ని పేర్కొని.. రూపాయి పేలవ ప్రదర్శనకు కారణాలేంటో కూడా చెప్పారు. ఈ సమస్యకు అంతర్గత లోపాల కంటే.. బయటి కారణాలే ఎక్కువని తెలిపారు. భౌగోళిక రాజకీయాలు, విదేశీ పెట్టుబడులు తగ్గడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో నెలకొన్న అనిశ్చితి వంటివాటివల్లే రూపాయి బలహీన పడిందని వెల్లడించారు.