Share News

చైనా డ్రోన్ల కోసం ఆరాటం..!

ABN , Publish Date - Nov 23 , 2026 | 02:53 AM

భారత సైన్యం చైనాకు చెందిన డ్రోన్లు, విడిభాగాలపై ఎక్కువగా ఆధారపడడంపై డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీఎఫ్‌ఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా డ్రోన్ల కోసం ఆరాటం..!

  • వాటి కొనుగోలుకు ఐదేళ్లలో 689 టెండర్లు జారీ

  • వాటిలో 580 భారత సైన్యం, ప్రభుత్వ సంస్థలవే

  • చైనా డ్రోన్లు, విడిభాగాలతో దేశ భద్రతకు ముప్పు

  • డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా తీవ్ర హెచ్చరిక

  • దేశీయ ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వాలని సూచన

న్యూఢిల్లీ, నవంబరు 22: భారత సైన్యం చైనాకు చెందిన డ్రోన్లు, విడిభాగాలపై ఎక్కువగా ఆధారపడడంపై డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీఎఫ్‌ఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సైన్యం, ప్రభుత్వ విభాగాలు చైనాకు చెందిన డ్రోన్లు, ఇతర విడిభాగాల కొనుగోలు కోసం భారీగా టెండర్లు పిలవడాన్ని డీఎఫ్‌ఐ ఆక్షేపించింది. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) వేదికగా 600కిపైగా టెండర్లలో చైనా ఉత్పత్తులను కోరడం దేశ భద్రతకు ముప్పని హెచ్చరించింది. 2021 మార్చి 10 నుంచి 2026 నవంబరు 19 మధ్య జీఈఎం పోర్టల్‌లో పిలిచిన టెండర్లను సమీక్షించిన డీఎఫ్ఐ.. వాటిలో 689 టెండర్లు చైనా డ్రోన్లు, ఇతర విడిభాగాల కోసం పిలిచినవిగా గుర్తించినట్టు తెలిపింది. కాగా, ఈ 689 టెండర్లలో 580 (84 శాతం) టెండర్లు ఒక్క భారత ఆర్మీ విభాగాల నుంచే వచ్చాయని పేర్కొంది. అలాగే 2026లో ఇప్పటివరకూ వచ్చిన 355 టెండర్లలో 328 సైన్యానికి సంబంధించినవే. 2025లో ఇలాంటి టెండర్లు 190 మాత్రమే ఉన్నాయని డీఎఫ్ఐ తెలిపింది. ‘‘భారత ప్రభుత్వం, సాయుధ దళాలు డ్రోన్‌ టెక్నాలజీకి మద్దతు ఇస్తున్నాయి. కానీ.. దురదృష్టవశాత్తు మన సొంత యూనిట్లు, జీఈఎంలో చైనా డ్రోన్లు, విడిభాగాలను ఆర్డర్‌ చేస్తూనే ఉన్నాయి’’ అని డీఎఫ్ఐ ఎక్స్‌లో పేర్కొంది. 689 టెండర్లలో 450లో డీజేఐ లేదా రేడియోమాస్టర్‌ వంటి చైనా బ్రాండ్లు కోరారని, ఆ తర్వాత స్పీడీ బీ, హెచ్‌జీఎల్‌ఆర్‌సీ, జీఈపీఆర్‌సీ, స్కైడ్రాయిడ్‌, టీ-మోటార్‌, ఈమ్యాక్స్‌, రన్‌క్యామ్‌ వంటి బ్రాండ్లు ఉన్నాయని తెలిపింది. అత్యధికంగా పేర్కొన్న ఈ 16 బ్రాండ్ల ప్రధాన కార్యాలయాలు చైనాలోనే ఉన్నాయి.


కాగా.. ఫ్లైట్‌ నియంత్రణ, డేటా ప్రసారం వంటి కీలక వ్యవస్థల్లో చైనా విడిభాగాలు ఉండడం దేశభద్రత, సైబర్‌ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని డీఎఫ్ఐ ఈ సందర్భంగా హెచ్చరించింది. అలాగే ఈ ఏడాది నవంబరు 18 నుంచి డ్రోన్‌ మోటార్లు, ఈఎస్‌సీలు, ఆటోపైలట్లు, రైడియోల ఎగుమతులకు లైసెన్సులను చైనా తప్పనిసరి చేసిందని, దీనివల్ల భవిష్యత్తులో సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. టెండర్లలో చైనా విడిభాగాల పేరు చేరినప్పుడే మన వ్యవస్థలోకి భద్రతా ముప్పు ప్రవేశించినట్టని పేర్కొంది. రక్షణ దళాలు కొనుగోలు చేసే డ్రోన్లు, ఇతర విడిభాగాల్లో చైనా ఉత్పత్తులు ఉండకూడదని సూచించింది. ప్రతి కొనుగోలులోనూ భారతీయ విడిభాగాలకే ప్రాధాన్యతనివ్వాలని, ప్రతి బిడ్‌లోనూ ఉత్పత్తి మూల దేశ పేరును తప్పనిసరిగా ప్రస్తావించాలని డీఎఫ్ఐ కోరింది.

Updated Date - Nov 23 , 2026 | 02:55 AM