Share News

చైనా సీసీటీవీ కెమెరాలపై నిషేధం

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:58 AM

భద్రత ప్రమాణాల దృష్ట్యా చైనాకు చెందిన పలు ప్రముఖ సీసీటీవీ కెమెరా బ్రాండ్లు, వాటి అనుబంధ సాఫ్ట్‌వేర్‌పై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది...

చైనా సీసీటీవీ కెమెరాలపై నిషేధం

  • హిక్‌విజన్‌, దహువా, టీపీ-లింక్‌లకూ వర్తింపు

  • భద్రత ప్రమాణాల దృష్ట్యా నిర్ణయం.. రేపటి నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ, మార్చి 30: భద్రత ప్రమాణాల దృష్ట్యా చైనాకు చెందిన పలు ప్రముఖ సీసీటీవీ కెమెరా బ్రాండ్లు, వాటి అనుబంధ సాఫ్ట్‌వేర్‌పై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నూతనంగా రూపొందించిన భద్రత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే ఇందుకు కారణం. ఇది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీలైన హిక్‌విజన్‌, దహువా, టీపీ-లింక్‌లకు ఈ నిర్ణయం వర్తించనుంది. భద్రత ప్రమాణాల విషయమై కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన స్టాండర్డయిజేషన్‌ టెస్టింగ్‌ అండ్‌ క్వాలిటీ సర్టిఫికేషన్‌ (ఎస్‌టీక్యూసీ) నిబంధనలు ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానున్నాయి. దేశంలో సీసీటీవీ కెమెరాలు, వీడియో నిఘా పరికరాలు విక్రయించాలంటే ఎస్‌టీక్యూసీ కింద అనుమతులు పొందడం తప్పనిసరి. ఇది అన్ని రకాల బ్రాండ్లకు కూడా వర్తిస్తుంది. చైనాకు చెందిన ఈ మూడు కంపెనీలతోపాటు, చైనాలో తయారయిన చిప్‌సెట్స్‌ను ఉపయోగించే ఇతర పరికరాలకు కూడా ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులు నిరాకరించారు. దేశంలో విక్రయించేందుకు ఎస్‌టీక్యూసీ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావడంతో అవిలేని కారణంగా ఆ మూడు చైనా కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. సీసీటీవీ కెమెరాల రంగంలో ఇంతవరకు చైనా ఉత్పత్తులే రాజ్యమేలాయి. మార్కెట్‌లో మూడో వంతు అవే ఉండేవి. వీటి స్థానాన్ని భారతీయ బ్రాండ్లయిన సీపీ ప్లస్‌,క్యుబో,మాట్రిక్స్‌ వంటివి భర్తీ చేయనున్నాయి.

Updated Date - Mar 31 , 2026 | 04:58 AM