Share News

యువతి దారుణం.. ప్రియుడి ఇంటికెళ్లి భార్య, పిల్లల్ని కత్తితో..

ABN , Publish Date - Apr 25 , 2026 | 04:06 PM

ప్రియుడి భార్య, పిల్లలపై ఓ యువతి ఘాతుకానికి ఒడిగట్టింది. కత్తితో అతి కిరాతకంగా దాడి చేసింది. ఈ దాడిలో ప్రియుడి భార్య, కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో శనివారం చోటుచేసుకుంది.

యువతి దారుణం.. ప్రియుడి ఇంటికెళ్లి భార్య, పిల్లల్ని కత్తితో..
Chhattisgarh Constable Wife and Son

ఇంటర్‌నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి భార్య, పిల్లలపై ఓ యువతి ఘాతుకానికి ఒడిగట్టింది. కత్తితో అతి కిరాతకంగా దాడి చేసింది. ఈ దాడిలో ప్రియుడి భార్య, కొడుకు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాయ్‌పూర్‌కు చెందిన కానిస్టేబుల్ లలితేశ్ యాదవ్, రీనా యాదవ్ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఆదిత్య, నైనా, తానియా ఉన్నారు. లలితేశ్ గత కొంతకాలం నుంచి అదే ప్రాంతానికి చెందిన సరోజినీ భరద్వాజ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.


ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, సరోజినీ శుక్రవారం ప్రియుడు లలితేశ్ ఇంటికి వచ్చింది. అతడితో గొడవ పెట్టుకుంది. లలితేశ్ ఆమెకు సర్ది చెప్పి అక్కడినుంచి పంపేశాడు. మరుసటి రోజు (శనివారం) ఉదయం సరోజినీ మళ్లీ ప్రియుడి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో లలితేశ్ ఇంట్లో లేడు. కుటుంబం మొత్తం సొంతూరు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవటంతో టికెట్లు తీసుకురావడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. సరోజినీ ఇంటికి రాగానే రీనా యాదవ్‌తో గొడవ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే టీవీ వాల్యూమ్ పెంచింది. అక్కడ ఉన్న కత్తిని తీసుకుని దారుణానికి ఒడిగట్టింది.


మొదట రీనా యాదవ్‌పై దాడి చేసింది. ఆ తర్వాత గదిలో నిద్రపోతున్న 9 ఏళ్ల ఆదిత్యపై దాడి చేసింది. రీనా ఇద్దరు కూతుళ్లు నైనా, తానియాలపై కూడా దాడి చేయడానికి సిద్ధమైంది. తీవ్రంగా గాయపడ్డ రీనా తన కూతుళ్లపై దాడి చేయవద్దని సరోజినీని బతిమాలింది. అయినా ఆమె మనసు కరగలేదు. పిల్లలపై దాడి చేయడానికి పూనుకుంది. రీనా యాదవ్ వెంటనే సరోజినీ కాళ్లు పట్టుకుని ఏటూ కదలకుండా చేసింది. ఇంట్లోనుంచి పారిపొమ్మని పిల్లలకు గట్టిగా అరిచి చెప్పింది. దీంతో ఓ బాలిక ఇంట్లోని బాత్‌రూములో దాక్కుంది.


మరో బాలిక బయటకు పరిగెత్తి పొరిగిళ్ల వారికి విషయం చెప్పింది. పొరిగిళ్ల వారు వెంటనే ఆ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. సరోజినీ చేతిలోని కత్తి లాక్కుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రీనా యాదవ్, ఆదిత్య ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సరోజినీని అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేవరకు దిగ్బంధనం కొనసాగుతుంది.. ఇరాన్‌కు అమెరికా మంత్రి వార్నింగ్..

మీ ఒంటరితనానికి ఈ అలవాట్లే కారణం

Updated Date - Apr 25 , 2026 | 04:12 PM