Share News

పట్టాలు తప్పిన చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు

ABN , Publish Date - Feb 05 , 2026 | 01:35 PM

చెన్నై సెంట్రల్ - న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం పట్టాలు తప్పింది. రైలు భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వైపు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పట్టాలు తప్పిన చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు
Chennai Central Express

ఇంటర్‌నెట్ డెస్క్‌: ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌ జిల్లాలోని జఖపుర రైల్వే స్టేషన్‌ సమీపంలో చెన్నై సెంట్రల్ - న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం పట్టాలు తప్పింది. దీంతో మూడు బోగీలు పట్టాల నుంచి కిందకు జారిపోయాయి. రైలు భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వైపు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు నెమ్మదిగా వెళుతుండటంతో పెను ప్రమాదం తప్పింది.


రైల్వే అధికారులు తెలిపిన వివరాల మేరకు.. జఖపుర రైల్వే స్టేషన్‌ వద్ద రైలు పట్టాలు తప్పింది. దీంతో ఓ ఏసీ బోగీ, రెండు సాధారణ బోగీలు పట్టాల నుంచి పక్కకు వచ్చేశాయి. బోగీలు పట్టాలు తప్పటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణం నష్టం సంభవించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రక్‌ నుంచి రెస్క్యూ, పునరుద్ధరణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు మొదలుపెట్టాయి. అధికారులు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


ప్రమాదం జరిగిన రైలు పట్టాలపై పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ట్రాక్‌లను శుభ్రం చేసి, సాధారణ రైలు సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ఇంజినీరింగ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. కాగా ఈ రైలు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పునరుద్ధరణ పనులు పూర్తై.. రైలు సేవలు సాధారణ స్థితికి వచ్చాక పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టే అవకాశముందని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఖర్గే, నడ్డా మధ్య వాగ్వాదం.. రాజ్యసభలో హోరాహోరీ..

హనీమూన్ మర్డర్ 2.0.. ప్రియుడితో కలిసి భర్త హత్య..

Updated Date - Feb 05 , 2026 | 03:39 PM