విదేశీ విరాళాలపై కేంద్రం కొరడా
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:48 AM
విదేశీ విరాళాల్ని స్వీకరించే స్వచ్ఛందసంస్థలకు (ఎన్‌జీవోలకు) సంబంధించిన నిబంధనల్ని కేంద్రం కఠినతరం చేసింది. ఈ మేరకు ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం....
ఎన్‌జీవోలకు పలు కొత్త నిబంధనలు
సంస్థ కీలకస్థానాల్లో విదేశీయులు ఉండరాదు
ఏ లక్ష్యం కోసం విరాళాలు తీసుకుంటున్నారో, ఏ రాష్ట్రాల్లో పని చేస్తున్నారో వెల్లడించాలి
మతమార్పిడి జరపటానికి వీల్లేదు
విరాళాల వ్యయం రికార్డులు సమర్పించాలి
వాటిపై ప్రభుత్వం క్షేత్రస్థాయి దర్యాప్తు
తొలి విడత నిధుల్లో 75 శాతం ఖర్చు చేస్తేగానీ రెండో విడత నిధులు విడుదల కావు
సోషల్ మీడియా వివరాలు, ప్రచురించిన
పుస్తకాలు, వ్యాసాల వివరాలు తెలియజేయాలి
నిధులు దుర్వినియోగమైతే భారీ జరిమానాలు
నిబంధనలు సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ, జూన్ 23: విదేశీ విరాళాల్ని స్వీకరించే స్వచ్ఛందసంస్థలకు (ఎన్‌జీవోలకు) సంబంధించిన నిబంధనల్ని కేంద్రం కఠినతరం చేసింది. ఈ మేరకు ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, 2011’ (ఎఫ్‌సీఆర్‌ఏ)లోని పలు నిబంధనల్ని సవరిస్తూ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ప్రకారం.. సంస్థ డైరెక్టర్, భాగస్వామి, ట్రస్టీ తదితర కీలకస్థానాల్లో విదేశీయులు ఉన్న ఎన్‌జీవోలకు గుర్తింపుగానీ, విదేశీ విరాళాల్ని తీసుకోవటానికి అనుమతిగానీ లభించదు. ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇచ్చే సంస్థలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. విదేశీ విరాళాల కోసం నమోదు చేసుకునే ఎన్‌జీవోలు ఏ ప్రయోజనం కోసం విరాళాల్ని కోరుకుంటున్నాయో, దేశంలో ఏయే రాష్ట్రాల్లో, కేంద్రపాలితప్రాంతాల్లో తమ కార్యకలాపాలు ఉంటాయో స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఎన్‌జీవోల కార్యకలాపాలను మత, సాంస్కృతిక, విద్యా, సామాజికసేవ రంగాలుగా వర్గీకరిస్తూ ఈ నోటిఫికేషన్‌లో ఒక షెడ్యూల్‌ను పొందుపర్చారు. వీటిలో ఏ రంగం తమకు వర్తిస్తుందో ఎన్‌జీవోలు పేర్కొనాల్సి ఉంటుంది. మతపరమైన కార్యకలాపాల కింద ప్రార్థనా స్థలాల నిర్మాణం, పునరుద్ధరణ, నిర్వహణ, ఆధ్యాత్మిక సంగీతం, బోధనలు, ప్రవచనాలు, ధ్యానం, భక్తి సంప్రదాయాల నమోదు, మూలవాసుల విశ్వాసాల పరిరక్షణ వంటివి వస్తాయి. ఇవేవీ కూడా మతమార్పిడి లక్ష్యంగా జరగటానికి వీల్లేదు. 2026కు ముందు రిజిస్టర్ అయిన ఎన్‌జీవోలు తమ కార్యకలాపాల లక్ష్యం గురించి, అవి కొనసాగుతున్న ప్రాంతాల గురించిన వివరాల్ని ప్రభుత్వానికి ఏడాదిలోపు తెలియజేయాలి. ఇక, తమ లక్ష్యాలను, కార్యకలాపాలు కొనసాగే ప్రాంతాలను పెంచుకోవాలనుకుంటే రూ.300 చొప్పున ప్రభుత్వానికి అదనపు రుసుము చెల్లించాలి.
అలాగైతేనే లైసెన్సు పునరుద్ధరణ
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన విదేశీ విరాళాల్లో కనీసం రూ.10 లక్షలు నిర్దేశిత ప్రాంతంలో, నిర్దేశిత లక్ష్యంతో ఖర్చు అయినట్లుగా ఎన్‌జీవోలు రికార్డులు సమర్పించాలి. అలాగైతేనే, ఆ ఎన్‌జీవో లైసెన్సును పునరుద్ధరిస్తారు. లేదంటే, లైసెన్సు రద్దవుతుంది. పలు ఎన్‌జీవోలు నిష్ర్కియాపరంగా మారినప్పటికీ.. లైసెన్సులను కొనసాగించుకుంటున్న ధోరణిని అడ్డుకోవటానికి కేంద్రం ఈ నిబంధనను తీసుకొచ్చింది. ‘ప్రత్యేక లక్ష్యం’ కోసం ముందస్తు అనుమతితో విదేశీ విరాళాల్ని స్వీకరించే ఎన్‌జీవోలు తొలి విడత కింద విడుదలైన నిధుల్లో కనీసం 75 శాతం నిధుల్ని ఖర్చు చేస్తేగానీ మలి విడత నిధులు విడుదల కావు. నిధుల వ్యయంపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరుపుతుంది. విదేశీ విరాళాలు స్వీకరించే ఎన్‌జీవోలు తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాల్ని ప్రభుత్వానికి సమర్పించాలి. నిధులు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షమార్గాల్లో వస్తే.. అసలు దాత ఎవరో స్పష్టం చేయాలి. ఐటీ రిటర్నుల దాఖలులో ఆర్థిక వివరాలేగాక, కార్యకలాపాల వివరాలు కూడా పొందుపరచాలి. ఎన్‌జీవోలు ఏ విధమైన వార్తలను ప్రసారం చేయవద్దు. ఏమైనా పుస్తకాలను, వ్యాసాలను ప్రచురించినా వాటి గురించి ప్రభుత్వానికి తెలియజేయాలి.
నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు
ఎన్‌జీవోలు విదేశీ విరాళాలను దుర్వినియోగం చేస్తే విధించే జరిమానాల్ని కూడా కేంద్రం సవరించింది. దీనికోసం కేంద్ర హోంశాఖ మరో గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. విదేశీ విరాళాల్లో పాలనాపరమైన ఖర్చుల కోసం 20 శాతానికి మించి వ్యయం చేస్తే జరిమానా కింద రూ.లక్ష లేదా పరిమితికి మించి చేసిన ఖర్చులో 5 శాతం (ఏది ఎక్కువైతే అది) విధిస్తారు. షేర్‌మార్కెట్ వంటి వాటిల్లో విదేశీ విరాళాల్ని పెట్టుబడిగా పెడితే రూ.లక్ష లేదా పెట్టిన పెట్టుబడిలో 30 శాతం జరిమానా (ఏది ఎక్కువైతే అది) విధిస్తారు. ఆ పెట్టుబడితో వచ్చే లాభాలను 100 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. నిర్దేశిత లక్ష్యం కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం విదేశీ విరాళాల్ని ఉపయోగిస్తే.. ఆ మొత్తంలో 30 శాతం లేదా రూ.లక్ష జరిమానా (ఏది ఎక్కువైతే అది) వసూలు చేస్తారు. ఎన్‌జీవో నమోదు కాని రాష్ట్రంలో లేదా కేంద్రపాలితప్రాంతంలో సదరు విరాళాల్ని వినియోగించినా కూడా ఇదే స్థాయిలో జరిమానా ఉంటుంది.