Share News

డీప్‌ఫేక్‌, నిషేధిత ఏఐ కంటెంట్‌..3 గంటల్లో తొలగించాల్సిందే!

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:04 AM

ఏఐతో సృష్టించిన కృత్రిమ వీడియోలు, ఆడియోలు, డీప్‌ఫేక్‌ వంటి కంటెంట్‌పై కేంద్రప్రభుత్వం కొరడా ఝళిపించింది.

డీప్‌ఫేక్‌, నిషేధిత ఏఐ కంటెంట్‌..3 గంటల్లో తొలగించాల్సిందే!

  • ఐటీ రూల్స్‌ చట్టానికి సవరణలు, నోటిఫికేషన్‌

  • 36 గంటల గడువును 3 గంటలకు తగ్గించిన కేంద్రం

  • పిల్లలపై దౌర్జన్యం, మహిళలపై వేధింపులు, తప్పుడు సమాచారం తదితర అంశాలకు వర్తింపు

  • ఏఐ కంటెంట్‌పై హెచ్చరిక తప్పనిసరి

  • సాధారణ ఎడిటింగ్‌, విద్య, డిజైన్‌ సంబంధిత అంశాలకు మినహాయింపు

  • ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఏఐతో సృష్టించిన కృత్రిమ వీడియోలు, ఆడియోలు, డీప్‌ఫేక్‌ వంటి కంటెంట్‌పై కేంద్రప్రభుత్వం కొరడా ఝళిపించింది. నిషేధిత జాబితాలో ఉన్న ఏఐ కంటెంట్‌ను తొలగించాలని కోర్టులు లేదా సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చిన మూడు గంటల్లోగా వాటిని తొలగించాలని యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలను నిర్దేశించింది. ఇప్పటి వరకూ ఉన్న గడువు 36 గంటలు కాగా.. దానిని ఏకంగా 3 గంటలకు తగ్గించటం గమనార్హం. ఈ మేరకు ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్‌ మీడియా నైతిక నిబంధనావళి) రూల్స్‌, 2021’ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చట్టవ్యతిరేక, మోసపూరిత, లైంగిక వేధింపులు, పిల్లలపై దౌర్జన్యాలు, పేలుడు పదార్థాలు, తప్పుడు పత్రాలకు సంబంధించిన ఏఐ కంటెంట్‌ను ఈ చట్టప్రకారం నిషేధించారు. ఈ తరహా కంటెంట్‌ను ప్రారంభంలోనే నివారించేలా ప్లాట్‌ఫాంలు ఆటోమేటెడ్‌ టూల్స్‌ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తాజా సవరణల్లో కేంద్రం స్పష్టం చేసింది. కాగా, నిజమైనదిగా అనిపించేలా ఏఐతో తయారు చేసే నకిలీ ఆడియో, వీడియో, ఆడియో-వీడియో కంటెంట్‌కు నిబంధనలు వర్తించనున్నాయి. ఏదైనా కంటెంట్‌లో సాధారణ ఎడిటింగ్‌ ప్రక్రియకు, మెరుగులు దిద్దటానికి ఏఐని వాడటం, విద్యా సంబంధమైన, డిజైన్లకు సంబంధించిన అంశాల్లో ఏఐని వాడటానికి మినహాయింపు ఉంటుంది. ఐటీ చట్టం కింద చట్టవ్యతిరేక చర్యలుగా పరిగణిస్తున్న వాటిల్లో ఇక మీదట ఏఐ కంటెంట్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఏఐ కంటెంట్‌ను వినిపిస్తున్నప్పుడు, ప్రదర్శిస్తున్నప్పుడు అది ఏఐ కంటెంట్‌ అని సోషల్‌ మీడియా వేదికలు యూజర్లకు స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ హెచ్చరిక.. వీడియో అయితే తెర మీద ఏ సైజులో ఉండాలి? ఆడియో అయితే ఎంత వ్యవధిపాటు ఉండాలి? అన్న నిబంధనలు ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్‌ మీడియా నైతిక నిబంధనావళి) రూల్స్‌, 2021’ చట్టంలో కేంద్రం గతంలో పొందుపరిచింది కానీ.. తాజాగా తీసుకొచ్చిన సవరణల్లో వీటిని తొలగించింది. హెచ్చరిక మాత్రం ఉండాలని సవరించింది. కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం విధించే జరిమానాలపై ప్రతీ 3నెలలకోసారి ప్లాట్‌ఫాంలు తమ యూజర్లను హెచ్చరించాల్సి ఉంటుంది.

Updated Date - Feb 11 , 2026 | 02:04 AM