Share News

టెలిగ్రాం బంద్‌.. నీట్‌ పరీక్ష నేపథ్యంలో కేంద్రం ఆంక్షలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:27 AM

నీట్‌ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ‘టెలిగ్రాం’ వినియోగంపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించింది.

టెలిగ్రాం బంద్‌.. నీట్‌ పరీక్ష నేపథ్యంలో కేంద్రం ఆంక్షలు

  • ఈ నెల 22 వరకూ సేవల నిలిపివేత

  • 30 వరకు మెసేజీల ఎడిటింగ్‌ కూడా..

  • నీట్‌ పేరిట మోసాలకు పాల్పడే ముఠాలను అడ్డుకోవటానికేనని వివరణ

  • నిషేధం ఉన్నా అందుబాటులోనే టెలిగ్రాం!

న్యూఢిల్లీ, జూన్‌ 16: నీట్‌ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ‘టెలిగ్రాం’ వినియోగంపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించింది. పరీక్ష ఈ నెల 21న జరగనుండగా.. 22వ తేదీ వరకూ ఆ ప్లాట్‌ఫాం సేవలను పూర్తిగా నిలిపివేసింది. అనంతరం సేవలు పునఃప్రారంభమైనా.. 30వ తేదీ వరకూ మెసేజీ ఎడిటింగ్‌ సేవలు అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలని టెలిగ్రాంను ఆదేశించింది. నీట్‌ పరీక్షకు సంబంధించిన మోసాలకు పాల్పడే ముఠాలను అడ్డుకోవటానికి, అవాస్తవాల ప్రచారాన్ని నిరోధించటానికే ఈ చర్యలు తీసుకున్నామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార మంత్రిత్వశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నీట్‌ పరీక్షను నిర్వహించే ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ (ఎన్‌టీఏ) సిఫారసుల మేరకు ఈ ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. దీనిపై ఎన్‌టీఏ హర్షం వ్యక్తం చేసింది. పరీక్షను పూర్తి సురక్షిత వాతావరణంలో నిర్వహించటానికి ఈ చర్యలు తోడ్పడుతాయని తెలిపింది. విద్యార్థులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు జారీ చేసిన కొన్ని టెలిగ్రాం చానళ్లను ఇప్పటికే నిలిపివేశామని గుర్తు చేసింది. నీట్‌ ప్రశ్నపత్రాలను విక్రయిస్తామంటూ టెలిగ్రాంలో కొందరు ప్రచారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇవన్నీ తప్పుడు ప్రచారాలని ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ అభిషేక్‌ సింగ్‌ స్పష్టం చేశారు. టెలిగ్రాంలో పాత మెసేజీలను ఎడిట్‌ చేసి, పాత తేదీతోనే పంపించే సదుపాయం ఉందని, దీనివల్లే పేపర్‌ లీకేజీ వంటి ప్రచారాలకు ఇది ఉపయోగపడుతుందని ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కామకోఠి తెలిపారు. నీట్‌ ప్రశ్నపత్రాలను విక్రయిస్తామంటూ ప్రచారం చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ప్లేస్టోర్‌ నుంచి టెలిగ్రాం యాప్‌ను గూగుల్‌ తొలగించింది. యాపిల్‌ కూడా తొలగించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, ప్రభుత్వం నిషేధం విధించినా కూడా దేశవ్యాప్తంగా పలువురికి టెలిగ్రాం సేవలు అందుబాటులోనే ఉన్నాయి. దీనికి.. సాంకేతిక అంశాలే కారణమని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా వెబ్‌సైట్‌ను, యాప్‌ను నిషేధిస్తే ఆ మేరకు జియో, ఎయిర్‌టెల్‌ వంటి ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు (ఐఎస్‌పీ) చర్యలు తీసుకుంటాయి. నిషేధం అమలవుతుంది. కానీ, టెలిగ్రాం దీనికి భిన్నంగా పని చేస్తుందని, భారత్‌లోని ఐఎస్‌పీలు దానిని అడ్డుకోలేవని చెబుతున్నారు.


ఇది బ్యాండ్‌ ఎయిడ్‌ పరిష్కారం

టెలిగ్రాం మీద ప్రభుత్వం ఆంక్షలు విధించటంపై ‘ఇంటర్నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌’ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ‘బ్యాండ్‌ ఎయిడ్‌ (పైపూత) పరిష్కారం’లా ఉందని, పరీక్షల్లో జరిగే అవినీతిని ఎదుర్కోవటానికి ఇది సరైన చర్య కాదని విమర్శించింది. ‘సమాచార సాంకేతికత చట్టం, 2000’లోని సెక్షన్‌ 69ఏ ప్రకారం ఆంక్షలు విధిస్తున్నామన్న కేంద్రం ప్రకటనను ప్రస్తావిస్తూ.. ఏదైనా ఒక సమాచార మూలంపైన మాత్రమే ఆంక్షలు విధించే అధికారాన్ని ఈ చట్టం ఇస్తోందని, అంతేగానీ, మొత్తం ప్లాట్‌ఫాంనే నిషేధించటానికి వీల్లేదని తెలిపింది. సీబీఎస్ఈ ఆన్‌స్ర్కీన్‌ మార్కింగ్‌ సిస్టమ్‌లో ఉన్న లోపాలను వెల్లడించి వార్తల్లోకెక్కిన టీనేజీ యువకుడు నిసర్గ అధికారి.. నిషేధం విధించినా కూడా టెలిగ్రాం వినియోగాన్ని అడ్డుకోవటం సాధ్యం కాదని, ప్రాక్సీలు తదితర మార్గాల్లో దానిని వాడుకునే సౌలభ్యం ఉంటుందని, టెలిగ్రాంను అలా డిజైన్‌ చేశారని వివరించారు. 12వ తరగతి పూర్తి చేసిన నిసర్గ ఇటీవలే ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ డిఫెన్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌లో కాంట్రాక్టు పద్ధతిన ఇంజనీర్‌గా చేరారు. కాగా, టెలిగ్రాంపై ప్రభుత్వ ఆంక్షల మీద సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అతి భద్రతా చర్యలతో విద్యార్థులపై ఒత్తిడి: అన్నామలై

నీట్‌ రీ ఎగ్జామ్‌ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న భద్రతా చర్యలు అతిగా ఉన్నాయని, వాటి వల్ల విద్యార్థుల మీద మరింత భారం పడుతుందని, వారు ఒత్తిడికి గురవుతారని బీజేపీకి ఇటీవలే రాజీనామా చేసిన తమిళనాడుకు చెందిన నాయకుడు అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు. నీట్‌ పరీక్ష కోసం రెండంచెల సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌ భద్రత, వాయుసేన విమానాల ద్వారా ప్రశ్నపత్రాల రవాణా, ఏఐ పర్యవేక్షణలో నాలుగంచెల సీసీటీవీ నిఘా, పరీక్షకేంద్రంలోకి వెళ్లే విద్యార్థులకు బయోమెట్రిక్‌, ముఖ గుర్తింపుతోపాటు పలు రౌండ్ల తనిఖీలు వంటివి విద్యార్థుల మీద తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తాయన్నారు. ఈ విమర్శలను బీజేపీ ఖండించింది. ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా పరీక్షను నిర్వహించటం కోసమే ఈ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారని తెలిపింది.


సాధారణ యూజర్లకు శిక్ష

  • టెలిగ్రాం వ్యవస్థాపకుడు పావెల్‌

నిషేధం వల్ల టెలిగ్రాం సాధారణ వినియోగదారులు ఇబ్బందిపడటం తప్ప ఒరిగేదేమీ ఉండదని, పేపర్‌ లీకులు చేసే వాళ్లు ఆ పని ఇతర యాప్‌ల ద్వారా కొనసాగిస్తారని టెలిగ్రాం వ్యవస్థాపకుడు పావెల్‌ దురోవ్‌ అభిప్రాయపడ్డారు. కేంద్రం ఆంక్షల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ‘లీకైన ప్రశ్నపత్రాలను కొందరు యూజర్లు టెలిగ్రాంలో షేర్‌ చేశారన్న కారణంతో వారంపాటు భారత ఐటీశాఖ టెలిగ్రాంను నిషేధించింది. ఇది భారత్‌లోని 15 కోట్ల మంది సాధారణ టెలిగ్రాం వినియోగదారులను శిక్షించటమే తప్ప పరీక్ష పత్రాలను లీక్‌ చేసిన వారిని శిక్షించినట్లు కాదు. నిషేధం దేనినీ అడ్డుకోలేదు. లీకులు ఇతర యాప్‌ల ద్వారా జరుగుతాయి’ అని పేర్కొన్నారు.

పరీక్షకు హాజరు కావటానికి నీట్‌ పేపర్‌ లీకేజీ నిందితుడికి అనుమతి

నీట్‌ యూజీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన ఓ నిందితుడిని.. ఈ నెల 21వ తేదీన జరిగే నీట్‌ రీ ఎగ్జామ్‌కు హాజరుకావటానికి ఢిల్లీ కోర్టు అనుమతించింది. నీట్‌ లీకేజీ కేసులో అరెస్టయిన 13 మందిలో యశ్‌ యాదవ్‌ ఒకరు. మే నెలలో సీబీఐ యశ్‌ను రాజస్థాన్‌లోని జైపూర్‌లో అరెస్టు చేసింది. అనంతరం, అతడిని జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించారు. ఈ నేపథ్యంలో నీట్‌ పరీక్షకు హాజరుకావటానికి వీలుగా తనకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ యశ్‌ యాదవ్‌ ఢిల్లీలో స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయాధికారి విశాల్‌ గోగ్నే.. పిటిషనర్‌ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, ఒక విద్యార్థిగా పరీక్షకు హాజరుకావటానికి అతడికి ఉన్న హక్కును తొలగించలేమన్నారు. అయితే, కేసు దర్యాప్తు దశలో ఉన్నందున బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేశారు. కస్టడీలోనే పరీక్షకు హాజరుకావటానికి అనుమతించారు.

Updated Date - Jun 17 , 2026 | 06:44 AM