Share News

చినాబ్‌పై భారీ పవర్‌ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం టెండర్లు

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:37 AM

పహల్గాంలో అమాయక భారత పర్యాటకులపై పాకిస్థాన్‌ ప్రేరిత ఉగ్రవాదుల దాడికి నిరసనగా.. ఆ దేశంతో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన మోదీ ప్రభుత్వం..

చినాబ్‌పై భారీ పవర్‌ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం టెండర్లు

  • రూ.5,129 కోట్ల వ్యయం

  • పూర్తయితే పాక్‌కు నీళ్ల కట్టడి

శ్రీనగర్‌, ఫిబ్రవరి 8: పహల్గాంలో అమాయక భారత పర్యాటకులపై పాకిస్థాన్‌ ప్రేరిత ఉగ్రవాదుల దాడికి నిరసనగా.. ఆ దేశంతో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన మోదీ ప్రభుత్వం.. చినాబ్‌ నదిపై మెగా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జమ్మూకశ్మీరులోని ఉధంపూర్‌, రాంబన్‌ జిల్లాల్లో సావల్‌కోట్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) తాజాగా టెండర్లు పిలిచింది. బగ్లీహార్‌ ప్రాజెక్టుకు ఎగువన, సలాల్‌ ప్రాజెక్టుకు దిగువన నదీప్రవాహం ఆధారంగా.. రూ.5,129 కోట్ల వ్యయంతో తలపెట్టిన 1,856 మెగావాట్ల ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపడతారు. ఈ టెండర్లకు మార్చి 12 నుంచి బిడ్లు స్వీకరిస్తారు. 3,285 రోజుల్లో అంటే తొమ్మిదేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా విధించారు. పాకిస్థాన్‌ వ్యవసాయ రంగం 90ు సింధు నది బేసిన్‌పైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో చినాబ్‌పై ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా పాకిస్థాన్‌కు నీళ్లు వెళ్లకుండా కట్టడి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కిస్ట్‌వార్‌ జిల్లాలో చినాబ్‌ పైనే మరో 4 జలవిద్యుత్‌ ప్రాజెక్టులను వేగంగా నిర్మించాలని సంకల్పించింది.

Updated Date - Feb 09 , 2026 | 01:37 AM