రాబడి కట్..స్కీములు ఫట్!
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:42 AM
కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది ఆదాయం పడిపోయింది. మరీ ముఖ్యంగా.. ఆదాయ పన్ను, జీఎస్టీ వసూళ్లు అంచనాలకు ఎంతో దూరంగా ఉండిపోయాయి.
ఈ ఏడాది కేంద్రానికి 1.92 లక్షల కోట్ల మేరకు తగ్గిన ఆదాయం
ఆదాయ పన్ను 1.26 లక్షల కోట్లు.. జీఎస్టీ 1.31 లక్షల కోట్లకు గండి
దీనికితోడు, రక్షణ, ఎరువులు, ఆహార సబ్సిడీకి భారీగా పెరిగిన వ్యయం
ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద రూ.20 వేల కోట్ల మేర ఎక్కువ చెల్లింపులు
ఫలితంగా.. శాఖల కేటాయింపుల్లో భారీ కోతలు.. ఇళ్లు, రోడ్లకు మొండిచేయి
ఒక్క కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లోనే రూ.1.21 లక్షల కోట్లకు కోతలు
కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది ఆదాయం పడిపోయింది. మరీ ముఖ్యంగా.. ఆదాయ పన్ను, జీఎస్టీ వసూళ్లు అంచనాలకు ఎంతో దూరంగా ఉండిపోయాయి. అదే సమయంలో, ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆపరేషన్ సిందూర్ కారణంగా రక్షణ శాఖకు, అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఎరువులు, ఆహార సబ్సిడీకి ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫలితం.. ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరే వివిధ పథకాల్లో కోతలు పెట్టాల్సి వచ్చింది. ఇళ్లకు, రోడ్లకు కోతలు పెట్టి, తాగు నీటి పథకాలను రద్దు చేయాల్సి వచ్చింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్ను వసూళ్లు రూ.42,70,233 కోట్లు వస్తాయని బడ్జెట్లో కేంద్రం అంచనా వేసింది. కానీ, సవరించిన అంచనాల్లో అది రూ.40,77,772 కోట్లకు తగ్గింది. అంటే, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయం రూ.1,92,461 కోట్లు పడిపోయింది. ఇందులో ఒక్క ఆదాయ పన్నే ఏకంగా రూ.1.26 లక్షల కోట్లు పడిపోవడం విశేషం. గత ఏడాది బడ్జెట్లో ప్రకటించిన కొత్త స్లాబులు ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఏడాదికి రూ.12 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారికి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో కొత్తగా ఆదాయపన్ను పరిధిలోకి వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. అంతేనా.. ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా రంగాల్లో కొత్త నియామకాలు నిలిచిపోయాయి. వేతన పెంపులు కూడా ఆగిపోయాయి. రియల్ ఎస్టేట్ సంక్షోభం కారణంగా క్రయవిక్రయాలు మందగించడంతో క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చే ఆదాయం కూడా సర్కారుకు పడిపోయింది. ఫలితంగా, ఈ ఏడాది ఆదాయ పన్నులో లక్ష కోట్లకుపైగా రాబడి పడిపోయింది.
ఇక, జీఎస్టీ వసూళ్లది కూడా ఇదే తంతు! ఈ ఆర్థిక సంవత్సరంలోనే జీఎస్టీ స్లాబులను కేంద్ర ప్రభుత్వం గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. దాంతో, జీఎస్టీ ఆదాయం ఏకంగా రూ.1.31 లక్షల కోట్లు పడిపోయింది. గత బడ్జెట్లో జీఎస్టీ కింద రూ.11,78,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే.. సవరించిన అంచనాల్లో ఆ మొత్తం కేవలం రూ.10,46,480 కోట్లు మాత్రమే. ద్రవ్యోల్బణం పెరగడంతో మధ్య తరగతి ప్రజలు సొంత ఖర్చు తగ్గించుకున్నారు. వినియోగం పడిపోవడంతో జీఎస్టీ వసూళ్లూ తగ్గిపోయాయి. అయితే, ఆదాయ పన్ను, జీఎస్టీల్లో రెండున్నర లక్షల కోట్లకుపైగా ఆదాయం పడిపోయినా.. కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్, ఎక్సైజ్ శాఖలు కేంద్ర ప్రభుత్వాన్ని కాస్త ఆదుకున్నాయి. అంచనా వేసిన దానికంటే కార్పొరేషన్ ట్యాక్స్ రూ.27 వేల కోట్లు; కస్టమ్స్ రూ.18,290 కోట్లు; ఎక్సైజ్ పన్ను రూ.19,550 కోట్ల ఆదాయం పెరిగింది. ఆదాయం తగ్గినా ఆర్బీఐ, ప్రభుత్వ బ్యాంకుల నుంచి కేంద్రానికి రావాల్సిన డివిడెండ్లు అంచనా వేసిన వాటి కంటే రూ.50 వేల కోట్లు పెరగడం కాస్త ఊరట. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో ఆ ప్రభావం అంతిమంగా రాష్ట్రాలపైనా పడింది. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వాటా కూడా తగ్గిపోయింది. రాష్ట్రాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.14,22.444 కోట్లు పంచాలని అంచనా వేస్తే.. సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.13,92,971 కోట్లకు కుదించారు.
ఇళ్లు, రోడ్లకు మొండిచేయి
కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పడిపోవడంతో కీలక శాఖల కేటాయింపుల్లో కోతలు విధించాల్సి వచ్చింది. ఫలితంగా, ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కలేదు. ఉదాహరణకు, గ్రామీణ పేదలు ఇళ్లు కట్టుకోవడానికి అమలు చేసే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద బడ్జెట్లో రూ.54,832 కోట్లు కేటాయిస్తే.. సవరించిన అంచనాల్లో అది కాస్తా రూ.32,500 కోట్లకు తగ్గిపోయింది. అంటే, ఒక్క ఈ పథకంలోనే రూ.22,332 కోట్లకు కోతలు పెట్టారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి పథకాలకు గత బడ్జెట్లో రూ.67 వేల కోట్లు కేటాయించారు. కానీ, కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. గ్రామీణ రోడ్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. పీఎంజీఎ్‌సవై పథకం కింద 2025-26 బడ్జెట్లో రూ.19 వేల కోట్లు కేటాయించారు. కానీ, కేవలం రూ.11 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంతేనా.. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపైనా ప్రభావం పడింది. వీటి అమలుకు గత బడ్జెట్లో రూ.5,41,850 కోట్లను కేటాయించారు. కానీ, రూ.4,20,078 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. అంటే, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు రూ.1.21 లక్షల కోట్లు కోత పెట్టారన్నమాట. ఇందులో భాగంగా పీఎంఏవో (అర్బన్)కు రూ.19,794 కోట్లను కేటాయించి కేవలం రూ.7,500 కోట్లు ఖర్చు చేశారు. పీఎంఏవో అర్బన్ 2.0 కింద రూ.3500 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. కానీ, కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పీఎం సూర్యఘర్ యోజన కింద 20 వేల కోట్లను ఖర్చు చేస్తామని ప్రకటించి 17 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కిందకు వచ్చే మిగిలిన స్కీములదీ ఇదే పరిస్థితి. దీనికితోడు, వివిధ శాఖలకు గత బడ్జెట్లో చేసిన కేటాయింపులనూ గణనీయంగా తగ్గించాల్సి వచ్చింది. మరో విశేషం ఏమిటంటే.. 2023-24 ఆర్థిక సంవత్సరం వరకూ ఆయా శాఖలకు కేటాయింపుల కంటే ఖర్చు ఎక్కువగా ఉండేది. కానీ, ఆ ఏడాది నుంచి ఏటా కేటాయింపు కంటే ఖర్చు తగ్గిపోతూ రావడం గమనార్హం.
- సెంట్రల్ డెస్క్
రక్షణకు భారీగా ఖర్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రక్షణ శాఖకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. గత బడ్జెట్లో రక్షణ శాఖకు రూ.4,54,773 కోట్లు కేటాయించగా.. సవరించిన అంచనాల్లో దీనిని రూ.5,30,895 కోట్లకు పెంచారు. అంటే, కేటాయించిన మొత్తం కంటే రూ.76,122 కోట్లను ఎక్కువగా ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే చోటు చేసుకున్న ఆపరేషన్ సిందూర్‌తోపాటు దాని పర్యవసానంగా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి తయారీని, కొనుగోళ్లను భారీగా పెంచడమే ఇందుకు కారణం. ఇక, ఎరువుల సబ్సిడీ కూడా ఊహాతీతంగా పెరిగిపోయింది. బడ్జెట్లో ఇందుకు రూ.1,64,000 కోట్లు కేటాయించగా.. చివరికి రూ.2,10,230 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంటే, రూ.46 వేల కోట్లు ఎక్కువగా ఖర్చయింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అలాగే, ఆహార సబ్సిడీకి గత బడ్జెట్లో రూ.2,05,250 కోట్లు కేటాయించారు. కానీ, రూ.2,25,000 కోట్లును ఖర్చు చేశారు. దాదాపు రూ.20 వేల కోట్లు ఈ వ్యయం పెరిగింది. అలాగే, ఆర్థిక సంఘం కింద ఇచ్చే గ్రాంట్లను కూడా రూ.20 వేల కోట్లు ఎక్కువగా చెల్లించాల్సి రావడమూ ఖర్చు పెరగడానికి మరో కారణం. ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద గత బడ్జెట్లో రూ.1,32,767 కోట్లను కేటాయిస్తే.. చివరికి రూ.1,52,953 కోట్లను ఖర్చు చేయాల్సి వచ్చింది.

రోడ్డు రవాణ, హైవేల శాఖకు 3.09లక్షల కోట్లు
2026-27 బడ్జెట్‌లో రోడ్డు రవాణ, హైవేల శాఖకు 3.09లక్షల కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.2.87లక్షల కోట్లతో పోలిస్తే ఇది సుమారు 8శాతం ఎక్కువ. అలాగే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కి గతేడాది రూ.170 లక్షల కోట్లు కేటాయించగా దాన్ని ఈసారి రూ.1.87 లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు.