Share News

అన్ని జేపీసీల నివేదికలను సమర్పించండి

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:03 AM

జమిలి ఎన్నికలతో సహా పార్లమెంట్‌ సంయుక్త కమిటీల(జేపీసీ) పరిశీలనలో ఉన్న అన్ని బిల్లులపై నివేదికలను జూలై 20 నుంచి ప్రారంభమయ్యే..

అన్ని జేపీసీల నివేదికలను సమర్పించండి

  • చైర్మన్‌లకు కేంద్రం సూచన..ఈ సమావేశాల్లోనే డీలిమిటేషన్‌ బిల్లు!

న్యూఢిల్లీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జమిలి ఎన్నికలతో సహా పార్లమెంట్‌ సంయుక్త కమిటీల(జేపీసీ) పరిశీలనలో ఉన్న అన్ని బిల్లులపై నివేదికలను జూలై 20 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లోనే సమర్పించాలని కేంద్రం ఆయా జేపీసీ చైర్మన్లకు సూచించినట్లు తెలిసింది. ఒకే దేశం - ఒకే ఎన్నిక పేరుతో నిర్వహించే జమిలి ఎన్నికల విషయం పరిశీలించేందుకు బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వంలోని 39 మంది సభ్యుల కమిటీ తన నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉన్న యూజీసీ, ఏఐసీటీఈ వంటి సంస్థలన్నిటినీ ఒకే సంస్థ అధీనంలోకి తీసుకువచ్చే వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్టాన్‌కు సంబంధించిన బిల్లుపై ఏర్పర్చిన జేపీసీ నివేదికను చైర్మన్‌ పురంధేశ్వరి ఈ సమావేశాల్లోనే సమర్పించనున్నారు. ఇక తీవ్రమైన ఆరోపణలపై 30 రోజులకు పైగా జైలు శిక్షను అనుభవించిన ప్రధాని, కేంద్రమంత్రులు, సీఎంలు, రాష్ట్ర మంత్రులను తొలగించేందుకు రూపొందించిన మూడు బిల్లులను పరిశీలించేందుకు ఏర్పర్చిన జేపీసీ నివేదికను ఆ కమిటీ చైర్మన్‌, బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి వర్షాకాల సమావేశాల్లోనే సమర్పించనున్నట్లు తెలిసింది. కాగా, ఈ వ ర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లులపై కేంద్రం కసరత్తును పూర్తి చేసింది. అయితే, డీలిమిటేషన్‌ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించనీయబోమని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. ఏదైనా నేరారోపణపై ఒక మంత్రి వరుసగా 30 రోజుల పాటు జైలులో ఉంటే, 31వ రోజున ఆటోమేటిక్‌గా పదవి నుంచి తొలగించేలా ప్రవేశపెట్టనున్న బిల్లును కూడా తప్పుపట్టారు.

Updated Date - Jul 06 , 2026 | 03:03 AM