Share News

Private Participation in Forest Development: అటవీ భూముల్లో ప్రైవేట్‌ వనాలు

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:09 AM

అటవీ భూముల్లో ప్రైవేట్‌ సంస్థలు కూడా వనాలను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు అటవీ భూములను లీజుకు...

 Private Participation in Forest Development: అటవీ భూముల్లో ప్రైవేట్‌ వనాలు

  • అడవుల పెంపకానికి కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 8: అటవీ భూముల్లో ప్రైవేట్‌ సంస్థలు కూడా వనాలను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు అటవీ భూములను లీజుకు తీసుకుని పర్యావరణ పరిహార ఫీజులు చెల్లించే అవసరం లేకుండా అడవులు పెంచడానికి, కలప ప్రాజెక్టులు నిర్వహించడానికి నిబంధనలను సవరించింది. రాష్ట్ర ప్రణాళికల ప్రకారం అనుమతి పొందిన ప్రాంతాల్లో అడవుల పెంపకం, వనాల సంరక్షణ (సిల్వికల్చర్‌) కార్యక్రమాలను ‘అటవీ కార్యకలాపాలు’గానే పరిగణిస్తామని ఈనెల 2న రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. సంబంధిత ప్రైవేట్‌, ప్రభుత్వ సంస్థలతో ఆదాయ భాగస్వామ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు విధివిధానాలు రూపొందించుకునే అవకాశాన్ని కేంద్రం ఇచ్చింది. గతంలో నిబంధనల ప్రకారం అటవీ భూముల్లో ప్రైవేట్‌ సంస్థలు ఔషధ మొక్కలు, తక్కువ సమయంలో పెరిగే చెట్లు పెంచడాన్ని ‘అటవీయేతర కార్యకలాపాలు’గానే పరిగణించేవారు. అయితే అటవీ భూములను ప్రైవేట్‌ పరం చేయడానికే ఈ కొత్త నిబంధనలు అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌ వేదికగా విమర్శించారు. ఆగస్టు 2023 సవరణల ద్వారా అటవీ (సంరక్షణ) చట్టం-1980ను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందంటూ మండిపడ్డారు. విమర్శలపై కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు వివరణ ఇస్తూ.. 33 శాతం ఫారెస్టు కవరేజీ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 04:09 AM