Share News

ఓటర్ల జాబితా నుంచిఅర్హులైన ఏ ఒక్కరినీ తొలగించం!

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:18 AM

అర్హులైనవారి పేర్లను పశ్చిమబెంగాల్‌ ఎన్నికల జాబితా నుంచి తొలగించబోమని ముఖ్య ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

ఓటర్ల జాబితా నుంచిఅర్హులైన ఏ ఒక్కరినీ తొలగించం!

  • అనర్హుల పేరు జాబితాలో ఉండకూడదనేదే లక్ష్యం.. ఇక బెంగాల్‌లో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు

  • సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ స్పష్టీకరణ

కోల్‌కతా, మార్చి 10: అర్హులైనవారి పేర్లను పశ్చిమబెంగాల్‌ ఎన్నికల జాబితా నుంచి తొలగించబోమని ముఖ్య ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. మంగళవారం కోల్‌కతాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఓటరుకూ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని నొక్కి చెప్పారు. ‘ఓటు వేయడానికి అర్హులైన ప్రతి ఒక్కరి పేరూ జాబితాలో ఉండాలి, అలాగే అనర్హుల పేరు జాబితాలో ఉండకూడదు అనేదే లక్ష్యం’ అన్నారు. బెంగాల్‌లో సర్‌ ప్రక్రియపై విమర్శల గురించి మాట్లాడుతూ ‘12 రాష్ట్రాల్లో ఎలా చేశామో.. బెంగాల్‌లోనూ అలాగే చేశాం’ అని చెప్పారు. సర్‌ ప్రక్రియ తర్వాత ఫిబ్రవరి 28న ప్రచురించిన ఓటర్ల జాబితాతోపాటు అనుబంధ ఓటర్ల జాబితాలనూ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నామని తెలిపారు. ‘శాంతిభద్రతలపై రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధత ఆధారంగా బెంగాల్‌లో ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలనేది నిర్ణయిస్తాం’ అన్నారు. రాజకీయ నాయకులు హింసకు, ఓటర్లను, ఎన్నికల అధికారులను బెదిరించడానికి ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదని సీఈసీ తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈసీ సూచనల మేరకు నిక్కచ్చిగా పనిచేయాలన్నారు. నిర్లక్ష్యాన్ని సహించబోమని చెప్పారు. రాజకీయ పార్టీల విమర్శలపై మాట్లాడుతూ.. ‘రాజకీయ పార్టీల వ్యాఖ్యలపై ఈసీ వ్యాఖ్యానించడం తగదు. రాజకీయ ప్రకటనలకు మేం స్పందించం. రాజ్యాంగం ప్రకారమే ఈసీ పనిచేస్తుంది’ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ బూత్‌లలో 100 శాతం వీడియో రికార్డింగ్‌ నిర్వహిస్తామన్నారు. ‘ఎన్నికల దశ.. పశ్చిమబెంగాల్‌కు గర్వకారణం’ అనే ఈసీ నినాదాన్ని సీఈసీ వెల్లడించారు. కాగా, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు కోల్‌కతా పర్యటనలో నిరసన సెగ తగిలింది. మంగళవారం ఉదయం ఆయన దక్షిణేశ్వర్‌ కాళి ఆలయాన్ని సందర్శించినప్పుడు కొందరు నల్ల జెండాలు, ‘గో బ్యాక్‌’ నినాదాలతో ఆందోళన నిర్వహించారు. ఆదివారం రాత్రి ఆయన కోల్‌కతాకు విచ్చేసినప్పుడు విమానాశ్రయంలోనూ అలాంటి నిరసనే ఎదురైంది. సోమవారం కాళిఘాట్‌ ఆలయాన్ని సందర్శించినప్పుడు కూడా అలాంటి నిరసనే ఆయన ఎదుర్కొన్నారు. అయినప్పటికీ షెడ్యూల్‌ ప్రకారం తన కార్యక్రమాలను ఆయన కొనసాగించారు.


ఓటర్ల తొలగింపుపై మమత నిరసన

సర్‌ ప్రక్రియ ద్వారా పశ్చిమబెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి అర్హుల పేర్లను తొలగిస్తున్నారంటూ ఈనెల 6వ తేదీ నుంచి ధర్నాలు నిర్వహిస్తున్న సీఎం మమతా బెనర్జీ.. ఐదోరోజైన మంగళవారం ‘డ్రాయింగ్‌’ ద్వారా తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఆకుపచ్చని బోర్డు పైభాగంలో తెల్లని స్కెచ్‌పెన్‌తో ‘సర్‌’ అని, బోర్డు మధ్య భాగంలో ‘అదృశ్యం(వానిష్‌)’ అని ఆమె రాశారు. దాని కింద వృత్తాలను ఒకదానిపై ఒకటి గీస్తూ.. మొత్తం తెలుపురంగుతో నింపేశారు.

ఆ న్యాయాధికారుల నిర్ణయాలను ప్రశ్నించొద్దు!

పశ్చిమబెంగాల్‌లో సర్‌ ప్రక్రియ అమలు విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది. ఈ ప్రక్రియలో ఓటర్లకు సహకరించేందుకు నియమించిన న్యాయాధికారుల నిర్ణయాలను కనీసం ప్రశ్నించే ధైర్యం కూడా చేయొద్దని స్పష్టం చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్‌ పరిధిలో నియమించిన న్యాయాధికారుల తీరును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బెంగాల్‌ ప్రభుత్వం, ఈసీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితాలో పేర్లు లేని ఓటర్లకు సహాయంగా కోర్టు నియమించిన న్యాయాధికారులు ఇప్పటికే రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని, ఇంకా వాళ్లు ఏం కోల్పోవాలని కోరుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ ధోరణిని తాను సహించబోనని, న్యాయాధికారుల నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘ఈ పిటిషన్‌ను ఎవరు దాఖలు చేశారు? ఇరుపక్షాల విశ్వసనీయతపైనా మాకు సందేహాలు ఉన్నాయి.’’ అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌ ప్రభుత్వం, పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ/న్యాయవాది కల్యాణ్‌ బెనర్జీ వాదనలు వినిపించారు. అలాంటి పిటిషన్‌ దాఖలైన విషయమే తమకు తెలియదని వారిద్దరూ కోర్టుకు తెలిపారు. న్యాయాధికారుల తిరస్కరణకు గురైనవారు అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాలని వారు కోరారు. దీనిపై సానుకూలంగా కోర్టు స్పందించింది. దీనికోసం అప్పీలేట్‌ ట్రైబ్యునల్స్‌ను హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఏర్పాటుచేస్తూ ఆదేశాలు జారీ చేసింది. న్యాయాధికారుల స్థాయిలో న్యాయం జరగలేదని భావించేవారు ట్రైబ్యునల్స్‌ను ఆశ్రయించవచ్చునని తెలిపింది.

Updated Date - Mar 11 , 2026 | 04:18 AM