Share News

ప్రస్తుత పదో తరగతి బ్యాచ్‌కు ‘త్రిభాషా’ విధానం మినహాయింపు

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:28 AM

నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)-2020 కింద త్రిభాషా విధానం అమలుపై సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) సోమవారం...

ప్రస్తుత పదో తరగతి బ్యాచ్‌కు ‘త్రిభాషా’ విధానం మినహాయింపు

9వ తరగతి విద్యార్థులకు ‘వన్‌టైమ్‌’ వెసులుబాటు ఇచ్చిన సీబీఎస్ఈ

న్యూఢిల్లీ, జూన్‌ 29: నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)-2020 కింద త్రిభాషా విధానం అమలుపై సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) సోమవారం కీలక మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం 2026-27లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మూడు భాషలను చదవాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. వారు ప్రస్తుతం అమల్లో ఉన్న ద్విభాషా విధానంలోనే కొనసాగవచ్చు. ఇదే సమయంలో 9వ తరగతి విద్యార్థులకు ఒకసారి మాత్రమే వర్తించే ఓ వెసులుబాటును కూడా సీబీఎస్ఈ కల్పించింది. ప్రస్తుత బ్యాచ్‌ విద్యార్థులు మూడు భాషలను అభ్యసించాల్సి ఉంటుందని, అయితే వారు రెండు విదేశీ భాషలను, ఒక భారతీయ భాషను చదువుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే, ప్రస్తుతం 7 నుంచి 9వ తరగతుల్లో ఉన్న విద్యార్థులు 10వ తరగతికి వెళ్లినప్పుడు మూడో భాషకు బోర్డు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని సీబీఎస్ఈ అకడమిక్స్‌ డైరెక్టర్‌ ప్రజ్ఞా ఎం.సింగ్‌ తెలిపారు. అయితే ప్రస్తుతం 6వ తరగతిలో ఉన్న విద్యార్థులకు ఈ మినహాయింపులు వర్తించవు. వారు త్రిభాషా విధానంలో భాగంగా రెండు భారతీయ భాషలతో సహా మొత్తం మూడు భాషలను అభ్యసించాల్సి ఉంటుంది. వారు పదో తరగతికి చేరుకున్నప్పుడు మూడో భాషకు సంబంధించి బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలను చదవాలని, అందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్ఈ నెల క్రితం ప్రకటించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ కొంత మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ తాజా ప్రకటన చేసింది.

Updated Date - Jun 30 , 2026 | 04:28 AM