Share News

6వ తరగతి నుంచి త్రిభాషా విధానం

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:33 AM

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) కొత్త పాఠ్య ప్రణాళికను ప్రకటించింది

6వ తరగతి నుంచి త్రిభాషా విధానం

  • సీబీఎస్ఈలో ఇక తప్పనిసరి

  • అందులో 2 భారతీయ భాషలు

  • సీబీఎస్ఈ కొత్త పాఠ్య ప్రణాళిక వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) కొత్త పాఠ్య ప్రణాళికను ప్రకటించింది. 6వ తరగతి నుంచి 12 తరగతి వరకు దేశమంతటా ఒకే విధంగా త్రిభాషా విధానాన్ని అమల్లోకి తేనున్నారు. అలాగే 9వ తరగతిలో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులకు సంబంధించి రెండు స్థాయుల విధానాన్ని దశల వారీగా అమలు చేస్తారు. ఇందులో భాగంగా రెండు సబ్జెక్టులలో అదనంగా రెండు పేపర్లు ప్రవేశపెడతారు. అవి ఐచ్చికం. ఐఐటీ స్థాయి పరీక్షలకు సిద్ధం కావాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు వాటిని ఎంచుకోవచ్చు. అందులో వచ్చిన మార్కులు అందరూ తప్పనిసరిగా రాసే మ్యాథ్స్‌, సైన్స్‌ పరీక్షల మార్కులకు(80 మార్కుల పేపర్‌) కలపరు. ఐచ్ఛికంగా రాసే మ్యాథ్స్‌, సైన్సు పేపర్లకు 25 మార్కుల చొప్పున పరీక్ష పెడతారు. అందులో యాభై శాతానికి మించిన మార్కులు సాధిస్తే ప్రత్యేకంగా మార్క్స్‌ షీటులో చూపుతారు. ఇప్పటివరకు దేశంలోని కొన్ని స్కూళ్లలోనే త్రిభాషా విధానాన్ని పాటిస్తున్నారు. ఇకపై 6వ తరగతి నుంచి తప్పనిసరిగా మూడు భాషలు చదవాల్సి ఉంటుంది. ఇందులో రెండు భారతీయ భాషలై ఉండాలి. ఆర్‌1, ఆర్‌2, ఆర్‌3లుగా ఈ భాషలను పేర్కొంటూ క్రమపద్ధతిలో వీటిని నేర్పిస్తారు. అయితే విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇందులో కొంత వెసులుబాటు ఉంటుంది. ఇక 9, 10 తరగతుల్లో ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ సబ్జెక్టులు తప్పనిసరిగా ఉంటాయి.

Updated Date - Apr 04 , 2026 | 04:33 AM