Share News

సీబీఎస్ఈ ‘త్రిభాషా’ విధానంపై సుప్రీంలో పిల్‌

ABN , Publish Date - May 23 , 2026 | 04:13 AM

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9,10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ సీబీఎ్‌సఈ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో...

సీబీఎస్ఈ ‘త్రిభాషా’ విధానంపై సుప్రీంలో పిల్‌

  • వచ్చే వారం విచారిస్తామన్న సీజేఐ ధర్మాసనం

న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9,10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ సీబీఎ్‌సఈ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు(పిల్‌) దాఖలయ్యాయి. ఢిల్లీ, గురుగ్రామ్‌, నోయిడా, చెన్నైలకు చెందిన 19మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బృందం వీటిని దాఖలు చేసింది. సీబీఎస్ఈ ఉత్తర్వును కొట్టివేయాలని, పాత నిర్ణయాన్నే 2029-30 వరకు కొనసాగించాలని కోరింది. పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని బృందం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనాన్ని శుక్రవారం కోరారు. ‘‘మూడు భాషల విధానంతో 10వ తరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక్కసారిగా 9వ తరగతిలో కొత్త భాషను నేర్చుకుని, 10వ తరగతిలో ఎలా పరీక్షలు రాయగలరు? ఇది తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది’’ అని రోహత్గీ కోర్టుకు విన్నవించారు. సరైన మౌలిక సదుపాయాలు, బోధనా సామగ్రి లేకుండా మధ్యలో ఇలాంటి విధానాన్ని రుద్దడం విద్యా వ్యవస్థలో గందరగోళానికి దారితీస్తుందన్నారు. దాంతో, మీ వాదనలను నమోదు చేసుకున్నామని, పిటిషన్‌ను వచ్చే వారం విచారణ జాబితాలో చేరుస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. నిజానికి, మూడు భాషల విధానం 9వ తరగతి విద్యార్థులకు 2029-30 విద్యా సంవత్సరం వరకు వర్తించదని 9 ఏప్రిల్‌ 2026న సీబీఎ్‌సఈ స్పష్టత ఇచ్చింది. తాజా నిర్ణయం దానికి పూర్తి భిన్నంగా ఉంది.

Updated Date - May 23 , 2026 | 04:13 AM