Share News

మార్కుల పరిశీలనకు 1.6లక్షల మంది దరఖాస్తు: సీబీఎస్‌ఈ

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:01 AM

వార్షిక పరీక్షలు రాసిన 12వ తరగతి విద్యార్థుల మార్కుల వెరిఫికేషన్‌, రీ-వాల్యుయేషన్‌ల నిమిత్తం సకాలంలో సేవలు అందించామని సోమవారం సీబీఎస్ఈ తెలిపింది.

మార్కుల పరిశీలనకు 1.6లక్షల మంది దరఖాస్తు: సీబీఎస్‌ఈ

న్యూఢిల్లీ, జూన్‌ 8: వార్షిక పరీక్షలు రాసిన 12వ తరగతి విద్యార్థుల మార్కుల వెరిఫికేషన్‌, రీ-వాల్యుయేషన్‌ల నిమిత్తం సకాలంలో సేవలు అందించామని సోమవారం సీబీఎస్ఈ తెలిపింది. ఇందుకోసం ఉద్దేశించిన పోస్ట్‌ రిజల్ట్‌ సర్వీసెస్‌ పోర్టల్‌లో 1.6లక్షల మందికిపైగా విద్యార్థులు వివిధ సమస్యల నిమిత్తం దరఖాస్తు చేశారని పేర్కొంది. 3.8 లక్షల జవాబు పత్రాల విషయమై ఈ దరఖాస్తులు చేశారని తెలిపింది. ఈ నెల 2-7 తేదీల మధ్య ఈ పోర్టల్‌ పనిచేసిందని వివరించింది. సమస్యలు పరిష్కరించేందుకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.

ఫలితాలు వెల్లడించాలని సౌదీ విద్యార్థి దావా

12వ తరగతి ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల ఫలితాలను వెల్లడించేలా సీబీఎస్ఈని ఆదేశించాలని కోరుతూ సౌదీ అరేబియాకు చెందిన ప్రాన్షు జింగార్‌ కుమార్‌ పటేల్‌ సుప్రీంకోర్టులో దావా వేశారు. ఇరాన్‌ యుద్ధం కారణంగా ఏడు పశ్చిమాసియా దేశాల్లోని పాఠశాలల్లో 12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా అసెస్మెంట్‌ స్కీం కింద ఇంటర్నల్‌ పరీక్షల్లో వచ్చిన ఆధారంగా మార్కులు ఇస్తామని ప్రకటించింది. ఇది కేవలం రెగ్యులర్‌గా చదివిన విద్యార్థులకే వర్తింప జేసింది. పటేల్‌ ప్రయివేటు విద్యార్థి కావడంతో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఇంగ్లీషు, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాశాడు. ఫలితాలు వెల్లడించాలని కోరుతూ మే నెల 17, 21, 30 తేదీల్లో సీబీఎస్ఈకి వినతులు పంపించాడు. అయినా సమాధానం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇది విద్యార్థి కెరీర్‌కు సంబంధించిన విషయమని, రాత్రింబవళ్లు కష్టపడైనా ఫలితాలను వెల్లడించాలని సూచించింది. దీనిపై సమాచారం ఇవ్వాలని సీబీఎస్ఈ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

Updated Date - Jun 09 , 2026 | 04:01 AM