Share News

కోయెంప్ట్‌ కోసం నిబంధనలన్నీ తూచ్‌..!

ABN , Publish Date - May 31 , 2026 | 04:58 AM

సీబీఎస్ఈ ఆన్‌-స్ర్కీన్‌ మార్కింగ్‌ (ఓఎస్ఎం) వ్యవస్థపై తీవ్ర వివాదం నెలకొన్న వేళ.. ఆ వ్యవస్థను నిర్వహించేందుకు కోయెంప్ట్‌ ఎడ్యుటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను...

కోయెంప్ట్‌ కోసం నిబంధనలన్నీ తూచ్‌..!

  • సీబీఎస్ఈ ఓఎస్ఎం టెండర్లలో అవకతవకలు

  • తెలంగాణలో నిషేధం ఎదుర్కొన్న గ్లోబరీనాయే ఈ కోయెంప్ట్‌

  • 12వ తరగతి విద్యార్థి సార్థక్‌ సిద్ధాంత్‌ సంచనల ఆరోపణలు

  • వందలకొద్దీ టెండర్‌ పత్రాలు విశ్లేషించి అక్రమాలు వెలికితీత

న్యూఢిల్లీ, మే 30: సీబీఎస్ఈ ఆన్‌-స్ర్కీన్‌ మార్కింగ్‌ (ఓఎస్ఎం) వ్యవస్థపై తీవ్ర వివాదం నెలకొన్న వేళ.. ఆ వ్యవస్థను నిర్వహించేందుకు కోయెంప్ట్‌ ఎడ్యుటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను ఎంపిక చేయటంలో కూడా అక్రమాలు జరిగాయని ఒక విద్యార్థి సంచలన ఆరోపణలు చేశాడు. ఈ సంస్థకు కాంట్రాక్టు దక్కేలా టెండర్‌ నిబంధనల్లో మార్పులు చేశారని 12వ తరగతి విద్యార్థి సార్థక్‌ సిద్ధాంత్‌ ఆరోపించాడు. అందుకు ఆధారాలను కూడా చూపించాడు. వందలకొద్ది సీబీఎస్ఈ టెండర్‌ డాక్యుమెంట్లను విశ్లేషించి ఈ విషయాన్ని అతడు బయటపెట్టాడు. సార్థక్‌ ప్రకారం ఓఎస్ఎం కోసం గత ఏడాది సీబీఎ్‌సఈ మూడుసార్లు టెండర్లు పిలిచింది. మొదటి టెండర్‌ 2025 ఫిబ్రవరిలో పిలిచారు. దానిని రద్దు చేసి మేలో రెండోసారి పిలిచారు. ఈ దశలో టీసీఎస్‌, కోయెం్‌ప్టతోపాటు మరో రెండు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. సాంకేతిక బిడ్ల సమయంలో ఈ నాలుగు సంస్థలను అనర్హులుగా ప్రకటించారు. 2025 ఆగస్టులో ముచ్చటగా మూడోసారి టెండర్లు పిలిచారు. అయితే, రెండో టెండర్‌కు మూడో టెండర్‌కు మధ్యలో నిబంధనలు మారిపోయాయి.

మారిన నిబంధనలివీ...

టెండర్‌ వేసే సంస్థ గతంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉండాలనే నిబంధన తొలగించారు. అత్యంత ముఖ్యంగా గతంలో సదరు సంస్థ బ్లాక్‌లిస్టులో ఉండి ఉండరాదు అనే నిబంధనను ‘ప్రస్తుతం బ్లాక్‌ లిస్టులో ఉండరాదు’ అని మార్చారు. కోయెంప్ట్‌ సంస్థ పూర్వనామం ‘గ్లోబరీనా టెక్నాలజీస్‌’. 2019లో తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాల వెల్లడి వివాదానికి కారణమైన సంస్థ ఇదేనని ఆరోపణలు వచ్చాయి. నాడు ఈ సంస్థను రాష్ట్రంలో బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఆ తర్వాత అది కోయెంప్ట్‌ ఎడ్యుటెక్‌ అని పేరు మార్చుకుంది. కాగా, సార్థక్‌ ఆరోపణలను సీబీఎస్ఈ తోసిపుచ్చింది. కోయెంప్ట్‌ సంస్థ గతంలో ఎన్నడూ అనర్హత ఎదుర్కోలేదని పేర్కొంది. మరోవైపు 12వ తరగతి పరీక్ష పేపర్ల నిజమైన మూల్యాంకనానికి ముందు ఢిల్లీలోని ఐదు పాఠశాలల్లో గత జనవరిలో నిర్వహించిన డ్రైరన్‌ (డమ్మీ మూల్యాంకనం)లో 36 సాంకేతిక, నిర్వహణ, మూల్యాంకన సంబంధిత సమస్యలను గుర్తించినట్లు సీబీఎస్ఈ అంతర్గత నివేదికలో ఉంద ని హిందుస్థాన్‌ టైమ్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల జవాబు పత్రాలను డిజీలాకర్‌లో అందుబాటులో ఉంచుతామని సీబీఎస్ఈ ప్రకటించింది.

Updated Date - May 31 , 2026 | 04:58 AM