త్రిభాష తప్పనిసరి!
ABN , Publish Date - May 17 , 2026 | 04:58 AM
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పాఠశాలలు, అనుబంధ స్కూళ్లలో చదివే 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానం తప్పనిసరికానుంది.
9, 10 తరగతుల విద్యార్థులకు జూలై నుంచే అమలు: సీబీఎస్ఈ
న్యూఢిల్లీ, మే 16: దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పాఠశాలలు, అనుబంధ స్కూళ్లలో చదివే 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానం తప్పనిసరికానుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలకు సంబంధించిన సబ్జెక్టులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయ విద్యా విధానం-2020ని అనుసరించి సీబీఎస్ఈ బోర్డు కీలక మార్పులు చేసింది. 2026-27 విద్యాసంవత్సరంలో 9, 10 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ సిలబ్‌సను సమీక్షించిన తర్వాత బోర్డు త్రిభాషా విధానంపై నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వివరించింది. దీని ప్రకారం.. ఆర్-1, ఆర్-2, ఆర్-3గా పేర్కొనే మూడు భాషలను 9, 10 తరగతుల విద్యార్థులు జూలై 1 నుంచి తప్పనిసరిగా చదవాలి. ఈ మూడు భాషల్లో రెండు కచ్చితంగా స్థానిక భారతీయ భాషలు ఉండాలి. మూడో భాషగా విద్యార్థులు తమ అభిరుచి మేరకు విదేశీ భాషను ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ మూడూ భారతీయ భాషలే ఎంచుకుంటే.. అదనంగా మరో విదేశీ భాషను ఎంపిక చేసుకోవచ్చని సీబీఎస్ఈ పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ఏప్రిల్‌లోనే ప్రారంభమైనప్పటికీ త్రిభాషా విధానం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆర్-3 పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చే వరకు 9వ తరగతి విద్యార్థులు ఆరో తరగతికి చెందిన ఆర్-3 టెస్టు పుస్తకాలనే అధ్యయనం చేయాల్సి ఉంటుందని, జూలై 1 నాటికి పూర్తిస్థాయిలో పుస్తకాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. ఇవీ.. 3 భాషలు
ఆర్-1: చిన్నారుల మాతృభాష(ఉదాహరణ.. తెలుగు), ఆర్-2: మాతృభాష కాని భారతీయ భాషల్లో ఏదైనా(హిందీ, తమిళం, మలయాళం) ఆర్-3: ఆర్-1, ఆర్-2లలో లేని భాష ఏదైనా/విదేశీ భాష(ఇంగ్లిష్)