Share News

రీవాల్యూయేషన్‌ కూడా ‘కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌’ సంస్థతోనే

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:07 AM

రీవాల్యూయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాల స్కానింగ్‌ కోసం ‘కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌’ సంస్థనే కొనసాగించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది.

రీవాల్యూయేషన్‌ కూడా ‘కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌’ సంస్థతోనే

  • సీబీఎస్ఈ వివాదాస్పద నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్‌ 6: రీవాల్యూయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాల స్కానింగ్‌ కోసం ‘కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌’ సంస్థనే కొనసాగించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ఈ విషయాన్ని సీబీఎస్ఈ పోర్టల్‌లో సెక్యూరిటీ సమస్యలపై ఆడిట్‌ నిర్వహిస్తున్న ఓ ఐఐటీకి చెందిన అధికారి వెల్లడించారు. ఎంతో వివాదాస్పదమైన ఆ సంస్థనే కొనసాగించడాన్ని ఆయన సమర్థించారు కూడా. ‘‘ఆన్‌ స్ర్కీన్‌ మార్కింగ్‌(ఓఎస్ఎం)లో భాగంగా దాదాపు 40కోట్ల పేజీలను స్కాన్‌ చేశారు. అందులో కేవలం 30వేల పేజీలతో మాత్రమే సమస్య వచ్చింది. అంటే ప్రతి 10వేల పేజీల్లో కేవలం ఒక్క పేజీనే సరిగ్గా స్కాన్‌ కాలేదన్నమాట. రీవాల్యూయేషన్‌లో ఆ పేజీలను మాత్రమే స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నాం’’ అని ఆ అధికారి అన్నారు. సీబీఎ్‌సఈ 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాలను ఓఎస్ఎంలో భాగంగా కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌ సంస్థనే స్కానింగ్‌ చేసింది. అయితే, ఈ సంస్థ నిబంధనలను ఉల్లంఘించి ఫోన్లతో ఫొటోలు తీసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే, సీబీఎస్ఈ రీవాల్యూయేషన్‌ కోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 4వరకు ఈ పోర్టల్‌లో.. రీవాల్యూయేషన్‌ కోసం 63,119 మంది, మార్కుల రీవెరిఫికేషన్‌ కోసం 7,314మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, రీవాల్యూయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌దాడుల యత్నాల నేపథ్యంలో నిర్వహించిన భద్రతాపరమైన సమీక్ష అనంతరం సీబీఎస్ఈ కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఓఎస్ఎం డేటా మొత్తాన్ని కోఎంప్ట్‌ సర్వర్ల నుంచి తన సొంత సర్వర్లలోకి బదిలీ చేసుకుంది. ఈ సైబర్‌ దాడుల యత్నాలు, భద్రతాపరమైన చర్యల బలోపేతంపై ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ మద్రాస్‌ నిపుణులు పనిచేస్తున్నారు.

Updated Date - Jun 07 , 2026 | 06:07 AM