అవును..జవాబు పత్రాలు మారాయి
ABN , Publish Date - May 27 , 2026 | 04:02 AM
సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వాల్యుయేషన్ ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. బోర్డు అధికారికంగా అప్‌లోడ్ చేసిన జవాబు పత్రాల స్కాన్ కాపీలు తమవి కావని...
తప్పు ఒప్పుకున్న సీబీఎస్ఈ బోర్డు
అంతకుముందు తన పేపర్లు ఇవి కావంటూ ఎక్స్‌లో పోస్టు చేసిన విద్యార్థిపై భారీ ట్రోలింగ్
న్యూఢిల్లీ, మే 26: సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వాల్యుయేషన్ ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. బోర్డు అధికారికంగా అప్‌లోడ్ చేసిన జవాబు పత్రాల స్కాన్ కాపీలు తమవి కావని, అందులోని చేతిరాతలు వేరే వాళ్లవని కొందరు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. పరీక్షల మూల్యాంకనంలో ప్రవేశపెట్టిన ‘ఆన్‌స్ర్కీన్ మార్కింగ్’ (ఓఎస్ఎమ్) విధానంలో జరిగిన సాంకేతిక లోపాల వల్లే విద్యార్థుల పేర్లు పరస్పరం తారుమారయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన సీబీఎస్ఈ బోర్డు, పేపర్లు తారుమారవడం వాస్తవమేనని అంగీకరిస్తూ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. ఢిల్లీకి చెందిన వేదాంత్ అనే 12వ తరగతి విద్యార్థి తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిజిక్స్‌లో ఆశించిన దానికంటే తక్కువ మార్కులు రావడంతో, వేదాంత్ రీ-వాల్యుయేషన్ ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే బోర్డు ఇచ్చిన కాపీ తనది కాదని ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఈ సమస్యను వెలుగులోకి తెచ్చేందుకు వేదాంత్ కుటుంబం కొత్తగా ఎక్స్ ఖాతా తెరవగా, దాని లొకేషన్ ‘సౌత్ ఏషియా’ అని చూపించింది. దీంతో కొందరు నెటిజన్లతో పాటు దూరదర్శన్ యాంకర్ అశోక్ శ్రీవాస్తవ్.. వేదాంత్‌ను ట్రోల్ చేశారు. దేశద్రోహిగా, పాకిస్థానీగా అభివర్ణించారు. అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో యాంకర్ అశోక్ వేదాంత్ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. సీబీఎస్ఈ బోర్డు, వేదాంత్ ఈమెయిల్‌కు రిప్లై ఇచ్చింది. అతడి అసలు పేపర్‌ను వెతికి ఈమెయిల్‌కు పంపింది. సంజన అనే మరో విద్యార్థిని కూడా తన రసాయన శాస్త్రం జవాబు పత్రం విషయంలో ఇలాంటి ఆరోపణలే చేసింది. మరికొందరు విద్యార్థులు కూడా తమ పేర్లు మసకగా స్కాన్ అవ్వడం, పేజీలు మిస్ అవ్వడంపై ఫిర్యాదులు చేస్తున్నారు.