అస్పష్టంగా జవాబు పత్రాల స్కానింగ్!
ABN , Publish Date - May 22 , 2026 | 03:44 AM
సీబీఎస్ఈ 12వ తరగతి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన ‘ఆన్ స్ర్కీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)’ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మేం రాసింది మాకే కనిపించడంలేదు
సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల ఆందోళన
న్యూఢిల్లీ, మే 21: సీబీఎస్ఈ 12వ తరగతి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన ‘ఆన్ స్ర్కీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)’ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విడుదలైన 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని భావించిన విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దరఖాస్తు చేసుకునే సమయంలోనే వెబ్‌సైట్‌లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు. కొందరు విద్యార్థులు అస్పష్టంగా ఉన్న ‘స్కాన్ చేసిన జవాబు పత్రాల’ స్ర్కీన్‌షాట్లను షేర్ చేశారు. ఇంత అస్పష్టంగా ఉన్న జవాబు పత్రాలను ఎలా మూల్యాంకనం చేశారని ప్రశ్నించారు. ‘స్కాన్ చేసిన కాపీల్లో విద్యార్థులు తమ చేతిరాతను తామే చదవలేకపోతున్నారు’ అని ఓ నెటిజన్ ఆరోపించారు. మూల్యాంకన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, స్కాన్ చేసిన జవాబు పత్రాల కాపీలను పొందేందుకు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పోర్టల్ సజావుగా పనిచేస్తోందని, దరఖాస్తులు కూడా విజయవంతంగా అప్‌లోడ్ అవుతున్నాయని సీబీఎస్ఈ బుధవారం అర్ధరాత్రి తెలిపింది. ఓఎస్ఎం విధానంలో జవాబు పత్రాల స్కానింగ్ సరిగ్గా జరగలేదన్న ఆరోపణలను తిరస్కరించింది. పోర్టల్ తెరిచిన మూడు గంటల్లోనే (బుధవారం సాయంత్రం 7:30 గంటలకు) 3,87,399 స్కాన్ చేసిన జవాబు పత్రాల కోసం 1,27,146 దరఖాస్తులు వచ్చాయని బోర్డు వెల్లడించింది. విద్యార్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే, అప్‌డేట్ జరిగిన వెంటనే, పలువురు విద్యార్థులు.. చెల్లింపులు విఫలమవడం, పోర్టల్‌లోకి వెళ్లలేకపోవడం, ఓఎ్‌సఎం విధానానికి సంబంధించిన సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.