గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో తప్పినా.. ఇబ్బంది లేదు: సీబీఎస్ఈ
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:56 AM
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి విద్యార్థులకు తీపికబురు చెప్పింది. 10వ తరగతి చదువుతున్న వారు.. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతా మార్కులు సంపాయించుకోలేక..
వాటి స్థానంలో వృత్తివిద్యా పాఠ్యాంశం
10వ తరగతి విద్యార్థులకు వర్తింపు
న్యూఢిల్లీ, అక్టోబరు 30: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి విద్యార్థులకు తీపికబురు చెప్పింది. 10వ తరగతి చదువుతున్న వారు.. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతా మార్కులు సంపాయించుకోలేక ఆయా పరీక్షల్లో తప్పినప్పటికీ.. ఇబ్బంది లేదని పేర్కొంది. వాటి స్థానంలో 22 నైపుణ్యాభివృద్ధి సబ్జెక్టుల్లో నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ మేరకు నూతన నిబంధనలు తీసుకువచ్చినట్టు సీబీఎస్ఈ వివరించింది. ఈ విధానం 2028 పరీక్షలకు వర్తించనుందని పేర్కొంది. పదోతరగతి విద్యార్థులు కచ్చితంగా 5 సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. వాటిలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అలానే ఆప్షనల్‌గా వృత్తినైపుణ్య కోర్సును సబ్జెక్టుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ గణితం, సైన్స్, సోషల్ సైన్స్ పరీక్షల్లో తప్పితే.. వృత్తినైపుణ్య సబ్జెక్టును ప్రత్యామ్నాయంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 9వ తరగతి చదువుతూ.. వచ్చే 2027-28లో పదిలోకి ప్రవేశించే వారికి ఈ నిబంధన వర్తించనుందని అధికారులు విడుదల చేసిన సర్క్యులర్‌లో వివరించారు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న వారికి ఈ నిబంధన వర్తించదని తెలిపారు. ఇదిలావుంటే, 9వ తరగతి పాఠ్యాంశాల్లో సవరణ చేశారు. వృత్తి విద్యను తప్పనిసరిగా కొనసాగించనున్నారు.
అలాగే కొన్ని పాఠ్యాంశాలను తొలగించారు. ప్రస్తుతం(2026-27) 9వ తరగతి చదువుతున్న వారికి ఈ సవరణలు వెంటనే అమల్లోకి వస్తాయని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. సమాజంలోని వ్యక్తులు, కంప్యుటేషనల్ థింకింగ్(సీటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటివి పాఠ్యాంశాల్లో ఉండబోవని పేర్కొన్నారు. ప్రస్తుతం 9వ తరగతి చదవుతున్న విద్యార్థులు 10వ తరగతికి చేరుకున్నప్పుడు వారికి ‘పర్యావరణ విద్య’ పాఠ్యాంశం ఉండదని తెలిపారు. ఇక, వృత్తివిద్య పాఠ్యాంశం ప్రస్తుత 9వ తరగతిలో కొనసాగడంతోపాటు 10వ తరగతిలో తప్పనిసరి పాఠ్యాంశంగా ఉంటుందని వివరించారు. ఈ క్రమంలో ‘కౌశల్ వికాశ్’(నైపుణ్యాభివృద్ధి)లోని 22 నైపుణ్య పాఠ్యాంశాలలో విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఈ మార్పులు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు వివరించారు.