ప్రిన్సిపాళ్లతో రీల్స్
ABN , Publish Date - May 30 , 2026 | 03:26 AM
దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారిన ‘ఆన్-స్ర్కీన్ మార్కింగ్’ (ఓఎస్‌ఎం) మూల్యాంకన వ్యవస్థకు మద్దతుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ...
ఓఎస్‌ఎంకు మద్దతుగా సీబీఎస్‌ఈ ప్రచారం
మెటీరియల్ ఫర్ ప్రిన్సిపాల్స్ పేరుతో కిట్ల పంపిణీ
న్యూఢిల్లీ, మే 29: దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారిన ‘ఆన్-స్ర్కీన్ మార్కింగ్’ (ఓఎస్‌ఎం) మూల్యాంకన వ్యవస్థకు మద్దతుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తన అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాళ్లను రంగంలోకి దింపింది. ఈ వ్యవస్థ వల్ల జరిగిన తప్పిదాలతో విద్యార్థుల జీవితాలు గందరగోళంలో పడ్డాయని ముప్పేట విమర్శలు వినిపిస్తున్నప్పటికీ.. అందులో ఏ తప్పూ లేదని సోషల్ మీడియాలో రీల్స్ చేయాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. ఓఎస్‌ఎం పొరపాట్లపై సాక్షాత్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పినప్పటికీ సీబీఎస్‌ఈ మాత్రం వెనక్కు తగ్గటంలేదు. ‘మెటీరియల్ ఫర్ ప్రిన్సిపాల్స్’ పేరుతో సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాళ్లలకు సోషల్‌మీడియా కిట్లు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఈ కిట్ల సాయంతో సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఓఎస్‌ఎం వ్యవస్థ బాగానే ఉందని ప్రచారం చేయాలని సూచించింది. వీడియోలో ప్రిన్సిపాళ్లు ఏం మాట్లాడాలనే స్ర్కిప్టును కూడా పంపిణీ చేసినట్లు సమాచారం. సీబీఎస్‌ఈ ఆదేశాలతో పలు ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలల ప్రిన్సిపాళ్లు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు.
జూన్ 1 నుంచి రీవాల్యుయేషన్ పోర్టల్
మార్కులు తక్కువ వచ్చాయని భావిస్తున్న 12వ తరగతి విద్యార్థులు తమ జవాబు పత్రాల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు జూన్ 1 నుంచి ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి వస్తుందని సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఈ పోర్టల్‌ను ఇప్పటికే అందుబాటులోకి తేవాల్సి ఉన్నా.. దరఖాస్తు ప్రక్రియలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేందుకే సమయం తీసుకున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులకు ఏవెనా సందేహాలు వస్తే టెలీ కౌన్సెలింగ్ హెల్ప్‌లైన్ నంబర్ 1800118004ను సంప్రదించాలని కోరింది.