Share News

ఓఎస్ఎంలో లోపాలు నిజమే..!

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:19 AM

ఆన్‌-స్ర్కీన్‌ మార్కింగ్‌ (ఓఎస్ఎం) వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) ఎట్టకేలకు అంగీకరించింది...

ఓఎస్ఎంలో లోపాలు నిజమే..!

ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న సీబీఎస్ఈ.. భద్రతా లోపాలను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడి

లోపాలు బయటపెట్టిన ఎథికల్‌ హ్యాకర్స్‌కు కృతజ్ఞతలు

ఇంకా ఎవరైనా లోపాలు గుర్తిస్తే తమతో పంచుకోవాలని పిలుపు

న్యూఢిల్లీ, మే 31: ఆన్‌-స్ర్కీన్‌ మార్కింగ్‌ (ఓఎస్ఎం) వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) ఎట్టకేలకు అంగీకరించింది. విద్యార్థుల జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లోనే మూల్యాంకనం చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలో భద్రతా లోపాలు ఉన్న మాట వాస్తవమేనని పేర్కొంది. ఈ భద్రతా లోపాలను బయటపెట్టిన ఎథికల్‌ హ్యాకర్స్‌కు ఆదివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపింది. ఓఎస్ఎంలో ఇంకా ఎవరైనా లోపాలు గుర్తిస్తే తమ దృష్టికి తేవాలని కోరింది. ఓఎస్ఎం వ్యవస్థలో విద్యార్థుల జవాబు పత్రాలను నిల్వచేసే అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ (ఏడబ్ల్యూఎస్‌) బకెట్‌లో భద్రతా లోపాలు ఉన్నాయని 19 ఏళ్ల ఎథికల్‌ హ్యాకర్‌ నిసర్గ అధికారి బయటపెట్టిన విషయం తెలిసిందే. ఓఎస్ఎం పోర్టల్‌ను అతడు హ్యాక్‌ చేశాడు. ఏడబ్ల్యూఎస్‌ బకెట్‌లోని జవాబు పత్రాలను ఎవరైనా ఆన్‌లైన్‌లో పొందే అవకాశం ఉందని అతడు ఆధారాలతో సహా నిరూపించాడు. మరోవైపు ఓఎస్ఎం వ్యవస్థ నిర్వహణకు కోయెంప్ట్‌ ఎడ్యుటెక్‌ సంస్థను ఎంపిక చేయటంలోనే అక్రమాలు జరిగాయని 12వ తరగతి విద్యార్థి సార్థక్‌ సిద్ధాంత్‌ సంచలన ఆరోపణలు చేశాడు. ఓఎస్ఎంలో తన రూల్‌ నంబర్‌తో ఉన్నవి తాను రాసిన జవాబు పత్రాలు కావని వేదాంత్‌ అనే విద్యార్థి సోషల్‌ మీడియాలో ఓ సందేశం పోస్ట్‌ చేయటంతో ఈ వివాదం మొదట బయటకు వచ్చింది. అనంతరం చాలామంది విద్యార్థులు ఇదేరకమైన ఫిర్యాదులు చేశారు. ఈ ఆరోపణలను సీబీఎస్ఈ మొదట తోసిపుచ్చింది. ఓఎస్ఎంలో ఎలాంటి లోపాలు లేవని వాదించింది. బోర్డు అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాళ్లతో ఓఎస్ఎంకు అనుకూలంగా రీల్స్‌ కూడా చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, పలు ఐఐటీల నిపుణులతో ఓఎస్ఎం వ్యవస్థను అధ్యయనం చేయించగా లోపాలు నిజమేనని తేలినట్లు సమాచారం. దీంతో సీబీఎస్ఈ బహిరంగంగా లోపాలను అంగీకరిస్తూ ప్రకటన చేసింది. పోర్టల్‌ను నిపుణల సాయంతో బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించింది.


తప్పులను ప్రశ్నిస్తే పాకిస్థానీలా?: రాహుల్‌

విద్యా వ్యవస్థలో లోపాలను ప్రశ్నించిన విద్యార్థులను పాకిస్థానీలు, విదేశీ ఏజెంట్లు అని ప్రభుత్వం ముద్ర వేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓఎస్ఎంలో లోపాలను ఎత్తిచూపిన వేదాంత్‌ సహా పలువురు 12వ తరగతి విద్యార్థులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ‘నా తోటి దేశవ్యతిరేక సోరోస్‌ ఏజెంట్లతో మాట్లాడాను’ అని ఎక్స్‌లో ఆయన వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. సీబీఎస్ఈ తప్పులను వేదాంత్‌ అతడి స్నేహితులు ధైర్యంగా ప్రశ్నించారని ప్రశంసించారు. నీట్‌ పేపర్‌ లీక్‌, ఓఎస్ఎం లోపాలతో మోదీ సర్కారు విద్యార్థుల జీవితాలను నాశనం చేసిందని ఆరోపించారు. ప్రధాని మోదీకి మన్‌ కీ బాత్‌లో మామిడిపళ్ల గురించి మాట్లాడేంత సమయం ఉంది కానీ.. 18.5 లక్షల మంది విద్యార్థుల సమస్యలపై మాట్లాడే సమయం లేకపోయిందని మండిపడ్డారు. విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి విద్యార్థులు బలయ్యారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆదివారం ఎక్స్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

Updated Date - Jun 01 , 2026 | 05:39 AM