Share News

ఆ తీర్పు చట్టవిరుద్ధం!

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:58 AM

ఢిల్లీ మద్యం కేసులో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ.. ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసింది. 974 పేజీలతో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఆ తీర్పు చట్టవిరుద్ధం!

  • ఢిల్లీ మద్యం కేసులో ట్రయల్‌ కోర్టు తీర్పు అహేతుకం

  • సీబీఐ అధికారిపై చర్యలకు ఆదేశించడం దిగ్ర్భాంతికరం

  • కుట్ర కోణాన్ని ట్రయల్‌ కోర్టు విస్మరించింది: సీబీఐ

  • తీర్పుపై హైకోర్టులో సవాల్‌ చేసిన దర్యాప్తు సంస్థ

  • 974 పేజీలతో రివిజన్‌ పిటిషన్‌.. 9న విచారణ

న్యూఢిల్లీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసులో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ.. ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసింది. 974 పేజీలతో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ట్రయల్‌ కోర్టు తీర్పు అత్యంత విస్తుగొలిపేలా ఉందని, అది చట్టపరమైన తప్పిదాలతో కూడుకున్నదని పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది. ‘‘చట్టవిరుద్ధం, అహేతుకం, ప్రాథమికంగానే లోపభూయిష్టం’’ అంటూ తీవ్రంగా స్పందించింది. 2021-2022 ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సహా 23 మందిని నిందితులుగా చేర్చారు. సుధీర్ఘకాలం వీరిని తిహాడ్‌ జైలులో ఉంచారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పునిచ్చింది. అందరూ నిర్దోషులేనని తీర్పునిస్తూ జడ్జి జితేంద్రసింగ్‌.. సీబీఐ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థ ఏ దశలోనూ తన విధిని సరిగా నిర్వర్తించలేదని, దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తన తీర్పులో పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుపై సీబీఐ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తీర్పునిచ్చే సమయంలో అసలు కుట్ర కోణాన్ని ట్రయల్‌ కోర్టు విస్మరించిందని పేర్కొంది. ‘‘ప్రాసిక్యూషన్‌ సమర్పించిన బలమైన సాక్ష్యాధారాలను ట్రయల్‌ కోర్టు పక్కనబెట్టింది. ప్రధానంగా.. కేజ్రీవాల్‌, సిసోడియా, కవిత పాత్రను అంచనా వేయడంలో కోర్టు పొరబడింది. మద్యం సిండికేట్ల కోసం పాలసీని ఎలా మార్చారో వివరించే సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే, తీర్పునిచ్చే సందర్భంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థ నిబద్ధతపై ప్రభావం చూపే ప్రమాదముంది’’ అని సీబీఐ పేర్కొంది.


విడి విడి అంశాలుగా చూసినందునే..

నిందితులు నిర్దోషులంటూ తీర్పు వెలువరించే సమయంలో ట్రయల్‌ కోర్టు జడ్జి చేసిన మౌఖిక వ్యాఖ్యలను కూడా సీబీఐ తన పిటిషన్‌లో ప్రస్తావించింది. 4నెలలుగా తాను కేవలం ఈ కేసు ఫైళ్లను చదవడానికే వెచ్చించానని జడ్జి పేర్కొన్నారని, దీనిని బట్టి ఆయన సాక్ష్యాధారాలను అత్యంత లోతుగా విశ్లేషించినట్లు అర్థమవుతోందని తెలిపింది. అయితే, కేసులో అభియోగాలు ఖరారు చేసే ప్రాథమిక దశలో సాక్ష్యాధారాలను అంత సుదీర్ఘంగా, లోతుగా విశ్లేషించడానికి చట్టరీత్యా అనుమతి లేదని గుర్తుచేసింది. కేజ్రీవాల్‌, సిసోడియా, కవిత పాత్రను విశ్లేషించడంలో ట్రయల్‌ కోర్టు విఫలమైందని పేర్కొంది. మద్యం పాలసీ వెనుక ఉన్న భారీ కుట్రను మొత్తంగా చూడకుండా, విడి విడి అంశాలుగా పరిగణించడం వల్ల కేసు నీరుగారిందని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే, దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీబీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది దర్యాప్తు సంస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని, ఆ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఈ నెల 9న జస్టిస్‌ స్వరణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

Updated Date - Mar 02 , 2026 | 02:58 AM