Share News

క్యాన్సర్‌ మందుల ధరలకు కళ్లెం!

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:05 AM

క్యాన్సర్‌ బాధితులకు భారీ ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌ షెడ్యూల్‌ ్డ(ధరల నియంత్రణ పరిధిలో లేని) కేటగిరీకి చెందిన అన్ని రకాల క్యాన్సర్‌ మందుల గరిష్ఠ..

క్యాన్సర్‌ మందుల ధరలకు కళ్లెం!

  • మార్జిన్‌ 30 శాతానికి పరిమితం

  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

  • ఈ నెలాఖరు నుంచి అమలు

  • క్యాన్సర్‌ రోగులకు ఊరట.. ఏటా రూ.2500 కోట్లు ఆదా

  • 110 రకాల క్యాన్సర్‌ ఔషధాల ధరలు దిగివచ్చే అవకాశం

న్యూఢిల్లీ, అక్టోబరు 8: క్యాన్సర్‌ బాధితులకు భారీ ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌ షెడ్యూల్‌ ్డ(ధరల నియంత్రణ పరిధిలో లేని) కేటగిరీకి చెందిన అన్ని రకాల క్యాన్సర్‌ మందుల గరిష్ఠ అమ్మకపు ధరపై(ఎంఆర్‌పీ) ట్రేడ్‌ మార్జిన్‌ను 30శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా క్యాన్సర్‌ రోగులకు ఏడాదికి రూ. 2,500 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నిబంధన బ్రాండెడ్‌, జెనరిక్‌, స్వదేశీ, దిగుమతి చేసుకున్న మందులతో పాటు పేటెంటెడ్‌, నాన్‌- పేటెంటెడ్‌ ఔషధాలన్నింటికీ వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఔషధ మార్కెట్‌లో క్యాన్సర్‌ మందుల సరఫరా వ్యవస్థలో వచ్చే అధిక లాభాలకు చెక్‌ పెట్టడంతో పాటు రోగులపై ఆర్థికభా రం పడకుండా చూడటమే లక్ష్యంగా ఈ ట్రేడ్‌ మార్జిన్‌ రేషనలైజేషన్‌(టీఎంఆర్‌) విధానాన్ని తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు నుంచే అమల్లోకి రానున్న ఈ నిర్ణయం ద్వారా 35రకాల పేటెంట్‌ మందులు సహా మొత్తం 110 రకాల క్యాన్సర్‌ ఔషధాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కాగా, క్యాన్సర్‌ మందుల విపరీత ధరలపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రీటైలర్లకు రూ.2,700కు లభించే మందు ను రూ. 27వేల ఎమ్మార్పీతో విక్రయించడంపై మండిపడింది.


అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాజా కేసుతో సంబంధం లేదని, 2019 నుంచే దీనిపై కసరత్తు జరుగుతోందని కేంద్రవర్గాలు స్పష్టం చేశాయి. కాగా, ఫార్మా కంపెనీలు అనైతిక వ్యాపారాలు చేయకుండా నియంత్రించే విషయమై సిఫార్సులు చేసేందుకు కమిటీ ఏర్పా టు చేయాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి సూచించింది. అనైతిక వ్యాపారాల నియంత్రణకు చట్టాన్ని రూపొందించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపి ఈ సూచన చేసింది.

Updated Date - Oct 09 , 2026 | 05:07 AM