తగ్గిన క్యాన్సర్ ఔషధ ధరలు.. రేపటి నుంచి అమల్లోకి
ABN , Publish Date - Nov 08 , 2026 | 02:41 AM
వివిధ బ్రాండ్లకు చెందిన 137 క్యాన్సర్ ఔషధాల ధరలు ఈ నెల 9 నుంచి గణనీయంగా తగ్గనున్నాయి. దీనివల్ల వినియోగదారులకు ఏటా రూ.3,502 కోట్ల మేర ఆదా కానుంది.
న్యూఢిల్లీ, నవంబరు 7: వివిధ బ్రాండ్లకు చెందిన 137 క్యాన్సర్ ఔషధాల ధరలు ఈ నెల 9 నుంచి గణనీయంగా తగ్గనున్నాయి. దీనివల్ల వినియోగదారులకు ఏటా రూ.3,502 కోట్ల మేర ఆదా కానుంది. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు 137 క్యాన్సర్ మందుల ట్రేడ్ మార్జిన్‌పై పరిమితి విధిస్తూ ఎన్‌పీపీఏ ఇటీవల ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీంతో ఫార్మా కంపెనీలు తగ్గించిన ధరలపై ఔషధాలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఇప్పటి వరకు 76 ఫార్మా సంస్థలు 121 ఔషధాలకు సంబంధించి (1,125 ఫార్ములేషన్స్) సవరించిన గరిష్ట విక్రయ ధర (ఎంఆర్‌పీ)లతో జాబితాను అందజేశాయి. 600 బ్రాండ్ల మందుల ధర 50 శాతానికి పైగా తగ్గింది. కొన్ని ఔషధాలపై గతంతో పోల్చితే 96.45 శాతం వరకు ధర తగ్గడం గమనార్హం. ఇంకా మన దేశంలో విడుదల కాని 10-15 ఔషధాలను సైతం ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (టీఎంఆర్) పరిధిలోకి చేర్చారు. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో వినియోగించే బాల్‌బోప్రో (ఆర్‌పీజీ లైఫ్) క్యాప్సుల్ ధర రూ.40,421 నుంచి రూ.2,720కు తగ్గింది. పొస్ర్టేట్ క్యాన్సర్‌లో వినియోగించే అబిరోన్ (అవిన్‌కేర్ ఫార్మా) ట్యాబ్లెట్ ధర సైతం రూ.41,250 నుంచి రూ.3,218కు దిగొచ్చింది.