క్యాన్సర్ మందుల తగ్గింపు ధరలు అమల్లోకి
ABN , Publish Date - Nov 10 , 2026 | 02:09 AM
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 1,364 రకాల ఔషధాల తగ్గింపు ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
1,364 రకాల ఔషధాలపై తగ్గింపు
రోగులకు ఏటా రూ.3,540 కోట్ల మేర ఆదా
న్యూఢిల్లీ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 1,364 రకాల ఔషధాల తగ్గింపు ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా రోగులకు ఏటా దాదాపు రూ.3,540.38 కోట్ల మేరకు ఆదా కానుంది. నవంబర్ 8 నాటికి 85 ఔషధ కంపెనీలు 1,364 ఉత్పత్తులపై సవరించిన ధరలను ప్రకటించాయి. వీటిలో 679 బ్రాండ్ల మందుల ధరలు 50శాతానికి పైగా తగ్గాయి. కొన్ని మందుల ధరల్లో అత్యధికంగా 96.45 శాతం వరకు కోత పడింది. ఔషధ ప్యాకెట్లపై ముద్రించిన కొత్త ఎంఆర్పీ ధరలను వినియోగదారులు నేరుగా పరిశీలించవచ్చు. మందుల ధరల వివరాలను సరిచూసుకోవడానికి ‘ఫార్మా సహీ దామ్’ మొబైల్ యాప్ లేదా ఎన్పీపీఏ అధికారిక వెబ్సైట్ వినియోగించుకోవచ్చని కేంద్రం సూచించింది. ఎవరైనా నిర్థారిత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తే ఎన్పీపీఏ హెల్ప్‌లైన్ నంబర్ 1800-111-255కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కేంద్రం సూచించింది.