మా పెద్దన్న బీజేపీ అధికార ప్రతినిధి
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:36 AM
భబానీపూర్ నియోజకవర్గం ఎన్నిక ఫలితాన్ని సవాలు చేస్తూ మాజీ సీఎం మమత దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌పై తొలిరోజైన మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఈ విషయం ముందే చెబుతున్నా
మమతా బెనర్జీ ఎన్నికల పిటిషన్‌పై విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు జడ్జి వ్యాఖ్య
అభ్యంతరమేమీ లేదన్న మమత లాయర్
కోల్‌కతా, జూన్ 23: భబానీపూర్ నియోజకవర్గం ఎన్నిక ఫలితాన్ని సవాలు చేస్తూ మాజీ సీఎం మమత దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌పై తొలిరోజైన మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన కుటుంబ సభ్యులకు అధికార పార్టీతో సంబంధం ఉన్నందున తాను కేసును చేపట్టవచ్చా అని స్వయంగా న్యాయమూర్తే ప్రశ్నించగా, జడ్జిపై సంపూర్ణమైన విశ్వాసం ఉందని మమత తరఫు న్యాయవాది చెప్పడం ఆసక్తి కలిగించింది. కేసును స్వీకరించిన జస్టిస్ గౌరాంగ్ కాంత్ తొలుత మాట్లాడుతూ తన పెద్దన్న బీజేపీ జాతీయ అధికారిగా పనిచేస్తున్నారని, దీనిపై ఏమైనా అభ్యంతరం ఉందా అని ప్రశ్నించారు. తరువాత ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. మమత తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సమాధానమిస్తూ తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. న్యాయమూర్తిపై తమకు సంపూర్ణమైన విశ్వాసం, గౌరవం ఉందని తెలిపారు. న్యాయం కోసం వచ్చామని, వ్యక్తులు ఎవరన్నది తమకు ముఖ్యం కాదని అన్నారు. దాంతో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, కౌంటింగ్ రోజునాటి సీసీటీవీ కెమేరా ఫుటేజీలను భద్రపరచాలని సంబంధిత అధికారులకు న్యాయమూర్తి ఆదేశించారు. కేసుపై విచారణ ముగిసే వరకు జిల్లా ఎన్నికల అధికారి వద్ద వాటిని భద్రపరచాలని, ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకూడదని ఆదేశించారు. భబానీపూర్‌లో ఓట్ల లెక్కింపులో 12వ రౌండ్ తరువాత నుంచి అక్రమాలు జరిగాయని కల్యాణ్‌బెనర్జీ కోర్టుకు తెలిపారు. తొలుత మమత ఆధిక్యంలో ఉండగా, ఆ రౌండ్ తర్వాత సువేందు మెజార్జీ అనూహ్యంగా పెరిగిందన్నారు.