Share News

డాలర్‌కు పగ్గం.. బ్రిక్స్‌కు జవసత్వాలు!

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:21 AM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పెత్తనం చెలాయిస్తున్న డాలర్‌కు చెక్‌ పెట్టడం, తద్వారా వాణిజ్య అడ్డంకులను తొలగించి... కొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తెరపైకి తేవడమే లక్ష్యంగా బ్రిక్స్‌ దేశాల అడుగులు పడుతున్నాయి.

డాలర్‌కు పగ్గం.. బ్రిక్స్‌కు జవసత్వాలు!

  • కొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశగా బ్రిక్స్‌ దేశాల అడుగులు

  • బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరం భేటీలో దేశాధినేతల కీలక ప్రసంగాలు

  • వాణిజ్యానికి అవరోధాలను తొలగించాలి: ప్రధాని మోదీ

  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బ్రిక్స్‌ దేశాల వైపు మళ్లుతోంది: పుతిన్‌

  • బ్రిక్స్‌ దేశాల మధ్య లావాదేవీలకు స్థానిక కరెన్సీ: పెజెష్కియాన్‌

  • నేటి ఉదయం బ్రిక్స్‌ ప్రధాన సదస్సు ప్రారంభం

  • పుతిన్‌, పెజెష్కియాన్‌లతో విడివిడిగా ప్రధాని మోదీ భేటీ

  • పుతిన్‌కు ‘తిరుక్కురళ్‌’ పుస్తకాన్ని బహూకరించిన మోదీ

  • రష్యా పర్యటనకు రావాలని మోదీకి పుతిన్‌ ఆహ్వానం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పెత్తనం చెలాయిస్తున్న డాలర్‌కు చెక్‌ పెట్టడం, తద్వారా వాణిజ్య అడ్డంకులను తొలగించి... కొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తెరపైకి తేవడమే లక్ష్యంగా బ్రిక్స్‌ దేశాల అడుగులు పడుతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం సహా ఇటీవలి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి, సరఫరా వ్యవస్థలకు ఎదురైన ఇబ్బందులకు చెక్‌పెట్టడం దిశగా చర్యల కోస ప్రతిష్ఠాత్మక బ్రిక్స్‌ సదస్సును వేదికగా చేసుకుంటున్నాయి. శనివారం నుంచి ప్రారంభమవుతున్న బ్రిక్స్‌ సమావేశాలకు సన్నాహకంగా.. శుక్రవారం జరిగిన బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరం లీడర్ల సమావేశంలోనే.. ఆ దిశగా సంకేతాలు ఇచ్చాయి. వాణిజ్య అడ్డంకులను తొలగించి, జాతీయ కరెన్సీలతో లావాదేవీలు పెంచాలని.. పెట్టుబడులకు కొత్త మార్గాలు తెరవాలని ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ పిలుపునిచ్చారు.


వాణిజ్య అడ్డంకులను తొలగించాలి: మోదీ

ప్రపంచ వాణిజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండటం, స్వేచ్చా నౌకాయానం, నావికుల భద్రత అత్యంత కీలకమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నౌకాయాన స్వేచ్ఛకు భారత్‌ గట్టిగా మద్దతు ఇస్తుందని చెప్పారు. బ్రిక్స్‌ దేశాలు పెరుగుతున్న ఆర్థిక బలాన్ని పెట్టుబడులు, వాణిజ్యం, సాంకేతిక, వ్యాపార భాగస్వామ్యాలుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘బ్రిక్స్‌ కూటమి, భాగస్వామ్య దేశాలు కలిపి ప్రపంచ జనాభాలో సగం, ప్రపంచ జీడీపీలో 40శాతం, ప్రపంచ వాణిజ్యంలో నాలుగో వంతుకుపైగా వాటా కలిగి ఉన్నాయి. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ జీడీపీ 2.5 రెట్లు మాత్రమే పెరిగితే.. బ్రిక్స్‌ దేశాల ఉమ్మడి జీడీపీ 4.5 రెట్లు పెరిగింది. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్‌ దేశాలు కీలక పాత్ర పోషించాలి. కూటమిలోని 10 ముఖ్యమైన వాణిజ్య అడ్డంకులను గుర్తించి తొలగించాలి. ఏటా 100 బ్రిక్స్‌ స్టార్ట్‌పలు ఇతర సభ్యదేశాల మార్కెట్లలోకి విస్తరించేలా చూడాలి’’ అని సూచించారు. యూపీఐ చెల్లింపుల విధానాన్ని ప్రస్తావిస్తూ.. భారత డిజిటల్‌ మౌలిక వసతులను బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారానికి ఉపయోగించుకోవాలన్నారు.


ప్రత్యేక పెట్టుబడుల వేదిక కావాలి: పుతిన్‌

బ్రిక్స్‌ దేశాల్లో వాణిజ్యం, మౌలిక వసతులు, లాజిస్టిక్స్‌, సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు న్యూడెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) ఆధారంగా కొత్త పెట్టుబడి వేదికను ఏర్పాటు చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రతిపాదించారు. సదురు వేదిక ప్రైవేటు రంగ నిధులను సమీకరించడంపై దృష్టిపెడుతుందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బ్రిక్స్‌ దేశాల వైపు మళ్లుతోందని తెలిపారు. బ్రిక్స్‌ దేశాల్లోని విజయవంతమైన కంపెనీలను ప్రస్తావిస్తూ.. భారత్‌కు చెందిన మహీంద్రా, చైనా హువావే, బ్రెజిల్‌ ఎంబ్రాయర్‌, యూఏఈ కంపెనీ టీపీవో, రష్యా కంపెనీ రోసటామ్‌లను ఉదహరించారు. బ్రిక్స్‌ దేశాల మధ్య విస్తరిస్తున్న ఆర్థిక సహకారం మరెవరికీ వ్యతిరేకం కాదని, ప్రపంచంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇక వాణిజ్య ఆంక్షలు, రవాణా మార్గాలపై ఒత్తిళ్లు, నౌకల స్వాధీనం, అనుబంధ ఆంక్షలు వంటి చర్యలు వికారమైన రూపాన్ని సంతరించుకుంటున్నాయని విమర్శించారు.


బ్రిక్స్‌ మధ్య స్థానిక కరెన్సీ: పెజెష్కియాన్‌

బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యం కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పరిమిత సంఖ్యలో కరెన్సీలపై ఆధారపడటంతో.. రాజకీయ ఒత్తిళ్లకు గురికావాల్సిన పరిస్థితి నెలకొందని స్పష్టం చేశారు. వాణిజ్య సహకారాన్ని వాస్తవ పెట్టుబడులుగా మార్చేందుకు ‘బ్రిక్స్‌ న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ)’ ప్రధాన చోదకశక్తిగా మారాలన్నారు. భారీ మౌలిక వసతులు, ఇంధన ప్రాజెక్టులకు బీమా కల్పించేందుకు రూ.96 వేల కోట్ల (10 బిలియన్‌ డాలర్ల) మూలధనంతో బ్రిక్స్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అపారమైన ఇంధన వనరులు, కీలక భౌగోళిక స్థానంలో ఉన్న ఇరాన్‌.. బ్రిక్స్‌ ఇంధన, ఆహార, రవాణా, ఇతర సరఫరా గొలుసుల్లో వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఏ దేశమూ మరో దేశ చట్టబద్ధమైన వాణిజ్యాన్ని అడ్డుకోలేని వాతావరణాన్ని బ్రిక్స్‌ సృష్టించాలని కోరారు.


మోదీ, పుతిన్‌ భేటీ..

ప్రతిష్ఠాత్మక బ్రిక్స్‌ సదస్సుకు ముందు ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. భేటీలో కూర్చునే ముందు ఇరువురు నేతలు మర్యాదపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో.. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, రక్షణ సహకారం, పౌర అణు ఇంధనం, ఎరువులు, ఉక్కు, కీలక ఖనిజాలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వీలైనంత త్వరగా దౌత్యమార్గంలో ముగింపు పలకాలన్న భారత వైఖరిని ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక అమెరికా ఆంక్షలున్న సమయంలోనూ రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు కొనసాగుతుండటం నేపథ్యంలో ఇంధన భద్రత, సహకారంపైనా ఇరువురు నేతలు సమీక్షించినట్టు సమాచారం. కాగా, భారత్‌-రష్యా 24వ వార్షిక సమావేశం కోసం రష్యాకు రావాల్సిందిగా ప్రధాని మోదీని రష్యా పుతిన్‌ ఆహ్వానించారు. ఇందుకు మోదీ అంగీకరించారు.


పెజెష్కియాన్‌-మోదీ భేటీ

ప్రధాని మోదీ, ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ శుక్రవారం సాయంత్రం భారత్‌ మండపంలో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో పరిస్థితిని సమీక్షించడంతోపాటు ఇరుదేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఇరుదేశాల మధ్య చెల్లింపులలో స్థానిక కరెన్సీల వినియోగం అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఇరాన్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు పెజెష్కియాన్‌ మాట్లాడుతూ.. ప్రపంచ ఏకపక్ష ధోరణులు, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా బ్రిక్స్‌ సదస్సులో చర్చించనున్నట్టు పేర్కొనడం గమనార్హం. అధ్యక్ష పదవి చేపట్టాక పెజెష్కియాన్‌ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి.

పుతిన్‌కు ‘తిరుక్కురళ్‌’ బహూకరణ..

భారత్‌ మండపంలో భేటీ అనంతరం పుతిన్‌కు రష్యా భాషలోకి అనువదించిన ‘తిరుక్కురళ్‌’ గ్రంథాన్ని మోదీ బహూకరించారు. ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్‌ రచించిన ప్రసిద్ధమైన పుస్తకం ఇది. మనుషుల ప్రవర్తన, ఇతరులతో మెలగాల్సిన తీరు, జీవితం, మరణం, వీటితో ముడిపడి ఉన్న అంశాలతో నైతిక ప్రవర్తనకు సంబంధించి మంచి పుస్తకంగా దీనికి పేరుంది. ఇక ద్వైపాక్షిక భేటీ అనంతరం పుతిన్‌, మోదీ ఇద్దరూ పుతిన్‌ ప్రత్యేక వాహనం ‘ఆరస్‌ సెనేట్‌ లిమోజిన్‌’ కారులో భారత్‌ మండపం కాంప్లెక్స్‌లోనే జరిగిన బిజినెస్‌ ఫోరమ్‌ సమావేశానికి వెళ్లారు. గత ఏడాది చైనాలో జరిగిన షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) సదస్సుకు హాజరైన సందర్భంగా, గత డిసెంబర్‌లో పుతిన్‌ భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా పుతిన్‌తో కలిసి మోదీ ఈ వాహనంలో ప్రయాణించడం గమనార్హం.

Updated Date - Sep 12 , 2026 | 06:18 AM