రేపటి నుంచే బ్రిక్స్ సదస్సు
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:33 AM
ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాల్లో కీలకశక్తిగా ఎదుగుతున్న బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సుకు న్యూఢిల్లీ ముస్తాబైంది. భారత్ నాయకత్వంలో ఈ నెల 12, 13వ తేదీల్లో జరిగే సదస్సుకు..
ఢిల్లీలోని భారత్ మండపంలో 2 రోజులు నిర్వహణ
సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా జిన్‌పింగ్
ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు
పుతిన్, పెజెష్కియాన్ సహా ప్రపంచ నేతల రాక
వాణిజ్యం, ఆర్థిక సహకారం పెంపుపై దృష్టి
స్థానిక కరెన్సీల్లో చెల్లింపులపై చర్చలు
భద్రతా వలయంలోకి దేశ రాజధాని
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాల్లో కీలకశక్తిగా ఎదుగుతున్న బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సుకు న్యూఢిల్లీ ముస్తాబైంది. భారత్ నాయకత్వంలో ఈ నెల 12, 13వ తేదీల్లో జరిగే సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన మొదటిసారి భారత్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. అలాగే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమసోఫా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిసీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తదితర అగ్రనేతలు హాజరుకానున్నారు. యూఏఈ తరఫున యువరాజు షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొననున్నారు. వీరికి ప్రధాని మోదీ ప్రత్యేక అతిథ్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా సదస్సుకు ముందు రోజు శుక్రవారం ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. వాణిజ్యం, ఆర్థిక సహకారం బలోపేతంపై చర్చించనున్నారు. ఇక ట్రంప్ రక్షణాత్మక వాణిజ్య విధానాలు, ఏకపక్ష సుంకాలతో ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయిన వాణిజ్య అనిశ్చితులు, అవరోధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో.. ఆహార భద్రత, ఇంధన స్థిరత్వం, సరఫరా వ్యవస్థలను కాపాడుకోవడం, వాణిజ్యం, పెట్టుబడుల పెంపు తదితర అంశాలకు ఈ సదస్సులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. డాలర్‌పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు స్థానిక కరెన్సీల్లోనే వాణిజ్య లావాదేవీలను నిర్వహించుకోవడంపై చర్చించనున్నారు. కాగా, ఇరాన్-యూఏఈ మధ్య విభేదాల కారణంగా ఈసారి ఉమ్మడి ప్రకటన వెలువడడంపై సందేహం నెలకొంది. ఎందుకంటే ఈ ఏడాది మేలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలోనూ ఉమ్మడి ప్రకటన విడుదల కాలేదు.
పటిష్ట భద్రత..
ఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా రెండు రోజుల పాటు జరిగే సదస్సుకు ప్రపంచనేతలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి విదేశీ నేతలు బసచేసే హోటళ్లు, అక్కడి నుంచి సదస్సు జరిగే భారత్ మండపం వరకు సుమారు 25,000-30,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎన్‌ఎ్‌సజీ కమెండోలను రంగంలోకి దింపడంతోపాటు యాంటీ డ్రోన్ వ్యవస్థలు, పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు చర్యలను తీసుకున్నారు.
బ్రిక్స్ దేశాలు..
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో తొలుత ఏర్పాటైందే బ్రిక్స్ కూటమి. ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా సైతం 2025లో సభ్యదేశాలుగా చేరాయి. ఆ తర్వాత బెలారస్, బొలీవియా, కజకిస్థాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, యుగాండా, ఉజ్బెకిస్థాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా బ్రిక్స్‌తో చేతులు కలిపాయి. ప్రపంచ జనాభాలో 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 26 శాతానికి బ్రిక్స్ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది.