Share News

ఊపందుకున్న ‘బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ’

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:50 AM

బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ నినాదం ఊపందుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఆ చాట్‌బాట్‌ను 25 లక్షల మంది బహిష్కరించారని ఈ కార్యక్రమాన్ని ట్రాక్‌ చేస్తున్న వెబ్‌సైట్‌ పేర్కొంది.

ఊపందుకున్న ‘బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ’

  • 25 లక్షల మంది ఇప్పటికే బహిష్కరణ

  • అమెరికాతో ఒప్పందమే కారణం

న్యూఢిల్లీ, మార్చి 4: బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ నినాదం ఊపందుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఆ చాట్‌బాట్‌ను 25 లక్షల మంది బహిష్కరించారని ఈ కార్యక్రమాన్ని ట్రాక్‌ చేస్తున్న వెబ్‌సైట్‌ పేర్కొంది. అమెరికాతో గత వారం ఓపెన్‌ఏఐ ఒప్పందం చేసుకోవడమే బాయ్‌కాట్‌కు కారణం. ఆ దేశ రక్షణ శాఖ తన క్లాసిఫైడ్‌ నెట్‌వర్క్‌లో ఓపెన్‌ఏఐకు చెందిన ఏఐ మోడల్‌ను వినియోగించేందుకు ఆ ఒప్పందం జరిగింది. యుద్ధరంగంలలో దీనిని వాడతారనే ఆందోళనతో యూజర్లు బాయ్‌కాట్‌కు పిలిపునిస్తున్నారు. ఈ ఒప్పందం నుంచి ఆంథ్రోపిక్‌ తప్పుకున్న వెంటనే ఓపెన్‌ఏఐతో ఒప్పందం జరగడం వివాదమైంది. వెబ్‌సైట్‌ సిగ్నేచర్లు, సోషల్‌ మీడియాలో షేర్లు, యాప్‌ వాడకం డేటాను బట్టి చూస్తే చాట్‌జీపీటీకి యూజర్లు వేగంగా దూరం అవుతున్నారని ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ అంచనా వేసింది. చాట్‌జీపీటీని బహిష్కరించాలని అమెరికన్లకు, ప్రపంచవ్యాప్త యూజర్లకు చెబుతున్నామని ఆ వెబ్‌సైట్‌ పేర్కొంది. చాట్‌జీపీటీని రక్షణాత్మక పరిస్థితిలోకి నెట్టడం వల్ల ఐసీఈ ఎనేబర్లకు కూడా ఓ ఉదాహరణగా ఉంటుందని తెలిపింది. కాగా, యాపిల్‌ స్టోర్‌ డేటాను బట్టి చూస్తే ఆంథ్రోపిక్‌ చాట్‌బాట్‌ క్లాడ్‌, చాట్‌జీపీటీని దాటి దూసుకెళుతోంది. రోజురోజుకు చాట్‌జీపీటీ అన్‌ఇన్‌స్టాలేషన్లు 295 శాతం పెరిగాయని టెక్‌ క్రంచ్‌ నివేదిక స్పష్టంచేసింది. ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. తమ ఒప్పందం చాలా తక్కువ సమయంలో కుదిరిందని, తొందరపడకుండా ఉండాల్సిందని చెప్పారు. ఉద్రిక్తతను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ ఒప్పందాన్ని మార్చడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ది గార్డియన్‌ పత్రిక తెలిపింది.

Updated Date - Mar 05 , 2026 | 01:51 AM